రైతులు రాజులైతే 9 వేల మంది ఎందుకు సూసైడ్ చేసుకున్నారు?: కేటీఆర్పై వైఎస్ షర్మిల ఫైర్

by Javid Pasha |   ( Updated:2023-07-16 17:34:08.0  )
రైతులు రాజులైతే 9 వేల మంది ఎందుకు సూసైడ్ చేసుకున్నారు?: కేటీఆర్పై వైఎస్ షర్మిల ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: మీ పాలనలో రైతులు రాజులైతే 9 వేల మంది రైతులు ఎందుకు సూసైడ్ చేసుకున్నారని కేటీఆర్పై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. తమ పాలనలో రైతులు రాజులు అయ్యారంటూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ పై వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల స్పందించారు. పచ్చ కామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తదన్నట్లుంది కేటీఆర్ తీరు అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. రైతును రాజు చేసినం అని ప్రగల్భాలు పలికే చిన్న దొర గారు.. రైతు ఎట్లా రాజయ్యిండో సమాధానం చెప్పానలని నిలదీశారు. 31 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టినందుకు రాజులయ్యిండ్రా ? ఎరువులు ఫ్రీ అనే ఉత్తమాటలు చెప్పినందుకు రైతును రాజును చేసినట్లా? రూ.14 వేల కోట్ల పంట నష్టపరిహారం ఎగ్గొడితే రైతులు రాజులయ్యారా? అంటూ ప్రశ్నించారు. ముష్టి రూ.5 వేలు ఇచ్చి రూ.35 వేల సబ్సిడీ పథకాలు బంద్ పెడితే రైతును రాజు చేసినట్లా అని అన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ అని చెప్పి పట్టుమని 8 గంటలు ఇవ్వని పాలన రారాజు పాలన ఎట్లా అవుతుందని ప్రశ్నించారు.

‘రైతు రాజైతే పదేండ్లలో 9 వేల మంది రైతుల చావులు ఎట్లా జరిగినయ్? వరి వేస్తే ఉరి అని చెప్పిన మీ దరిద్రపు పాలన ఆగమైన వ్యవసాయానికి ఆత్మహత్యలే శరణ్యమనడానికి నిదర్శనం. రుణాలు కట్టక రాజులు కాదు.. బ్యాంకుల దగ్గర మోసగాళ్లను చేశారు. మీ పాలన "రైతును రాజు చేసిన పాలన కాదు - రైతును రోడ్డుమీదకు" తెచ్చిన పాలన. తెచ్చిన అప్పులకు పెళ్ళాం పుస్తెలు సైతం అమ్ముకునేలా చేశారు. పండించిన పంటకు గ్యారెంటీ లేక రైతుల మెడకు ఉరి తాడేశారు. కలో గంజో తింటూ ఉన్న భూమిని నమ్ముకుంటే.. ధరణి పేరుతో భూములు గుంజుకొని రైతులను రోడ్డున పడేశారు. రైతు అనేవాడు 59 ఏళ్లలోపు చనిపోవాలని మరణ శాసనం రాశారు’ అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుల చావుల్లో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ అన్న ఆమె.. ఇదేనా రైతును రాజు చేసే పాలన అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ పుట్టింది రైతుల కోసం కాదని రైతులను పాడే ఎక్కించడానికని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశపు గడ్డ మీద రైతును రారాజు చేసింది మహానేత వైఎస్ఆర్ ఒక్కరే అన్న షర్మిల.. ఉచిత విద్యుత్ ఇచ్చి వ్యవసాయాన్ని పండుగ చేసిన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. వైఎస్ఆర్ తాను ఇచ్చిన మాట మేరకురుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులు చేశారని, సబ్సిడీ పథకాలు పెట్టి రైతుకు విలువ తెచ్చారని అన్నారు. మహానేత పాలన రైతాంగం చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం అని షర్మిల చెప్పారు.

Advertisement

Next Story