ఆగ్రహంతో మంత్రి కేటీఆర్‌కు యువజన సమితి సమాధాన లేఖ

by GSrikanth |
ఆగ్రహంతో మంత్రి కేటీఆర్‌కు యువజన సమితి సమాధాన లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి కేటీఆర్ తమ తొలి విడత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 1 లక్షా 35 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని ఇటీవల యువతకు విడుదల చేసిన ఆత్మీయ లేఖలో పేర్కొన్నారు. ఇది పూర్తిగా అవాస్తవమని టీజేఎస్ యువజన సమితి ఆరోపించింది. సోమవారం నాంపల్లిలోని టీజేఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో యువజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సలీంపాష కేటీఆర్‌కు సమాధాన లేఖను విడుదల చేశారు. టీఆర్ఎస్ తొలి ప్రభుత్వ హయాంలో వివిధ నోటిఫికేషన్ల బోర్డుల ద్వారా జారీ అయిన ఉద్యోగాల సంఖ్య 79, 393 అని, ఇందులో భర్తీ అయినవి 77, 935 అని, విద్యుత్ శాఖలో, ఆర్టీసీలో, సింగరేణిలో దాదాపు 49, 174 ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేశారని స్పష్టం చేశారు. కొత్తగా నోటిఫికేషన్ల ద్వారా డైరెక్ట్ గా భర్తీ అయిన ఉద్యోగాలతో, రెగ్యులరైజ్ చేసిన ఉద్యోగాలను జోడించి మొత్తం 1 లక్షా 35 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని, బహిరంగ చర్చకు రావాలని అనేక సార్లు డిమాండ్ చేసినా, ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని పేర్కొన్నారు.

ఇక రెండో విడత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వచ్చిన నోటిఫికేషన్ల ఉద్యోగాల సంఖ్య 32 వేలని, ఇవి ఇంకా నియామక ప్రక్రియలోనే ఉన్నాయన్నారు. ఇటీవల విడుదల అయిన పీఆర్సీ నివేదికలో 1, 91, 126 ఉద్యోగాల సంఖ్య ఖాళీగా ఉందని తేలిందని వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో దాదాపు 50 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని స్పష్టం చేశారు. మొత్తంగా ఇప్పుడంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం 2 లక్షల 76 వేల ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ప్రభుత్వానికి ఉందని, కానీ ప్రభుత్వం 90 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటన చేస్తుందని పేర్కొన్నారు. గత 9 సంవత్సరాలలో నిరుద్యోగం నాలుగింతలు అయిందని, కనీసం ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదన్నారు. దీనివల్ల ఉద్యోగ నోటిఫికేషన్ల జాప్యం వల్ల దాదాపు 200 మంది నిరుద్యోగులు చనిపోయారని, వీరి ఆత్మహత్యలపై కేటీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి, యువజన సమితి రాష్ట్ర నాయకులు సర్దార్ వినోద్ కుమార్, మాసంపల్లి అరుణ్ కుమార్, ఏర్ర వీరన్న, కొత్త రవి, జీవన్ రెడ్డి, పేరాల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed