బీసీల నయవంచనకు కేసీఆర్ ప్లాన్.. YS షర్మిల కీలక వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2023-05-20 14:18:12.0  )
బీసీల నయవంచనకు కేసీఆర్ ప్లాన్.. YS షర్మిల కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో బీసీ ఓట్ల కోసమే బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. తొమ్మిదేళ్లు బీసీలను పట్టించుకోని కేసీఆర్ తీరాఎన్నికల వేళ ఆర్థిక సాయం పేరుతో నయవంచనకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే కేసీఆర్ దళితబంధు పేరుతో దళితులను దగా చేస్తే, గిరిజన బంధు అంటూ ఉసూరు మనిపించాడని ధ్వజమెత్తారు. తొమ్మిదేళ్లుగా బీసీలకు కేటాయించిన నిధులు పక్కదారి పట్టించి ఎన్నికల వేళ బీసీ రాగం అందుకున్నారని ఆరోపించారు. గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్ లో బీసీలకు లక్ష ఆర్థిక సాయం అందించాలనే నిర్ణయంపై శుక్రవారం షర్మిల స్పందించారు. బీసీలకు 55 వేల కోట్ల బడ్జెట్ అని ఈ ప్రభుత్వం చెప్పడమే కానీ రూపాయి ఇచ్చింది లేదని, స్వయం ఉపాధి రుణాల కోసం 6 లక్షల మంది బీసీ యువత ఎదురుచూస్తుంటే వారిలో ఒక్కరికైనా లోన్ ఇవ్వలేదని మండిపడ్డారు.

ఐదేళ్ల క్రితం ఇచ్చిన బీసీ సబ్ ప్లాన్ హామీ అటకెక్కించారని అన్నారు. 50 శాతం రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదన కాగితాలకే పరిమితం అయిందని, బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కు దిక్కులేదన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ కు రూ.3 వేల కోట్లు కేటాయిస్తే రూ.3 కోట్లు కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. మంత్రివర్గంలో బీసీలకు ప్రయార్టీ లేదని బీసీల ఆత్మగౌరవ భవనాలు పునాదులు దాటలేదని ఎద్దేవా చేశారు. బీసీల కులగణన అంటూ విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేసి తెరచాటున కేంద్రంలో లాలూచీ పడ్డారని ఆరోపించారు. బీసీ బిడ్డలు బర్లు, గొర్లు మేపుతూ.. చేపలు పట్టుకుంటుంటే కేసీఆర్ కుటుంబం మాత్రం రాజ్యాలు ఏలాలా అని ప్రశ్నించారు. బీసీలను చిన్న చూపు చూసిన కేసీఆర్ ప్రభుత్వానికి 60 లక్షల బీసీ కుటుంబాలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాయని అన్నారు.

ఇవి కూడా చదవండి:

రేపే కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారోత్సవం.. కేసీఆర్కు అందని ఆహ్వానం..!

Advertisement

Next Story

Most Viewed