పులికాట్ సరస్సు సముద్ర ముఖ ద్వారంలో పూడిక తీయించండి : ఎంపీ గురుమూర్తి

by samatah |
పులికాట్ సరస్సు సముద్ర ముఖ ద్వారంలో పూడిక తీయించండి  : ఎంపీ గురుమూర్తి
X

దిశ, ఏపీ బ్యూరో : పులికాట్ సరస్సు సముద్ర ముఖ ద్వారంలో పూడిక తీయించి మత్స్యకారులను ఆదుకోవాలని కేంద్ర మత్స్యశాఖ మంత్రి పర్షోత్తం రూపాలాను తిరుపతి ఎంపీ గురుమూర్తి కోరారు. ఢిల్లీలో కేంద్రమంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ గురుమూర్తి పూడిక తీసేందుకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 'దేశంలో చిల్కా సరస్సు తరువాత పులికాట్ సరస్సు రెండవ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. ఇది తూర్పు తీరంలో 461 చదరపు కిమీ విస్తీర్ణంలో ఉంది. ఇందులో 400 చ.కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోకి వస్తుంది. ఆంధ్రాలో ఈ సరస్సు పరిధిలో 20 మత్స్యకారుల ఆవాసాలు కలిగిన గ్రామాలు (కుప్పాలు) , తమిళనాడులో 24 కుప్పాలు ఉన్నాయి. ఈ సరస్సు స్వర్ణముఖి నది, రొయ్యల కాలవ, కాళంగి నది, ఆరణి నది, ఎన్నూరు నది మొదలైన వాటి నుండి మంచినీటిని అందుకుంటుంది. కాళంగి నది ఇతర పరివాహక ప్రాంతాల నుండి మంచినీటి ప్రవాహం లేకపోవడం, సరస్సు మీదుగా శ్రీహరికోట, ఇతర గ్రామాలకు రహదారి ఏర్పడటం... ఆంధ్ర ప్రాంతంలోని పులికాట్ సరస్సు వద్ద భారీ పూడిక ఏర్పడి నిస్సారంగా మారిందని తిరుపతి ఎంపీ గురుమూర్తి అన్నారు.

'ఈ పూడిక వల్ల మత్స్య సంపద రాను రాను క్షీణిస్తోందని, తద్వారా 20 కుప్పాలలో (గ్రామాలు) సుమారు 20,000 మంది మత్స్యకారులు జీవనోపాధిని కోల్పోయారని. పులికాట్ (తమిళనాడు) యొక్క దక్షిణ భాగం చాలా లోతుగా ఉంటుందన్నారు. ఏడాది పొడవునా నీరు నిల్వ ఉంటుందని, ఉత్తర భాగం (ఆంధ్రా ప్రాంతం) 0.5 మీటర్ల కంటే తక్కువ లోతుతో ఉంటుందని తెలిపారు. కానీ సరస్సులోకి సముద్రం నుంచి నీరు వచ్చే భాగంలో ఇసుక మెట వేయడం వలన ఎక్కువ కాలం ఎండిపోతుందని పేర్కొన్నారు. మార్చి నుండి జూన్ వరకు ఉత్తర భాగంలో (ఆంధ్రా) నీరు తగ్గి, దక్షిణ భాగంలో (తమిళనాడు) చేపల వేటకి వెళ్ళినపుడు తమిళనాడు మత్స్యకారులు.. ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు తమిళనాడు భాగంలో లోతైన ప్రాంతంలో చేపలు పట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇందు వలన మత్స్యకారుల మధ్య తరచు ఘర్షణలు జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని రాయదరువు వద్ద ఉన్న పులికాట్ సరస్సు యొక్క సముద్ర ముఖద్వారాన్ని తక్షణమే తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీ గురుమూర్తి కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. పులికాట్ సరస్సులో చేపల వేటపై ఆధారపడిన వేలాది సంప్రదాయ మత్స్యకారుల కుటుంబాల జీవనోపాధిని కాపాడేందుకు రూ.48. కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించాలని కేంద్ర మత్స్యశాఖ మంత్రి పర్షోత్తం రూపాలాను కోరారు. ఎంపీ గురుమూర్తి వినతిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed