గణేశ్ నిమజ్జాల కోసం మా పండుగను వాయిదా వేసుకున్నాం

by GSrikanth |   ( Updated:2023-11-23 11:22:41.0  )
గణేశ్ నిమజ్జాల కోసం మా పండుగను వాయిదా వేసుకున్నాం
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుతోన్న వేళ ఎమ్ఐఎమ్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఓ మీడియా చానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో అసద్ పాల్గొని మాట్లాడుతూ.. తాము ఏనాడూ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడలేదని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన ప్రశాంతంగా జరుగుతోందని అన్నారు. అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతోందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో పోలీసులపై ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపైనా స్పందించారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రచార సభలో పోలీసులే అత్యుత్సాహం ప్రదర్శించారని అన్నారు. సభ ముగియడానికి 5 నిమిషాల ముందే సీఐ అడ్డుపడి బంద్ చేయాలని హెచ్చరికలు జారీ చేశారని చెప్పారు. తమ పార్టీ ఏ ఒక్క మతానికి పరిమితం కాదన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీని చిత్తుగా ఓడిస్తామన్నారు. రేవంత్‌రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యక్తి అని, టీకాంగ్రెస్‌ రిమోట్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ చేతిలో ఉందన్నారు. మతపరమైన అల్లర్లను ఎంఐఎం పార్టీ ఎప్పుడు ప్రొత్సహించలేదన్నారు.

మతసామరస్యానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. గత తొమ్మిదిన్నరేళ్లలో హైదరాబాద్ మహానగరంలో ఒక్కసారి కూడా అల్లర్లు జరగలేదని గుర్తు చేశారు. ఇటీవల గణేష్ నిమజ్జనం సందర్భంగా ముస్లింలు సమ్యమనం పాటించారని, ఇందుకు కోసం ఏకంగా మిలాదున్ నబీ ర్యాలీనే వాయిదా వేసుకున్నామని చెప్పారు. రాహుల్ గాంధీ విమర్శలు చేసే ముందు వినడం నేర్చుకోవాలని సూచించారు. రాహుల్ గాంధీ ఏం మాట్లాడినా దానికి సమాధానాలు చెబుతామని కౌంటర్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ మంచి క్రికెటరే.. కానీ, రాజకీయాల్లో అసమర్థుడని విమర్శించారు. కేటీఆర్‌ ఆయనకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ బాధ్యతలు అప్పగిస్తే దాని స్థాయి దిగజార్చారు. ఎన్నికల్లో ప్రత్యర్థులు ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైతే తప్పేంటి? అసమర్థ నేత కాబట్టి ఆయనపై బలమైన మజ్లిస్‌ అభ్యర్థిని రంగంలోకి దింపామన్నారు.

బీజేపీ నేతలు మమ్మల్ని విమర్శించేందుకే ప్రాధాన్యమిస్తున్నారు తప్పా.. జనం కోసం ఏం చేస్తారో చెప్పడం లేదన్నారు. మతపరమైన వ్యాఖ్యలతో రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ లాంటి నేతల సర్టిఫికెట్లు మాకు అవసరం లేదని ఎద్దేవా చేశారు. కిషన్‌రెడ్డి బుల్డోజర్ సర్కార్ తీసుకొస్తానంటారు.. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మదర్సాలు మూసేస్తామంటారు.. వీరి వ్యాఖ్యలు చూస్తుంటే దేశంలో అంతర్యుద్ధం జరుగుతుందా? ఎన్నికలు జరుగుతున్నాయా? అన్న అనుమానం కలుగుతుందన్నారు. పాతబస్తీ అభివృద్దిపై విపక్షాల విమర్శలను అసద్ తప్పుబట్టారు. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్‌ సొంతంగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతారన్నారు. తెలంగాణ ప్రజలు మంచి నిర్ణయం తీసుకుంటారని అశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed