జోరుగా కలప అక్రమ రావాణా.. పక్కనుండి చేయిస్తున్న అధికారి

by Javid Pasha |
జోరుగా కలప అక్రమ రావాణా.. పక్కనుండి చేయిస్తున్న అధికారి
X

దిశ (కొల్చారం): అటవీ శాఖ అధికారుల తీరు మండల పరిధిలోని రాంపూర్ నర్సరీలో అటవీ శాఖ అధికారులు ఇష్టారాజ్యంగా చెట్లను నరికి కలపను రవాణా చేస్తున్నారు. కలప రవాణాపై ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. కలప రవాణా చేస్తున్న వాహనం వెంట వేబిల్, పర్మిట్ లాంటి ధ్రువీకరణ పత్రాలు ఏవి లేకపోవడంతో అటవీ శాఖ అధికారులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ కలప రవాణా చేస్తున్న వాహనాన్ని గ్రామపంచాయతికి తరలించారు.

కొల్చారం మండలం మెదక్-నర్సాపూర్ జాతీయ రహదారిని ఆనుకుని రాంపూర్ గ్రామ శివారులో ప్రభుత్వ అటవీ శాఖ నర్సరీ ఉంది. నర్సరీలో నీలగిరి చెట్లు ఏపుగా పెరిగాయి. నాలుగు రోజుల క్రితం చెట్లను పూర్తిగా నరికి వేశారు. నరికిన చెట్లను ఓ ప్రైవేటు వ్యక్తి డీసీఎం వ్యానుల్లో లోడ్ చేసి తరలిస్తున్నారు. ఆదివారం రాత్రి ఈ విషయాన్ని గమనించిన గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు మమత, సర్పంచ్ రాంరెడ్డి, సహకార సంఘం అధ్యక్షుడు యాదగిరి, గ్రామస్తులు నర్సరీ నుండి తరలిస్తున్న కలప వ్యాను పట్టుకున్నారు.


కలప రవాణాకు సంబంధించి పూర్తి సమాచారం అడగగా అటవీ అధికారులే తమకు చెట్లను అమ్మారని, అందుకే నరికి రవాణా చేస్తున్నామని సమాధానం వచ్చింది. అయితే కలప అమ్మకానికి సంబంధించి రవాణాకు సంబంధించి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు ఎక్కడ కానరాకపోవడం గమనార్హం. దీంతో అక్కడే ఉండి ఈ తతంగాన్నంతా నడిపిస్తున్న డిప్యూటీ ఆర్ఓ శ్రీనివాస్ చాలాసేపటికి అక్కడికి వచ్చి రెండు నెలల క్రితమే ఈ విషయమై జిల్లా అటవీ శాఖ అధికారికి నర్సరీలో ఉన్న నీలగిరి చెట్లతో మొక్కలు పెంచేందుకు స్థలాభావం ఏర్పడిందని, సమాచారం ఇవ్వగా టెండర్ వేసి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.

ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. సంబంధిత వ్యక్తి వద్ద టెండర్ పత్రాలు, కలప రవాణా, తుదకు కలప రవాణా చేస్తున్న వాహనానికి ధ్రువీకరణ పత్రాలు లేకుండా కలప రవాణా అవుతుండడం విమర్శలకు తావిస్తోంది. పైగా ధృవీకరణ పత్రాలు ఉదయం తెచ్చి పెడతానని చెప్పడం అధికారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా నిలుస్తుంది.ఇప్పటికైనా ఉన్నతాధికారులు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుని నల్లని రాంపూర్ గ్రామస్తులు కోరుతున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా కలప రవాణా: రాంపూర్ సర్పంచ్ రామ్ రెడ్డి

రాంపూర్ శివారులోని అటవీశాఖ నర్సరీలో నిబంధనలకు విరుద్ధంగా అధికారుల దగ్గరుండి చెట్లను నరికి వేయించారు. బహిరంగ వేలంలో విక్రయించాల్సిన చెట్లు గుట్టుచప్పుడు కాకుండా నరికి తరలిస్తున్నారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

Advertisement

Next Story