సీపీఐ నాయకుల వసూళ్ల దందా.. ఆ కీలక నేత వెనుక చక్రం తిప్పుతున్నాడా..?

by Satheesh |   ( Updated:2022-04-06 16:34:52.0  )
సీపీఐ నాయకుల వసూళ్ల దందా.. ఆ కీలక నేత వెనుక చక్రం తిప్పుతున్నాడా..?
X

`దున్నేవాడికే భూమి కావాలి` అనే నినాదంతో పేద‌ల‌కు ల‌క్షల‌ ఎక‌రాల భూముల‌ను పంచింది ఆనాటి భార‌త క‌మ్యూనిస్టు పార్టీ (సీపీఐ). తెలంగాణ సాయుధ పోరాటం న‌డిపిన చ‌రిత్ర ఉన్న పార్టీ. సాయుధ పోరాటం అనంత‌రం సాయుద రైతాంగ పోరాటాన్ని భూజానికి ఎత్తుకుని జ‌మీందార్లను, జాగీర్‌దార్లను త‌రిమికొట్టి ఎర్రజెండాలు పాతి పేద రైతు కూలీల‌కు నిస్వార్థంగా భూముల‌ను పంచింది. క‌మ్యూనిస్టుల‌కు జ‌డిసి భూస్వాములు నెహ్రు కాళ్లపై ప‌డి కాపాడ‌మ‌ని వేడుకుంటే పుట్టిందే భూదానోద్యమం. గాంధీ, నెహ్రు ఆదేశాల‌తో క‌మ్యూనిస్టుల ప్రభాల్యాన్ని త‌గ్గించ‌డానికి ఆచార్య వినోభా బావే తెలంగాణ ప్రాంతంలోని భూదాన్ పోచంప‌ల్లి నుండి భూదానోద్యమాన్ని ప్రారంభించారు. అయితే ప్రస్తుతం అదే క‌మ్యూనిస్టు పార్టీ నాయ‌కులు భూదాన భూముల పేరుతో, గాంధీ స్థాపించిన స‌ర్వసేవా సంఘ్, స‌ర్వోద‌య మండ‌లిని అడ్డుపెట్టుకుని పేద‌ల‌ను అందిన కాడికిదోచుకుంటున్నారు. స్లమ్ ఏరియాల్లో బ్రోక‌ర్లను నియ‌మించుకుని మ‌రీ వ‌సూళ్ల దందా మొద‌లు పెట్టారు. ఒక‌ప్పుడు పేద‌ల కోసం నిస్వార్థంగా ప‌ని చేసిన సీపీఐ పార్టీకి ఓ రాష్ట్ర కౌన్సిల్ స‌భ్యుడు మ‌చ్చ తెస్తున్నా.. రాష్ట్ర నాయ‌క‌త్వం ఆయ‌నే తానా అంటే.. తందానా అంటూ భ‌జ‌న చేయ‌డం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చ‌ర్చనీయాంశంగా మారింది.

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: భూదాన్ భూముల పేరుతో సీపీఐ నాయ‌కులు పేద‌ల ద‌గ్గర‌ అందిన‌కాడికి దండుకుంటున్నారు. భూదాన్ భూముల్లో ప్లాట్లు ఇప్పిస్తామంటూ ల‌క్షల‌కు ల‌క్షలు వ‌సూళ్లు చేస్తున్నారు. అణ‌గారిన వ‌ర్గాల బ‌ల‌హీన‌త‌ల‌ను ఆస‌రా చేసుకుని మురికివాడ‌ల్లో బ్రోక‌ర్లను నియ‌మించి వ‌సూళ్ల ప‌ర్వం మొద‌లు పెట్టారు. ఇందులో ప్రధాన సూత్రదారుడు భార‌త క‌మ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర కౌన్సిల్ స‌భ్యుడు. ఇత‌ని సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌రోనాయ‌కుడు తోడ‌వ‌డంతో వీరి వ‌సూళ్ల దందాకు హ‌ద్దూఅదుపు లేకుండా పోతుంది. ఆ నాయ‌కుడికి స‌హ‌క‌రిస్తున్న వ్యక్తిపై గ‌తంలో అవినీతి ఆరోప‌ణ‌లు రావ‌డంతో సీపీఎం పార్టీ బ‌హిష్కరించింది. అనంత‌రం సీపీఐ పార్టీలో చేరికి కీల‌క ప‌ద‌విని వెల‌గ‌బెడుతున్నాడు. ప్రస్తుతం భూదాన్ భూముల పేరుతో దండుకుంటున్నాడు. ఇక సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ స‌భ్యుడిగా చ‌లామ‌ణి అవుతున్న నాయ‌కుడు, స‌ర్వోద‌య మండ‌లిలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ప‌ద‌విని వెల‌గ‌బెట్టడం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. నిప్పు, ఉప్పులా ఉంటే క‌మ్యూనిస్టు పార్టీ, గాంధీ స్థాపించిన స‌ర్వసేవాసంఘ్ రెండింటిలో ప‌ద‌వుల‌ను వెల‌గ‌బెట్టడంపై పులువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆయ‌న తానా అంటే.. సీపీఐ రాష్ట్ర నాయ‌క‌త్వం తందాన అనండం హాస్యాస్పదంగా ఉందంటూ ప్రజ‌లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పేద‌ల‌కు ల‌క్షల ఎక‌రాల భూముల‌ను పంచిన క‌మ్యూనిస్టు పార్టీ భూదాన్ భూముల కోసం ధ‌ర్నాలు చేయ‌డం విడ్డూరంగా ఉందంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

మురికివాడ‌లే టార్గెట్..!

న‌గ‌రంలోని మురికివాడ‌లే టార్గెట్‌గా భూదాన్ భూముల పేరుతో వ‌సూళ్ల దందా సాగుతోంది. ఒక్కోక్క కుటుంబ స‌భ్యుల నుండి ఒక ఫోటో, ఆధార్‌కార్డు జీరాక్స్ తీసుకుని రూ. 1200 వంద‌ల నుండి రూ. 1500 వ‌ర‌కు వ‌సూలు చేస్తున్నారు. ఇందులో బ్రోక‌ర్లకు రూ. 200 పోను మిగిలింది సీపీఐ నాయ‌కుల‌కు చెల్లించాలి. న‌గ‌రంలోని సింగ‌రేణి కాల‌నీ, స‌ర‌ళాదేవిన‌గ‌ర్‌, లెనిన్‌న‌గ‌ర్‌, సాహెబ్‌న‌గ‌ర్, నాగోల్ సాయిన‌గ‌ర్‌, ఫిర్జాదీగూడ‌, త‌ట్టిఅన్నారంలోని ఆర్‌కే పురం.. ఇలా న‌గ‌రంలోని అన్ని స్లమ్ ఏరియాల‌లో 10 నుండి 15 మంది బ్రోక‌ర్లను నియ‌మించుకొని వ‌సూళ్లకు పాల్పడుతున్నారు. ఇప్పటికే దాదాపు 50 వేలకుపైగా కుటుంబాల నుండి వ‌సూళ్లు చేసిన‌ట్లుగా స‌మాచారం. ఇది ఒక్క న‌గ‌రానికి ప‌రిమితం కాకుండా ఇత‌ర జిల్లాలో కూడా అనేక మంది పేద‌ల ద‌గ్గర వ‌సూలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

పేద‌ల‌ను మ‌భ్యపెట్టి..?

భూదాన్ భూముల్లో ప్లాట్లు ఇప్పిస్తామంటూ పేద‌ల‌ను మ‌భ్యపెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అయితే రోజుల త‌ర‌బ‌డి ఎటువంటి ఆధారాలు లేక‌పోవ‌డం పేద‌ల‌ను నిల‌దీస్తున్నారు. దీంతో కంగారు ప‌డ్డ వ‌సూళ్ల రాయుళ్లు ధ‌ర్నాల పేరుతో పేద‌ల‌ను న‌మ్మించే ప్రయ‌త్నం చేస్తున్నారు. ఏదో ఒక‌చోట భూదాన్ భూమి ఉందంటూ చెప్పి ఆ భూమిపైకి వెళ్తున్నాం. మీరే అక్కడ గుడిసెలు వేసుకుని ఉండాలి అంటూ ఇటీవ‌ల ఆదిబ‌ట్లలో భూమిపైకి వెళ్లేందుకు ప్రయ‌త్నించారు. దానిని పోలీసులు అడ్డుకోవ‌డంతో ఆర్డీఓ కార్యాల‌యం వ‌ద్ద ధ‌ర్నా నిర్వహించారు. ఈ ధ‌ర్నాలో పాల్గొన్న వేలాది మంది పేద‌లు ఆ అవినీతి నాయ‌కులకు డ‌బ్బులు చెల్లించిన‌వారే కావ‌డం గ‌మ‌నార్హం. పేద‌ల‌ను దోచుకుంటున్న త‌మ నాయ‌కుల‌పై సీపీఐ రాష్ట్ర నాయ‌క‌త్వం ఎటువంటి చ‌ర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి మ‌రి..!

Advertisement

Next Story