కాంగ్రెస్‌కు సోనియానే లీడర్: గులాం నబీ ఆజాద్

by Harish |
కాంగ్రెస్‌కు సోనియానే లీడర్: గులాం నబీ ఆజాద్
X

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే కొనసాగుతారని ఆ పార్టీ సీనియర్ నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ అన్నారు. శుక్రవారం 10 జన్‌‌పధ్ చేరుకున్న ఆయన సోనియాతో భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం గాంధీలు కాంగ్రెస్ అధినాయకత్వం నుంచి తప్పుకోవాలని జీ 23 గ్రూపు సభ్యులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. వీరంతా గులామ్ నబీ ఆజాద్ ఇంట్లో సమావేశం కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే సోనియా ఈరోజు ఆజాద్‌తో సంప్రదింపులు జరిపారు. ఈ భేటీలో అసమ్మతి నేతలకు, పార్టీకి మధ్య సయోధ్య గురించి చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

మీటింగ్ అనంతరం ఆజాద్ జాతీయ మీడియాతో మాట్లాడారు.'కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే కొనసాగుతారు. ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ సోనియా అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని ప్రయత్నించారు. అందుకు సీడబ్లూసీ సీనియర్ నేతలు ఒప్పుకోలేదు. గత ఆదివారం నిర్వహించిన సమావేశంలో శ్రీమతి సోనియా గాంధీనే అధినాయకురాలిగా కొనసాగించాలని సభ్యులు నిర్ణయించారు. ఇక్కడ నాయకత్వం సమస్య కాదు. ఆమె పదవి నుండి నిష్క్రమించాలని ఎవరూ అనలేదు. మేము కొన్ని సూచనలు మాత్రమే చేశాము' అని ఆజాద్ వెల్లడించారు.

Advertisement

Next Story