తెలంగాణలో సినిమా సందడి ఎప్పుడో తెలుసా?

by Shyam |
తెలంగాణలో సినిమా సందడి ఎప్పుడో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా తగ్గుముఖం పట్టింది.. జనాలు కూడా పరిస్థితికి అలవాటు పడిపోయారు. బయట తిరుగుతూ తమ పని తాము చేసుకుంటున్నారు.. కానీ మాస్క్, సోషల్ డిస్టెన్స్ మాత్రం పాటిస్తున్నారు. మాల్స్, పార్క్‌లకు వెళ్తున్నా కనీస జాగ్రత్తలైతే పాటిస్తున్నారు. కానీ ఇవి ఓపెన్ సర్ఫేస్ కాబట్టి ప్రిఫర్ చేస్తున్నారు. మరి క్లోజ్డ్ సర్ఫేస్ అయిన థియేటర్స్ పరిస్థితి ఏంటి? ఒకవేళ థియేటర్లు ఓపెన్ అయితే జనాలు వెళ్తారా? లేదా కరోనాకు భయపడి ఓటీటీల్లోనే సినిమాలను ఎంజాయ్ చేస్తూ గడుపుతారా? అనేది ప్రశ్న. ఈ ప్రశ్నలకు సమాధానం జనాలే చెప్పాల్సి ఉన్నా.. ఇంతకీ థియేటర్స్ ఓపెన్ అయితే కదా వెళ్తారో? లేదో? తెలిసేది. ఇప్పటికే ఇండస్ట్రీ కష్టాల్లో ఉంది కాబట్టి థియేటర్స్ ఓపెన్ కావాల్సిందే అని నిర్మాతలు కూడా విజ్ఞప్తి చేస్తున్న సమయంలో.. థియేటర్ యాజమాన్యాలు ఏమంటున్నాయి? ఇందుకు ప్రభుత్వం కూడా అనుమతివ్వగా థియేటర్ ఓనర్స్ అభిప్రాయం ఏమిటి?

సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్ ఇచ్చేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని, తెలంగాణలో డిసెంబర్ 4 లేదా11వ తేదీ నుంచి సినిమా హాళ్లు తెరుచుకుంటాయని థియేటర్ ఓనర్స్ చెబుతున్నారు. ప్రభుత్వం ఎన్ని షోస్ అయినా వేసుకోవచ్చని, టికెట్ ధరలు కూడా పెంచుకోవచ్చని అనుమతించినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాలుగు షోలు సరిగ్గా ఆడి, థియేటర్స్ నిండితే అంతకు మించిన అదృష్టం లేదంటున్నారు. పెద్ద సినిమా అయితే రెండు షోలు ఎక్కువ ప్రదర్శించినా ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుందని ఆశించినా.. ఇప్పుడు నిర్మాతలు కూడా పెద్ద సినిమాలను రిలీజ్ చేస్తే నష్టాల్లో పడిపోతామని అందుకు సాహసించడం లేదు. ఓటీటీలు, కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్‌‌తో పిల్లలతో పాటు పెద్దవాళ్లు సైతం థియేటర్‌కు వచ్చేందుకు భయపడతారని, అదొక మైనస్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. లాభాలు లేకపోయినా ఉన్న స్టాఫ్‌కు జీతాలిచ్చేలా ఉంటే చాలంటున్నారు. ఇప్పటికే 50 శాతం ఎంప్లాయిస్‌ను కూడా తగ్గించుకుని, ఉన్న వారితోనే పనిచేయించుకుంటున్నాం అంటున్న థియేటర్ ఓనర్స్.. మరో ఆరునెలల వరకు లాభమైనా? నష్టమైనా? షోలు వేయాల్సిందే అంటున్నారు. అలా అయితేనే ప్రేక్షకులకు నమ్మకం పెరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు.

ఇప్పటికే ‘అరణ్య’ లాంటి పెద్ద సినిమాల షూటింగ్ పూర్తయినా సరే.. రిలీజ్ చేసేందుకు నిర్మాతలు వెనుకాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీలో ఇప్పటికే రిలీజైన ‘నిశ్శబ్దం, వి, మిస్ ఇండియా, ఆకాశం నీ హద్దురా’ లాంటి సినిమాలతో థియేటర్లు ఓపెన్ చేయాలనుకుంటున్నామని చెప్తున్నారు. ఇక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో ఉన్న ‘లవ్ స్టోరీ’ లాంటి సినిమాలు కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేందుకు సంకోచిస్తున్న తరుణంలో.. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మాత్రం ధైర్యంగా ముందుకొచ్చాడు. కరోనా తర్వాత తెలుగులో రిలీజ్ అవుతున్న ఫస్ట్ సినిమా తనదే కాగా.. ‘సోలో బ్రతుకే సో బెటర్’ మాత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాను థియేటర్‌లో రిలీజ్ చేసేందుకు జీ స్టూడియోస్ ముందుకొచ్చింది. మొత్తానికి థియేటర్‌లో ప్రేక్షకులను కలిసేందుకు సోలో బ్రతుకే సో బెటర్ సిద్ధంగా ఉండగా.. అదే ఈలలు, గోలలు, పేపర్లు ఎగరేస్తూ.. అంతే ఎగ్జైట్‌మెంట్‌తో ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు వస్తారా? సినిమాను పండుగలాఎంజాయ్ చేస్తారా? చూడాలి.

Advertisement

Next Story

Most Viewed