వివేకానంద బలిసి కొట్టుకుంటున్నాడు: బండి సంజయ్

by GSrikanth |
వివేకానంద బలిసి కొట్టుకుంటున్నాడు: బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే పేరుకే వివేకానంద అని, చేష్టలేమో ఔరంగజేబులా ఉన్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఘాటు విమర్శలు చేశారు. కుత్బుల్లాపూర్‌లో గురువారం ఆయన బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఓడిపోతామనే భయంతో బీఆర్ఎస్ అభ్యర్థులు దాడులకు తెగబడుతున్నారని ఫైరయ్యారు. తమ సహనాన్ని చేతగాని తనంగా భావించొద్దని హెచ్చరించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు తలుచుకుంటే ఔరంగజేబును తరిమినట్లుగా ఉరికించి కొడతారని హెచ్చరించారు. ఈసారి బీజేపీకి అధికారం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించారని పేర్కొన్నారు. కానీ ఒక సెక్షన్ మీడియా కాంగ్రెస్, మరో సెక్షన్ మీడియా మాత్రం బీఆర్ఎస్ రావాలని కోరుకుంటోందని ఫైరయ్యారు.

కుత్బుల్లాపూర్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద వ్యవహరించిన తీరు దుర్మార్గంగా ఉందని బండి ధ్వజమెత్తారు. శ్రీశైలం గౌడ్ గెలుపు ఖాయమని అన్ని సర్వేలు చెబుతున్నాయని, అందుకే భయంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కండకావరంతో బలుపెక్కి ప్రజలంతా చూస్తున్నారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా భౌతిక దాడికి పాల్పడ్డాడని ధ్వజమెత్తారు. సెగ్మెంట్ పరిధిలో ఇండ్లు కొన్నా, జాగాలు కొన్నా వాటా ఇవ్వాల్సిందేనని బెదిరిస్తున్నారన్నారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తానని కుత్బుల్లాపూర్ ప్రజలకు ఓపెన్‌గా వార్నింగ్ ఇస్తున్నాడని, ప్రజలంతా ఆలోచించుకోవాలని సంజయ్ సూచించారు.

వివేకానంద పిట్ట పిల్లలాగా ఉన్నాడని, కూన శ్రీశైలం తల్చుకుంటే నలిపివేయొచ్చని, కానీ ఆ పని చేయలేదని బండి సంజయ్ అన్నారు. కూన శ్రీశైలం ప్రజల కోసం అన్నీ భరిస్తున్నాడని, దాడి చేసినా, గల్లా పట్టినా సహించాడన్నారు. బీఆర్ఎస్ నేతలు తలకాయ కిందకు, కాళ్లు పైకి పెట్టినా మళ్లీ అధికారంలోకి రావడం కలేనని ఆయన ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో కేసీఆర్, ఆయన కొడుకు ముఖం పెట్టుకుని గెలిచిన బీఆర్ఎస్ నేతలు.. ఇవ్వాళ తల పట్టుకుంటున్నారని ఫైరయ్యారు. ఎందుకంటే ఇవ్వాళ వారి ముఖాలను చూస్తే జనం థూ అని ఉమ్మేస్తున్నారన్నారు. ఇది గమనించిన బీఆర్ఎస్ అభ్యర్థులు సొంత ఫొటోలు పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారన్నారు.

కూన శ్రీశైలం పేదరికం నుండి వచ్చారని, వివేకానంద బలిసి కొట్టుకుంటున్నాడని ఫైరయ్యారు. ప్రజల తీర్పే ఫైనల్ అని, బీర్ఎస్‌కు గుణపాఠం చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భౌతిక దాడులు జరిగే అవకాశముందని ముందే సమాచారం వచ్చిన తరువాత కూడా పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదని బండి ప్రశ్నించారు. దాడి చేసిన వ్యక్తిపై కేసు పెట్టాల్సిందేనని, ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాల్సిందేనని బండి డిమాండ్ చేశారు. కూన శ్రీశైలంను పరామర్శించిన వారిలో మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, బీజేపీ నేతలు సంగప్ప, రవి కుమార్ యాదవ్, చీకోటి ప్రవీణ్ ఉన్నారు.

Advertisement

Next Story