టీఆర్‌ఎస్‌కు షాక్.. డజను మంది కోసం కాంగ్రెస్ నిరసన

by Manoj |   ( Updated:2022-03-06 20:41:16.0  )
టీఆర్‌ఎస్‌కు షాక్.. డజను మంది కోసం కాంగ్రెస్ నిరసన
X

దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ సమావేశాల తొలి రోజునే కాంగ్రెస్ పార్టీ వినూత్న నిరసనకు శ్రీకారం చుడుతున్నది. కాంగ్రెస్ బీ-ఫారం మీద గెలిచిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరినవారిని టార్గెట్‌ చేయనున్నది. పార్టీ ఫిరాయించిన వీరిపై స్పీకర్ చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు విద్యార్థి, యువజన, మహిళా సంఘాలకు చెందిన వారు కూడా ఈ నిరసనల్లో పాల్గొననున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన పన్నెండు మంది ఫోటోలతో ప్రత్యేకంగా పోస్టర్ ముద్రించిన కాంగ్రెస్ నాయకుడు బక్క జడ్సన్ సోమవారం జరిగే ఆందోళనలో పాల్గొంటున్నట్లు తెలిపారు.

పార్టీ ఫిరాయించిన వీరిపై అనర్హత వేటు వేయాలని బక్క జడ్సన్ డిమాండ్ చేస్తున్నారు. సాంకేతికంగా శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేసినట్లు ప్రకటించుకుంటున్నా నైతికంగా అది పార్టీ ఫిరాయింపేనని ఆయన వాదిస్తున్నారు. స్పీకర్ అనర్హత వేటు వేయడంతో పాటు కాంగ్రెస్ శాసనసభా పక్షం కూడా వీరిని చూసి చూడనట్లుగా వదిలేసిందన్న అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు కష్టనష్టాలకోర్చి ఆ పన్నెండు మందిని గెలిపిస్తే కాసులకు అమ్ముడుబోయారని వారిపై ఆరోపణలు చేశారు. నిజంగా వీరు అమ్ముడుపోయారా లేక ఎవరైనా వీరిని అమ్మేశారా లేక వారిని కేసీఆర్ బెదిరించి లాగేసుకున్నారా అని వ్యాఖ్యానించారు. ఈ వాస్తవాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలియాలని, అందుకే నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నామని తెలిపారు.

Advertisement

Next Story