లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే క్రిమినల్ కేసులు: కలెక్టర్ హరీష్

by Mahesh |
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే క్రిమినల్ కేసులు: కలెక్టర్ హరీష్
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : జిల్లాలోని ఆసుపత్రులు, అల్ట్రాసౌండ్, స్కానింగ్ సెంటర్లలో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని మేడ్చల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.హరీశ్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షతన వహించిన కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలిసినా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో తాను స్వయంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు. ఈ నెల నుంచి రెవెన్యూ డివిజన్ల వారీగా పోలీసు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, ఎన్జీవోలు, కలెక్టరేట్ ప్రతినిధులు ఆకస్మిక తనిఖీలు చేస్తారని వివరించారు. రికార్డులు సరిగ్గా నిర్వహించక పోయినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఆడపిల్లల లోటు సమాజానికి చేటు అని, భ్రూణహత్యలు నివారించి ఆడపిల్లలను రక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మహిళలు, పురుషులు అనే వివక్ష ఉండకూడదని, పురుషులకు సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని గుర్తించాలని కలెక్టర్ అన్నారు. ఇప్పటికీ ఆడపిల్ల పుడుతుందని తెలిస్తే.. వారిని తల్లి గర్భంలోనే హత మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్, లీగల్ సర్వీస్ అథారిటీ బాధ్యులు లింగ నిర్ధారణకు సంబంధించిన వాటి పై ప్రత్యేక దృష్టి సారించి.. ఎక్కడైనా అలాంటివి జరిగితే చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం చట్టం ఆవశ్యకత, తదితరాలతో రూపొందించిన 'ఆడపిల్లల లోటు – సమాజానికి చేటు' అనే కరపత్రాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మల్లికార్జున్ రావు, జిల్లా మాస్ మీడియా అధికారి వేణుగోపాల్ రెడ్డి, బాలానగర్ ఏసీపీ పురుషోత్తం, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story