హీరో మోటోకార్ప్ ఆఫీసు, నివాస ప్రాంతాల్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు!

by Javid Pasha |
హీరో మోటోకార్ప్ ఆఫీసు, నివాస ప్రాంతాల్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు!
X

న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ సంస్థకు సంబంధించిన కార్యాలయాలు, పలువురి నివాస స్థలాల్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. సంస్థ ఛైర్మన్, సీఈఓ పవన్ ముంజల్‌తో సహా సీనియర్ మేనేజ్‌మెంట్ నివాస, ఆఫీస్ ప్రాంగణాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. పన్ను ఎగవేత ఆరోపణల కారణంగానే తనిఖీలు చేపట్టినట్టు సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. కంపెనీలోని కొందరు సీనియర్ అధికారులపై విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన వివరాల ఆధారంగానే ఈ చర్యలు తీసుకున్నామని, గురువారం కూడా ప్రక్రియ కొనసాగవచ్చని ఐటీ అధికారులు పేర్కొన్నారు.

కంపెనీ ఆఫీసులతో పాటు కొందరు సీనియర్ మేనేజ్‌మెంట్లకు చెందిన మొత్తం 35 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. కంపెనీ, ప్రమోటర్లకు చెందిన డాక్యుమెంట్లు, లావాదేవీలను పరిశీలిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. అలాగే, కంపెనీకి అనుబంధంగా ఉండే మరికొన్ని ప్రాంతాల్లో కూడా సోదాలు జరుగుతాయని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి హీరో మోటోకార్ప్ అధికారికంగా ఇంకా స్పందించలేదు. కాగా కంపెనీ దేశంలోని మోటార్‌సైకిల్ మార్కెట్లో 50 శాతానికి పైగా వాటాతో మార్కెట్ లీడర్‌గా ఉంది. అంతేకాకుండా 40 దేశాల్లో కంపెనీ ఉనికిని కలిగి ఉంది.

Advertisement

Next Story