2022 లో భారత సంపన్నుల జాబితా విడుదల చేసిన ఫోర్బ్స్!

by Harish |
2022 లో భారత సంపన్నుల జాబితా విడుదల చేసిన ఫోర్బ్స్!
X

న్యూఢిల్లీ: భారత్‌ 2022 ఏడాది అత్యంత సంపన్నుల జాబితాను ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ మంగళవారం విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ అగ్ర స్థానంలో కొనసాగుతుండగా, రెండో స్థానంలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీ ఛైర్మన్ శివ్ నాడార్ మూడో స్థానంలో ఉన్నారు. తాజా జాబితాలోని మొదటి మూడు స్థానాల్లో ఎలాంటి మార్పులు జరగలేదని ఫోర్బ్స్ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే ముఖేశ్ అంబానీ మొత్తం సంపద గత ఆర్థిక సంవత్సరం కంటే 7 శాతం పెరిగి 90.7 బిలియన్ డాలర్ల(రూ. 6.83 లక్షల కోట్లు)కు చేరుకుంది. ముఖేశ్ అంబానీ భారత్‌లో అత్యధిక నికర విలువ కలిగిన వ్యక్తిగా మాత్రమే కాకుండా ప్రపంచంలోనే 10వ సంపన్నుడిగా ఉన్నారు.

ఇక, రెండో స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ 90 బిలియన్ డాలర్ల(రూ. 6.77 లక్షల కోట్ల)తో ఆసియాలోనే రెండో అత్యంత సంపన్నుడిగా, ప్రపంచంలోనే 11వ సంపన్నుడిగా ఉన్నారు. వీరి తర్వాత మూడో స్థానంలో శివ్ నాడార్ రూ. 2.16 లక్షల కోట్లతో, కరోనా వ్యాక్సి ఉత్పత్తి చేసే సీరమ్ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకుడు సైరస్ పూనావాలా రూ. 1.83 లక్షల కోట్లతో నాలుగో స్థానంలో, రూ. 1.5 లక్షల కోట్లతో రాధాకృష్ణ దమానీ ఐదో స్థానంలో ఉన్నారు. అలాగే, రూ. 1.34 లక్షల కోట్లతో లక్ష్మీ మిట్టల్ ఆరో స్థానంలో, రూ. 1.33 లక్షల కోట్లతో సావిత్రి జిందాల్ ఏడో స్థానంలో, రూ. 1.24 లక్షల కోట్లతో కుమార్ మంగళం బిర్లా ఎనిమిదో స్థానంలో, రూ. 1.17 లక్షల కోట్లతో దిలీప్ సంఘ్వి తొమ్మిదో స్థానంలో, రూ. 1.07 లక్షల కోట్లతో ఉదయ్ కోటక్ పదో స్థానంలో ఉన్నారు.

ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. గత ఏడాది ప్రపంచంలోనే 100 మంది సంపన్నుల జాబితాలోకి రాధాకృష్ణ దమానీ చోటు సంపాదించారు. ఇక, భారత్‌లో బిలీయనీర్ల సంఖ్య గతేడాది 140 మంది ఉండగా, ప్రస్తుతం రికార్డు స్థాయిలో 166 కి పెరిగారు. అదేవిధంగా గత ఆర్థిక సంవత్సరంలో 60కి పైగా కంపెనీలు ఐపీఓల ద్వారా సుమారు రూ. 1.17 లక్షల కోట్ల నిధులను సమీకరించాయని ఫోర్బ్స్ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed