అన్నదాతను వేధిస్తున్న యూరియా కొరత.. ఆందోళనలో రైతులు

by Satheesh |
అన్నదాతను వేధిస్తున్న యూరియా కొరత.. ఆందోళనలో రైతులు
X

దిశ, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో నిర్మించిన ప్రాజెక్ట్‌ల వల్ల జిల్లాలోని చెరువులు, కుంటలు, బోరు బావులలో పుష్కలంగా నీరు వచ్చి చేరింది. దీంతో రైతులు ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలో వరి సాగు చేశారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం వరి సాగు వద్దని ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని అవగాహన కల్పిస్తూ ఎంత ప్రచారం చేసినా.. వేరే దారి లేక రైతులు పెద్ద మొత్తంలో వరి సాగు చేశారు. అయితే పాలు పోసే దశలో ఉన్న పైరు బలంగా ఉండేందుకు వేయాల్సిన రసాయన ఎరువులకు డిమాండ్‌ పెరిగింది. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

సరిపడా ఎరువులు అందించాలి..

వరి సాగు చేసిన రైతులకు అధిక మోతాదులో యూరియా వాడకం ఉంటుంది. కానీ అవసరానికి సరిపడా ఎరువులు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఒకసారి వరి కలుపు తీసి పంటలకు యూరియా వేశారు. ఇప్పుడు పంట పాలు పోసుకునే దశలో ఉండడంతో మరొకసారి వరికి యూరియా వేయాలి. దీంతో రైతులు యూరియా కోసం ఫెర్టిలైజర్ దుకాణాలతో పాటు అగ్రోస్ రైతు సేవ కేంద్రాల వద్దకు బారులు తీరుతున్నారు. ఎంత తిరిగినా కూడా రైతులకు కావాల్సిన మోతాదులో యూరియా లభించడం లేదు. ఎక్కువ ఎకరాల్లో వరి సాగు చేసిన రైతులకు కోరినన్ని యూరియా బస్తాలు వ్యాపారులు ఇవ్వడం లేదు. యూరియా నిల్వలు సరిపడా లేవని వ్యాపారులు చెబుతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒక రైతుకు ఆధార్ కార్డ్ మీద థంబ్ తీసుకుని ఒకటి, రెండు యూరియా బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. కావలసిన యూరియా లభించక పోవడంతో రైతులు రోజుల తరబడి ఫెర్టిలైజర్ దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా వ్యవసాయ అధికారులు స్పందించి రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచి రైతులకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed