మీ సేవల్లో అద‌న‌పు వ‌సూళ్లు.. ప్రశ్నిస్తే అంతే అంటూ వ్యంగ్య స‌మాధానాలు

by Aamani |
మీ సేవల్లో అద‌న‌పు వ‌సూళ్లు.. ప్రశ్నిస్తే అంతే అంటూ వ్యంగ్య స‌మాధానాలు
X

దిశ‌, ఏటూరునాగారం: మండ‌లంలో మీ సేవ నిర్వాహ‌కుల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆదాయ‌, కుల‌,నివాస ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలకు నిర్ణీత‌ రుసుము కంటే అదనంగా వ‌సూళ్లు చేస్తూ దర‌ఖాస్తుదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే వ్యంగ్య స‌మాధానాలు ఇస్తున్నారని వాపోతున్నారు. ఏటూరునాగారం మండ‌ల కేంద్రంలో మీ సేవ నిర్వాహ‌కులు దనపు వ‌సూళ్లకు తెరతీశారు. చ‌ర్యలు తీసుకోవాల్సిన అధికారులు దృష్టి సారించ‌క పోవ‌డంతోనే మీ సేవ నిర్వాహ‌కులు ఇష్టారాజ్యంగా వ్యవ‌హ‌రిస్తున్నార‌నే విమ‌ర్శలు ఏజెన్సీలో వెల్లువెత్తుతున్నాయి.

పంట పండిస్తున్న రాజీవ్ యువ వికాస ప‌థ‌కం..

రాష్ట్రంలోని యువ‌త‌కు స్వయం ఉపాధి క‌ల్పించేందుకు ఇటీవ‌ల రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం ప‌థ‌కం అమ‌లు చేసింది. ఈ ప‌థ‌కంలో ద‌ర‌ఖాస్తు చేసుకునే వారికి రేష‌న్ కార్డు లేకుంటే కుల‌, ఆదాయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు జ‌త‌ చేయాలి. ఈ క్రమంలోనే మీ సేవ కేంద్రాల‌కు ఆదాయ‌, కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల కొసం ద‌ర‌ఖాస్తు దారులు బారులు తీరుతున్నారు. దీన్ని అవ‌కాశంగా మ‌లుచుకున్న మీ సేవ నిర్వాహ‌కులు అదన‌పు చార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరో వైపు రెవెన్యూ కార్యాల‌యం నుంచి ఆమోదించిన ద‌ర‌ఖాస్తు దారుల ప‌త్రాలు అందించ‌డంలో సైతం అల‌సత్వం వ‌హిస్తున్నారు. అక్షరాస్యత‌కు నోచుకోని వారు ఉంటే ఇక వారి ప‌ని అంతే.. స‌ర్వర్ పనిచేయడం లేద‌ని, ద‌ర‌ఖాస్తులు ఇంకా అమోదం కాలేద‌ని చెబుతున్నారు.

అస‌లు ఏం జ‌రుగుతుంది..

మీ సేవ కేంద్రాల్లో ఆదాయ‌, కుల‌, నివాస ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంటే మీ సేవ నిర్వాహ‌కులు రుసుము రూ.45 వసూలు చేయాలి. ఒక్కో దరఖాస్తుకు రూ.80 వ‌సూలు చేస్తున్నారు. ఇటీవ‌ల ఓ వ్యక్తి కుటుంబ స‌భ్యుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల కోసం మీ సేవ కేంద్రంలో ద‌ర‌ఖాస్తు చేసుకోగా మొత్తం రూ.405 కాగా, నిర్వాహకులు మాత్రం రూ.640 వ‌సూలు చేసినట్లు వాపోయాడు.

చ‌ర్యలు తప్పవంటున్న అధికారులు..

మీ సేవ కేంద్రాల్లో కొన‌సాగుతున్న అద‌న‌పు వ‌సూళ్ల విష‌య‌మై దిశ మీ సేవ ఈ డిస్ట్రిక్ మేనేజ‌ర్ దేవేంద‌ర్‌ ను వివరణ కోరగా ఎలాంటి అదన‌పు చార్జీలు వసూలు చేయవద్దని, ఒక‌వేళ తీసుకుంటే వారిపై చ‌ర్యలు తప్పవని హెచ్చరించారు. మీ సేవ కేంద్రాల్లో ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నెంబ‌రు ఉంటుంద‌ని, దానికి ఫోన్ చేయాలన్నారు. ఏటూరునాగారం తహ‌సీల్దార్ జ‌గ‌దీశ్వర్ ను వివరణ కోరగా మీ సేవ‌ సెంటర్ల నిర్వాహ‌కులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించ‌డం జ‌రుగుతుందని, చ‌ర్యలు తీసుకుంటామ‌ని తెలిపారు.



Next Story

Most Viewed