‘తెల్లం’ మాట బేఖాతర్.. తాళం తీయని చర్ల మండలాధ్యక్షుడు

by Sridhar Babu |
‘తెల్లం’ మాట బేఖాతర్.. తాళం తీయని చర్ల మండలాధ్యక్షుడు
X

దిశ, భద్రాచలం : టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ తెల్లం వెంకట్రావు స్వయంగా చర్లకు వచ్చి చెప్పినా ఆయన మాటను పార్టీ చర్ల మండల అధ్యక్షుడు రాజారావు ఖాతరు చేయనట్లుగా కనిపిస్తోంది. చర్లలో పార్టీ ఆఫీసుకు మండల అధ్యక్షుడు రాజారావు తాళం వేశారు. దీంతో అధ్యక్షుడి వైఖరిపై పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావులకు ఫిర్యాదు చేశారు. గొడవలు ఎన్ని ఉన్నా ఆఫీసు తెరిపించాలని కోరారు.‌

బాలసాని సూచనతో తెల్లం వెంకట్రావు చర్లకు వచ్చి రాజారావుకు ఇంటికి వెళ్ళి చర్చించారు. పార్టీ క్యాడర్ నడుమ ఎన్ని రకాల విభేదాలు ఉన్నప్పటికీ మనం కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకుందామన్నారు. కనుక మూసివేసిన పార్టీ ఆఫీసు తెరవాలని రాజారావుకి తెల్లం వెంకట్రావు చెప్పినట్లుగా పార్టీ శ్రేణులు చెబుతున్నారు.‌ ఆఫీసు తాళం తీస్తానని వెంకట్రావుకి చెప్పిన రాజారావు రోజులు గడుస్తున్నా తాళం తీయకపోవడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్ల పక్కన, చెట్ల కింద, హోటళ్ళ దగ్గర కూర్చుంటున్నారు. అధ్యక్షుని మొండి వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాయకుడికి ఇంత మొండి పట్టుదల సరికాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. అందరినీ కలుపుకొని పనిచేస్తూ పార్టీని అభివృద్ధి చేయాల్సిన అధ్యక్షుడు ఒక వర్గానికి కొమ్ముకాయడం కరెక్టు కాదనే అభిప్రాయం కార్యకర్తల్లోనే వ్యక్తమౌతోంది. పార్టీ చర్ల టౌన్ అధ్యక్షునిగా కార్యదర్శి వర్గం నుంచి ఎంపిక చేసిన యువకుడిని తప్పించి అధ్యక్ష వర్గానికి చెందిన వ్యక్తికి ఇచ్చేంతవరకు టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు తెరుచుకోవడం కష్టమనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది.

ఆ పదవి విషయంలో తలెత్తిన గొడవలే పార్టీ ఆఫీసు మూతపడటానికి కారణమని తెలుస్తోంది. ఏదిఏమైనా ఒక పదవి కోసం ఇంతమందిని ఇబ్బందిపెట్టడం సరికాదని గులాబీ పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. పార్టీ సభ్యులు ఎవరూ గ్రూపుల్లో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టవద్దని, లక్ష్మణరేఖ దాటితే వేటువేస్తామని పదేపదే హెచ్చరించే మండల అధ్యక్షుడే రాష్ట్ర కార్యదర్శి చెప్పిన మాట పెడచెవిన పెట్టడం ఎంతవరకు సమంజసమని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. పై నాయకత్వం మాట వినడంలో ముందు ఆయన ఆదర్శంగా నిలిచి, ఆ తర్వాత మండల పార్టీ సభ్యులను కంట్రోల్ చేస్తే బాగుంటుందని చర్చించుకుంటున్నారు.ఆఫీసుకు తాళం వేసిన ఆయనే ఈ సమస్యకి పరిష్కారం చూపాల్సిన పరిస్థితి నెలకొంది.

Advertisement

Next Story