'కడైసీ వివసాయి (చివరి రైతు)' మూవీ రివ్యూ..

by Manoj |
కడైసీ వివసాయి (చివరి రైతు) మూవీ రివ్యూ..
X

దిశ, సినిమా: ప్రకృతి ప్రకోపానికి గురైన ఊరు.. కుల దైవమే కాపాడుతుందని నమ్మిన ప్రజలు.. ఆ దైవానికి నైవేద్యాన్ని సమర్పించగలిగే ఒకే ఒక్క రైతు.. అన్ని కులాలకు ఆతిథ్యమిచ్చి అంగరంగ వైభవంగా జరపాలనుకున్న ఉత్సవం.. అంతా కలగానే మిగిలిపోయింది. చీమకు కూడా హానికలిగించని ఆ అన్నదాత ఊచలు లెక్కబెట్టాల్సి వచ్చింది. ఆ పాపం చేసి ఉండడని నమ్మిన చట్టం గుడ్డిగా తన పని తాను చేసుకుపోయింది. ఊరిపై ఖాకీలు పెంచుకున్న పాత కక్ష అమాయకుని పాలిట శాపమైంది. ఎప్పుడెప్పుడు పొలాన్ని చూద్దామా అనుకున్న ఆ అమాయకత్వానికి ప్రతీసారి నిరాశే మిగిలింది. ఇక బయటపడే రోజు వచ్చిందనుకునే సమయానికి.. అలిసిన ఆ ముసలి ప్రాణం ఏమైపోయింది? ఆయన విషయంలో తప్పుచేసిన చట్టం ఏం సమాధానం చెప్పింది? ఖాకీలు తమ ఖాతాలో మరో పాపం మూటగట్టుకున్నారా? తెలియాలంటే 'కడైసీ వివసాయి(చివరి రైతు)' చూడాల్సిందే.

కథ :

కరువుతో అల్లాడుతున్న ఊరిపై మరో గుదిబండ మోపినట్లు వందల ఏళ్లనాటి చెట్టుపై పిడుగు పడటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతారు. ఈ బాధల నుంచి బయటపడాలంటే కులదైవానికి ఉత్సవాలు నిర్వహించాలని సంకల్పిస్తారు. ఊరు పెద్దలంతా ఆ గ్రామంలో వ్యవసాయం చేస్తున్న చివరి రైతు మాయాండి దగ్గరికెళ్లి.. ఉత్సవాలకు వరి గింజలు ఇచ్చే బాధ్యత తీసుకోవాలని కోరతారు. ఊరి మేలు కోసం మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్న ఆ రైతు.. తన బావిలో ఉన్న నీటితోనే వ్యవసాయం చేసేందుకు పూనుకుంటాడు. ఆడబిడ్డ చేతుల మీదుగా సాగుకు శ్రీకారం చుట్టి.. దుక్కి దున్ని నారు పోస్తాడు. అయితే అంతకుముందే ఆ ఊరికి చెందిన వడ్డీ వ్యాపారి.. మాయాండను భూమి అమ్మాలని కోరుతాడు. కానీ భూమి లేకుంటే నేనెందుకు జీవించడమన్న సమాధానం ఎదురవడంతో కోపం పెంచుకున్న వ్యాపారి.. సదరు రైతు పొలం పరిసరాల్లో నెమళ్లను చంపేసి పడేస్తాడు. మొక్కను కూడా ప్రాణమున్న జీవి అని, మనిషితో సమానమని నమ్మే రైతు.. ఆ మూడు నెమళ్లకు అంతిమ సంస్కారం నిర్వహించి భూమిలో పాతిపెడతాడు. ఇది కాస్తా పక్షులను వేటాడే ఓ వ్యక్తి చూసి తనకు నెమళ్లను ఇమ్మని కోరగా.. అలా చేయొద్దని తిట్టి పంపించేస్తాడు. కానీ ఆ వ్యక్తి నేరుగా వెళ్లి పోలీసులకు సమాచారమివ్వడంతో కథ మలుపు తిరుగుతుంది. పాత కక్షలు మనసులో పెట్టుకున్న పోలీసులు.. ఆ రైతుకు తెలియకుండానే కేసు పెట్టడం, తీసుకెళ్లి విచారించడం, కోర్టు ముందు నిలబెట్టడం జరిగిపోతుంది. కానీ అమాయకపు రైతును చూసిన జడ్జి మాత్రం ఇది జరిగి ఉండదనే నమ్మకంతో విచారించగా.. తాను నెమళ్లను చంపలేదని, చంపిన నెమళ్లను పాతిపెట్టానని చెప్పడంతో ఖాకీలకు అక్షింతలు పడతాయి. అయినా సరే ఒక్కసారి కేసు నమోదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి కాబట్టి రైతు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఈ విషయం తెలిసిన ఊరి ప్రజలు ఏం చేశారు? కులదైవం కోసం పండించాల్సిన పంట ఏమైపోతుంది? చివరకు ఉత్సవాలు జరిగాయా? లేదా? ఇంతకీ అన్నదాత మనవడి పరిస్థితి ఏంటి? అనేది కథ.

ప్లస్ పాయింట్స్:

* విత్తనాలు లేని టమోటా కన్వర్జేషన్‌తో పెస్టిసైడ్స్ కంపెనీలపై సెటైర్

* జైలులో ఖైదీకి సైతం అన్నదాత వ్యవసాయ పాఠాలతో తర్వాతి జీవితం బేఫికర్

* విజయ్ సేతుపతి పాత్ర ద్వారా ప్రేమకు కాలంతో పనిలేదనే సందేశం

* ఫిలాసఫికల్ ఫిగర్ యోగిబాబు సెటైరికల్ డైలాగ్‌ ద్వారా విలన్ ఎవరో చెప్పేసిన విధానం

* రైతు భూమిని అమ్ముకున్నా.. నమ్ముకున్నా.. అంతా ఆయన ఇష్టప్రకారమే జరగాలి, అదే న్యాయం.

* అంగ వైకల్యం, బాల్డ్ హెడ్ పాత్రల ద్వారా నెగెటివిటీతో బాధపడకూడదనే మెసేజ్.

* కుమ్మరి చేసే కుండలతో.. కులాల కన్నా మనుషుల బాగోగులే ముఖ్యమనే సారాంశం

* చట్టం వేసిన శిక్షతో వ్యవసాయం చేసిన ఖాకీ కూడా అందులోనే ప్రశాంతత పొందిన విధానం

* డైరెక్షన్, స్క్రీన్‌ప్లే, కెమెరా పనితనం.. ముఖ్యంగా జైలు గోడల నడుమన సైతం చెట్లనే చూస్తున్న రైతు షాట్

* మ్యూజిక్ : శ్రుతి మించకుండా సీన్‌లోనే కలిసిపోయే బీజీఎం

* మౌనంగానే ఉంటూ హృదయాన్ని తాకిన అన్నదాత కథ.. కన్నీరు పెట్టించిన తీరు

* ఉత్సవాలు ముగిశాక.. నెమలి నాట్యం.. ఆ వెంటనే మేఘాలు కమ్ముకున్న ఆకాశం.

Advertisement

Next Story

Most Viewed