- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆధార్‌లో ‘తెలంగాణ రాష్ట్రం’ రచ్చ.. ఆర్టీసీ బస్సుల్లో ప్రతి మహిళ నోట ఇదే మాట!

దిశ, రాజాపేట: ఆధార్ కార్డులో తెలంగాణ కావాలంట.. నువ్వు మార్చుకున్నావా అక్క.. లేదా? ఎక్కడ మారుస్తరు.. బస్సులో డ్రైవర్ అడుగుతున్నారు తెలంగాణ అని లేకపోతే దిగిపోండని అంటుండ్రు. ఇప్పుడు ప్రతి ఆర్టీసీ బస్సుల్లో ప్రతి మహిళ నోట ఇదే మాట వినపడుతోంది. విషయం ఏంటంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లు గడుస్తున్నా.. నేటికీ ఆధార్ కార్డుల్లో ఇంకా ఆంధ్రప్రదేశ్ అనే వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఉచిత బస్సు స్కీంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రతి మహిళకు ఆధార్ కార్డులో తెలంగాణ అని లేదు కదా అనే మాట వినిపిస్తోంది.
మార్చుకోవాలని సూచిస్తున్న ఆర్టీసీ సబ్బంది
ఆర్టీసీ బస్సులో ఎక్కడికి ప్రయాణించిన టికెట్ ఖర్చు లేకుండా ఉచితంగా ఉండడంతో మహిళలు ఉత్సాహంగా ప్రయాణించేందుకు ముందుకొస్తున్నారు. బస్సులో కండక్టర్ ఆధార చూసినప్పుడు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని దర్శమిస్తుండటంతో తెలంగాణ అని మార్చుకోవాలి కదా.. లేకపోతే మేం చిక్కుల్లో పడుతాం అంటున్నారు. ఉన్నతాధికారులు చెకింగ్‌కు వచ్చిన సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కండక్టర్లు, డ్రైవర్లు మహిళా ప్రయాణికులకు సూచిస్తున్నారు.
ఎక్కడ మార్చుకోవాలి.. ఆధార్ సెంటర్లు లేవు కదా!
రాజపేట మండల పరిధిలోని 23 గ్రామ పంచాయతీల్లో మొత్తం 38,454 జనాభా కలిగి ఉంది. అందులో పురుషులు 19613, మహిళలు 18841 మంది ఉన్నారు. వారందరూ అడ్రస్ మార్చుకోవడానికి సుమారు రెండేళ్లుగా మండల కేంద్రంలో ఆధార్ కేంద్రమే లేదు. జిల్లా కేంద్రమైన భువనగిరిలో మాత్రమే ఆధార్‌ల కరెక్షన్ చేసేందుకు కేంద్రాలు ఉన్నాయి. మహిళలు ఆధార్ సెంటర్‌కు వెళితే.. సరైన ధృవపత్రాలు లేవంటే కార్డులో సవరణలు చేయడం లేదు. నూతన ఓటర్ కార్డు, మీసేవ ద్వారా ధృవీకరించిన రెసిడెన్సి సర్టిఫికెట్ తీసుకువస్తేనే మార్పులకు అవకాశం ఉందని వారు బదిలిస్తున్నారు. అన్ని ధ్రువ పత్రాలు తీసుకువెళ్లిన గంటల తరబడి లైన్లో వేచి చూడాల్సిన పరిస్థితి రోజంతా సమయం వృథా అవుతోందని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఓటర్ కార్డు మారినట్టు మార్చొచ్చు కదా!
తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పడిన తర్వాత ఓటరు కార్డులన్ని ఆన్‌లైన్‌లో ఆటోమెటిక్‌గా యాదాద్రి జిల్లా తెలంగాణ అని మార్పు జరిగే ప్రింట్ వస్తుంది. మరి ఆధార్ కార్డులు ఎందుకు అలా రావడం లేదు.. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు ఆలోచన చేయడం లేదని పలువురు మహిళలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో మహిళలు ఇదే సమస్యతో బాధపడుతున్నారని ప్రభుత్వం మండలానికి నాలుగు ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయాలని లేని పక్షంలో ఆటోమెటిక్‌గా మార్పు అయ్యేలా సంబంధిత యూఐడీఐ సంప్రదింపులు జరిపి సమస్య పరిష్కరించాలని పలువురు మహిళలు కోరుతున్నారు.
అన్ని గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేయాలి: రాజం లింగమ్మ, రాజం కలమ్మ
రాజపేట మండలంలోని అన్ని గ్రామాల్లో ఉచిత ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేయాలని బొందుగుల గ్రామానికి చెందిన రాజం లింగమ్మ, రాజం కలమ్మ కోరారు. బుధవారం బస్సు దిగిన మహిళలను ‘దిశ’ విలేకరి మీ ఆధార్ కార్డులో తెలంగాణ కావాలని అడిగారా.. అని ప్రశ్నించడంతో వారు మా కార్డుల్లో ఆంధ్రప్రదేశ్ ఉందని.. వెంటనే మార్చుకోవాలని ఆర్టీసీ సిబ్బంది చెప్పారని తెలిపారు. కానీ, తమ మండల పరిధిలో ఆధార సెంటర్లు లేవని.. తమ గ్రామాల్లో ఉచిత క్యాంపులు పెట్టి మార్పు చేయాలని వారు కోరారు.