ఇమ్రాన్ చివరి బంతి వరకు పోరాడుతారు: పాక్ మంత్రి

by Harish |
ఇమ్రాన్ చివరి బంతి వరకు పోరాడుతారు: పాక్ మంత్రి
X

న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ రాజీనామాపై వస్తున్న పుకార్లపై మంత్రి ఫవాద్ చౌదరీ స్పష్టతనిచ్చారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చివరి బంతి వరకు పోరాడే ఆటగాడని, ఆయన రాజీనామా చేయబోడని ట్వీట్ చేశారు. అధికారంలో ఉన్న ఇమ్రాన్ పార్టీకి మరో దెబ్బ తగిలింది. మిత్రపక్షాలలో ముఖ్యమైనదిగా ఉన్న ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్-పాకిస్థాన్(ఎంక్యూఎం-పీ) తప్పుకుంది. విపక్షాలతో చేరుతున్నట్లు ప్రకటించింది. ఎంక్యూఎంపీ మద్దతు ఉపసంహరణతో ఇమ్రాన్ ప్రభుత్వ బలం 164 కు పడిపోయింది. అదే సమయంలో విపక్షాల బలం 176 కు పెరిగింది. మరోవైపు అధికార పార్టీ నుంచే కొందరు సభ్యులు ఇమ్రాన్ పై తిరుగుబాటు జెండా ఎగర వేసిన సంగతి తెలిసిందే.

ప్రసంగం రద్దు

అవిశ్వాస తీర్మానానికి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జాతినుద్దేశించి చేద్దామనుకున్న ప్రసంగం రద్దయింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)తో సమావేశంతో ప్రసంగాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని పాకిస్తాన్ సెనేటర్ ఫైజల్ జావేద్ ఖాన్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. మరోవైపు మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా తప్పుకుంటుండడంతో ఇమ్రాన్ కు పదవి గండం పట్టుకుంది.

ఇమ్రాన్ ఇప్పుడు ప్రధాని కాదు

పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ నేషనల్ అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయాడని, విపక్ష నేత షాబాజ్ షరీఫ్ త్వరలోనే దేశానికి ప్రధాని అవుతారని వ్యాఖ్యానించారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తొందర్లోనే అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ఓటింగ్ జరుగుతుందని చెప్పారు. 'ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు మెజారిటీ కోల్పోయారు. ఆయన ఇంకా ప్రధాని కాదు. గురువారం పార్లమెంట్ సెషన్ ఉంది. సమావేశాల్లో ఓటింగ్ నిర్వహించి ఈ అంశాన్ని వెంటనే కొలిక్కి తీసుకురావాలి. పారదర్శకమైన ఎన్నికలు, ప్రజాస్వామ్య పునరుద్ధరణ, ఆర్థిక ఆందోళనలకు ముగింపు పలకడానికి పనులు ప్రారంభిద్దాం' అని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed