- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీఆర్ఎస్ సర్కార్‌కు షాక్.. గ్రామాల్లో తీర్మానాల 'పంచాయతీ'
దిశ, తెలంగాణ బ్యూరో: "నిజామాబాద్ జిల్లాలోని రెంజల్ మేజర్ గ్రామ పంచాయతీ. శనివారం అక్కడ గ్రామసభ నిర్వహించారు. యాసంగి ధాన్యం కేంద్రం కొనాలంటూ తీర్మానం చేసేందుకు రైతులను ఆహ్వానించారు. పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ పాలకవర్గం మొత్తం సమావేశమైంది. తీర్మానం చేసేందుకు పత్రాన్ని రైతులకు, గ్రామస్థులకు సదరు పంచాయతీ కార్యదర్శి చదివి వినిపించారు. అంతే.. రైతులు ఒక్కసారిగా ఎదురుదిరిగారు. కేంద్రం కొనాలని తామేందుకు సంతకాలు పెట్టాలంటూ ప్రశ్నించారు. పోనీ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ఏదైనా ఉత్తర్వులు వచ్చాయా.. అని నిలదీశారు. కేవలం ఫోన్‌లోనే చెప్పారని, లిఖితపూర్వకంగా కాగితాలు రాలేదంటూ సదరు పంచాయతీ కార్యదర్శి సమాధానమిచ్చారు. అంతే.. రైతులు నినాదాలు చేస్తూ తీర్మానాలు చేసేది లేదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.." ప్రస్తుతం గ్రామాల్లో ఇదీ పరిస్థితి. ధాన్యం కొనుగోళ్లపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. రైతులు, గ్రామస్థులు మూకుమ్మడిగా ఎదురుతిరుగుతున్నారు. వీరికి అక్కడక్కడా బీజేపీ శ్రేణులు అండగా ఉంటున్నాయి.
లీడర్లు రాకండి
గ్రామ పంచాయతీల నుంచి తీర్మానాలు చేసి, కేంద్రానికి పంపించాలని ఇటీవల టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలంటూ 12,751 గ్రామ పంచాయతీల నుంచి తీర్మానం చేయాలని, వాటిని మండలాలకు పంపించి, మండలాల పరిధిలో కూడా ప్రజాప్రతినిధులు మరో తీర్మానం చేసి పంపించాలని నిర్ణయించారు. దీనిపై అధికారిక ఉత్తర్వులేమీ ఇవ్వలేదు. అయితే, గ్రామ పంచాయతీల్లో ముందుగా గ్రామసభలు నిర్వహిస్తున్నారు. రైతులు, గ్రామస్థుల అభిప్రాయం చెప్పాలంటూ అడుగుతున్నారు. ధాన్యాన్ని కేంద్రం కొనాలంటూ తీర్మానాలు రాసి, గ్రామసభల్లో పెడుతున్నారు. కానీ, ఇక్కడే అసలు సమస్య ఎదురవుతోంది. రైతులు ఈ తీర్మానాలకు అసలే ఒప్పుకోవడం లేదు. తాము తీర్మాన పత్రాలపై సంతకాలు చేయమంటూ తెగేసి చెప్పుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్నిచోట్ల పంచాయతీ పాలకవర్గాలు కల్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ, గ్రామ సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఈ విషయంలో ఒత్తిడి చేయవద్దంటూ రైతులు చెప్పుతుండటం అధికార బృందాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో గ్రామసభలకు బీజేపీ నేతలు వచ్చి, రైతుల పక్షాన మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తే రైతులే స్వచ్ఛందంగా వారిని రావద్దంటూ చెప్పుతున్నారు. పార్టీ లీడర్లు ఇందులో కల్పించుకోవద్దని సున్నితంగానే తిరస్కరిస్తున్నారు.
రాష్ట్రానిదే బాధ్యత
ధాన్యం కొనుగోళ్లు రాష్ట్ర ప్రభుత్వమే చేయాలంటూ రైతుల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. గ్రామసభల్లో దీనిపై అధికారులను నిలదీస్తున్నారు. అసలు ధాన్యం కొనుగోళ్లలో గతంలో ఏనాడు కేంద్రం ప్రస్తావన లేదని, ఇప్పుడు కేంద్రం కొనాలంటూ ఎందుకు తీర్మానం చేయాలంటూ ప్రశ్నిస్తున్నారు. కనీసం దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా.. సర్క్యూలర్ వంటివి ఇచ్చారా.. ఇస్తే వాటిని గ్రామసభల ముందు పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో పంచాయతీ కార్యదర్శులు ఏం సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేసి, ధాన్యం కొనాల్సిందేనని తీర్మానం చేస్తామంటూ తెగేసి చెప్పుతున్నారు.
అసలు పంచాయతీ ఎవరిది?
గ్రామసభల్లో తీర్మానాలు పంచాయతీ కార్యదర్శుల మెడకు చుట్టుకుంటున్నాయి. కేంద్రంపై తీర్మానాలు చేయాలంటూ సీఎం కేసీఆర్ ప్రకటించారు. గ్రామాలు, మండలాలు, జిల్లా స్థాయిల్లో తీర్మానం చేయించి పంపాలని సూచించారు. అయితే, అంతకు ముందు గ్రామసభలను నిర్వహించి, రైతుల దగ్గర నుంచి తీర్మాన పత్రాలపై సంతకాలు చేయించాలంటూ పంచాయతీ పాలకవర్గాలు పంచాయతీ కార్యదర్శులపై పెడుతున్నారు. కానీ, దీనిపై అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు. దీంతో ఇది పార్టీ కార్యక్రమమా.. అధికారిక నిర్ణయమా అనేది సందిగ్థంగా మారింది. మరోవైపు మండల స్థాయిలో కూడా ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు కూడా తీర్మానం చేయాలని సూచించారు. దీని బాధ్యతలను ఎంపీడీఓలపై పార్టీ వర్గాలు పెడుతున్నాయి. కానీ, కొన్నిచోట్ల ఎంపీటీసీ సభ్యులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎంపీడీఓలు ఏ పద్దతి ప్రకారం తీర్మానాలు చేయిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో అధికారులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి.