- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
లిక్కర్ కేసుపై కాగ్ నివేదిక లీక్?.. ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం

దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే నెల 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో మరోసారి లిక్కర్ పాలసీ కేసు చర్చనీయాంశమైంది. కాగ్ నివేదిక లీక్ అయిందని కథనాలు వచ్చాయి. ఆ లీకుల ప్రకారం మద్యం పాలసీతో ఢిల్లీ ఖజానాకు సుమారు రూ. 600 కోట్లు కాదు.. రూ. 2026 కోట్ల నష్టం వాటిల్లింది. విధానపర నిర్ణయాల్లో ఆప్ అనేక ఉల్లంఘనలకు పాల్పడింది. ఈ లీక్ కథనాలు ఎన్నికల ముంగిట్లో ఇవి బీజేపీకి అస్త్రాలుగా మారాయి. ఆప్‌పై బీజేపీ విమర్శలవాడి పెంచింది. కాగ్ నివేదిక బీజేపీ కార్యాలయంలో దాఖలైందా? లీకులు ఎక్కడి నుంచి వస్తు్న్నాయని ఆప్ రివర్స్ కౌంటర్ వేసింది. సకాలంలో కాగ్ నివేదికను ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదని, ఈ జాప్యం వెనుక ఆప్, బీజేపీల వెనుక డీల్ కుదిరిందని మరోవైపు కాంగ్రెస్ విమర్శిస్తున్నది. కాగ్ నివేదిక ఢిల్లీ అసెంబ్లీలో ఇంకా ప్రవేశపెట్టలేదు. కానీ, ఆ నివేదికకు సంబంధించిన సమాచారం లీక్ అయింది. జాతీయ మీడియా సంస్థలు ఈ లీక్ ఆధారంగా కథనాలు రాశాయి. జేపీ నడ్డా, అనురాగ్ ఠాకూర్ వంటి బీజేపీ అగ్రనేతలు వీటి ఆధారంగా ఆప్‌పై విరుచుకుపడుతున్నారు. రెవెన్యూ పెంచుకోవాలని 2021 నవంబర్‌లో ప్రవేశపెట్టిన కొత్త లిక్కర్ పాలసీని ఆ తర్వాత ప్రభుత్వం రద్దు చేసింది. అక్రమాలు జరిగాయని, దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలతో ఈడీ, సీబీఐ రంగంలోకి దూకాయి. ఆ తర్వాత అప్పటి సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌లు అరెస్టయ్యారు. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు. ఢిల్లీ లిక్కర్ కేసుతో తెలంగాణ రాజకీయాలకు లింక్ ఉండటంతో ఈ పరిణామాలపై తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తి ఏర్పడింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ కేసులోనూ తిహార్ జైలుకు వెళ్లివచ్చారు.
లీకైన కాగ్ వివరాలివే..
ఢిల్లీ ప్రభుత్వం గతంలో అమలు చేసి రద్దు చేసిన కొత్త మద్యం పాలసీ విధానంలో అనేక లోపాలున్నాయని కాగ్ నివేదిక తెలిపింది. లీకైన కాగ్ రిపోర్టు ప్రకారం, ఈ పాలసీ ద్వారా ఖజానాకు రూ. 2, 026 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ పాలసీ నిర్దేశిత లక్ష్యాలను అందుకోలేదు. కానీ, అమలు చేసిన ఆప్ నేతలకు డబ్బుల మూటలు అందాయి. పాలసీపై నిపుణుల కమిటీ సిఫారసులను అప్పటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం పట్టించుకోలేదు. ఈ విధానంలోని కీలక నిర్ణయాలు కేబినెట్, లెప్టినెంట్ గవర్నర్ ఆమోదాలు లేకుండానే జరిగాయి. వాటిని ఆమోదం కోసం అసెంబ్లీలోనూ ప్రవేశపెట్టలేదు. కొందరు రిటేలర్స్ పాలసీ ముగిసే వరకు లైసెన్స్‌ను కొనసాగించగా.. మరికొందరు సరెండర్ చేశారు. వారు కొత్తగా రీ-టెండర్ చేయకపోవడంతో రాష్ట్రానికి రూ. 890 కోట్ల నష్టం వాటిల్లింది. జోనల్ లైసెన్సీలకు మినహాయింపులు ప్రకటించడంతో అదనంగా రూ. 941 కోట్లు నష్టమొచ్చింది. కరోనా ఆంక్షలను పేర్కొంటూ జోనల్ లైసెన్సీలకు లైసెన్స్ ఫీజులు మాఫీ చేయడంతో రూ. 144 కోట్ల నష్టం మూటగట్టుకుంది.
బీజేపీ వర్సెస్ ఆప్
కాగ్ లీక్ వార్తలు వైరల్ కావడంతో బీజేపీ నేత, కేంద్రమాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియా సమావేశంలో అరవింద్ కేజ్రీవాలే.. లిక్కర్ స్కాంలో కింగ్ పిన్ అని ఆరోపించారు. ‘స్కూళ్లు నిర్మిస్తామని హామీనిచ్చిన ఆప్ లిక్కర్ స్టోర్లు నిర్మించింది. చీపురుకట్టలు, క్లీన్ గవర్నర్నెన్స్ అంటూ గొప్పలు చెప్పే ఆప్.. స్వరాజ్ నుంచి షరాబ్(మద్యం)కు మారింది. వారి పదేళ్ల ప్రభుత్వం స్కాముల మయం’ అని విమర్శలు గుప్పించారు. కాగ్ నివేదిక అసెంబ్లీలో పెట్టడంలో జాప్యం చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి జేపీ నడ్డా ట్వీట్ చేస్తూ.. ‘అధికారలాలస, దుష్పరిపాలనలతో ఆప్ ఢిల్లీలో వసూళ్లు చేపట్టిందని పేర్కొన్నారు. లిక్కర్ స్కాంపై కాగ్ నివేదిక.. అరవింద్ కేజ్రీవాల్, ఆప్ ప్రభుత్వ అవినీతి స్వరూపాన్ని బట్టబయలు చేసింది.పాలసీ అమలులో ఉద్దేశపూర్వక లోపాలు కొనసాగించింది. ఫలితంగా ఖజానాకు రూ. 2026 కోట్ల నష్టం వాటిల్లింది’ అని నడ్డా పేర్కొన్నారు.
‘కాగ్ రిపోర్టు ఎక్కడుంది? ఈ ఆరోపణలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కాగ్ నివేదిక ఏమైనా బీజేపీ ఆఫీసులో ఫైల్ అయిందా? బీజేపీ నేతలకు మానసిక సంతులనం దెబ్బతిన్నది. కాగ్ నివేదికను ఇంకా అసెంబ్లీలో ప్రవేశపెట్టనేలేదు. ఇలాంటి వింత వ్యాఖ్యలు చేస్తున్నారు’ అని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ‘కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి. లిక్కర్ కేసుతో ఢిల్లీ నష్టపోయిందని మేం ముందే చెప్పాం. కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టకపోవడం బాధాకరం. ఈ రిపోర్టు సకాలంలో ప్రవేశపెట్టకపోవడానికి ఆప్, బీజేపీల మధ్య కుదిరిన డీల్ ఏమిటీ? ఈ స్కాంతో రూ. 2000 కోట్ల వారు పొందితే.. ఆ డబ్బులతో ఎన్ని సంక్షేత పథకాలు అమలు చేయచ్చో ఆలోచించండి’ అంటూ ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్ తెలిపారు.