- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయాలని మంత్రులకు సీఎం కీలక ఆదేశాలు

దిశ, తెలంగాణ బ్యూరో : అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సఖ్యత కరువైందని అధిష్టానం గుర్తించింది. ఈ క్రమంలోనే సొంత పార్టీ శాసనసభ్యులు, మంత్రుల మధ్య మరింత సఖ్యత కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య సమన్వయం ఉంటేనే జిల్లా అభివృద్ధి చెందుతుందని, ప్రభుత్వ పథకాలు మరింత సమర్థవంతంగా అమలవుతాయని సీఎం రేవంత్ సూచించినట్టుగా తెలిసింది. అభివృద్ధి పనులు, కార్యక్రమాలు ఏదైనా ఎమ్మెల్యేలతో కలిసి మంత్రులు పని చేయాలని సీఎం రేవంత్ చెప్పినట్లు తెలుస్తుండగా.. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలతో మంత్రులు ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. మంత్రులు ఇన్చార్జిలుగా ఉన్న ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలు సంతృప్తిగా లేకుంటే.. పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుందని సీఎం కేబినెట్ మంత్రులను హెచ్చరించినట్టు తెలుస్తున్నది. అందుకే ఇరువురి మధ్య రాపో బాగుండాలని, అప్పుడే ప్రభుత్వం, పార్టీ ఆశించిన ఫలితాలు వస్తాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఎమ్మెల్సీ ఫలితాలు రిపీట్ కాకుండా..
ఇటీవల జరిగిన కరీంనగర్గ్రాడ్యుయేట్ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా విఫలమైంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే రకమైన ఫలితాలు రాకుండా ఉండేందుకు ముందస్తుగానే సీఎం మంత్రులను అప్రమత్తం చేశారని తెలిసింది. అందుకే మంత్రులు సొంత పార్టీ ఎమ్మెల్యేలతో సఖ్యతగా ఉండేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. రాజకీయంగా ఎమ్మెల్యేలకు ఎదురవుతున్న ఇబ్బందులను మంత్రుల దృష్టికి తీసుకెళ్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశాలు పూర్తయినట్టు తెలిసింది. త్వరలోనే మిగతా జిల్లాల్లోనూ ప్రత్యేకంగా మంత్రులు సమావేశాలు నిర్వహించి ఎమ్మెల్యేలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పిస్తున్నట్లు టాక్.
ఓటమికి అనేక కారణాలు..
ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగడానికి అనేక కారణాలున్నాయి. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ కార్యవర్గంలో పదవుల పంపకాల ప్రక్రియ ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది. నాలుగు ఉమ్మడి జిల్లాలో స్థానిక నేతల మధ్య సమన్వయం లేకపోవడం కూడా అందుకు ఒక కారణం. ముఖ్యంగా కొందరు నేతలు క్షేత్రస్థాయిలో పనిచేయకపోవడం, మంత్రులు, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ రావడం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి కారణమని చెప్పుకోవచ్చు. ఇక త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు మంత్రులు ప్రత్యేక సమావేశాల పేరిట వారికి అభయం ఇస్తున్నట్లు తెలిసింది. ప్రతి రెండు లేదా మూడు నెలల కొకసారి ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని అధిష్టానం సూచించినట్లు టాక్.