వాళ్ల కనుసన్నల్లోనే బెల్ట్ షాపులు రన్ అవుతున్నాయంటా.. నిజమేనా?

by Vinod kumar |
వాళ్ల కనుసన్నల్లోనే బెల్ట్ షాపులు రన్ అవుతున్నాయంటా.. నిజమేనా?
X

దిశ, వేంసూర్: మండలం లో విచ్చలవిడిగా బెల్టు షాపులు ప్రజాప్రతినిధుల కనుసైగల్లో కొనసాగుతున్నాయని పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. రాత్రనకా పగలనకా సంపాదించిన డబ్బులతో కుటుంబ పోషణ చూసుకుంటూ.. సంతోషంగా బతకాలి అనుకునే వారిని మద్యం దారి మళ్ళిస్తుంది. బెల్టుషాపులు ఏర్పడడం వల్ల ఎక్కడపడితే అక్కడ మద్యం దొరకడంతో మందుకు బానిసలైన వారు అధిక ధరలకు కోరుకుంటున్నారు. దీంతో కుటుంబ పోషణ నిలిచి, గొడవలకు దారి తీస్తున్నాయి. అంతేకాదు బెల్టు షాపులు వెలసిన అప్పటినుండి యువత కూడా మద్యానికి బానిస అవుతున్నారు.

సాయంత్రం కాగానే వైన్ షాపుల ముందు, బెల్టు షాపుల ముందు క్యూలు కడుతున్నారు. అధిక రేట్లకు కొనుగోలు చేసి మరి మద్యం సేవిస్తున్నారు. దీని వల్ల కష్టపడి సంపాదించిన డబ్బు పోగొట్టుకోవటమే కాక, సమాజంలో గౌరవం, విలువ కోల్పోతున్నారు. యువత అయితే మద్యం మత్తులో ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదు. దీనికి కారణం అడుగడుగునా వెలిసిన బెల్టుషాపులే అని ప్రజలు వాపోతున్నారు. ఈ విషయంపై అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేద ప్రజల బతుకులు వాళ్లకు పట్టవని, అధికారుల దగ్గరకు వెళ్ళినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అయ్యా కలెక్టర్ గారూ మీరైనా స్పందించండని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed