నలుగురిలో పై చేయి ఎవరిది? రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగాగా ఎమ్మెల్సీ బైపోల్

by Prasad Jukanti |
నలుగురిలో పై చేయి ఎవరిది? రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగాగా ఎమ్మెల్సీ బైపోల్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ముగిసిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి మరో ఉపఎన్నికపై పడింది. ఈనెల 27న జరగబోయే వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల బైపోల్‌పై పార్టీలు ఫోకస్ పెంచాయి. ఇంతకాలం ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. బరిలో కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కుమార్, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ తరఫున ఏనుగుల రాకేశ్‌రెడ్డి పోటీలో ఉండగా స్వతంత్ర అభ్యర్థిగా ఉద్యమకారుడు, నిరుద్యోగుల తరఫున పోరాటాలు నడిపిన అశోక్ సర్ కూడా బరిలో నిలవడంతో ఈపోరు రసవత్తరంగా మారుతోంది. దీంతో ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోనున్న 4.63 లక్షల మంది గ్రాడ్యూయేట్ ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? అంతిమంగా గెలిచి నిలిచేదెవరు? అనేది ఉత్కంఠగా మారింది. నామినేషన్ల ఉపసంహరణకు నిన్నటితో గడువు ముగిసింది. మొత్తం 11 మంది అభ్యర్థులు విత్ డ్రా చేసుకోవడంతో అంతిమంగా 52 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ప్రధాన పార్టీల మధ్యే పోరు జరిగే అవకాశాలున్నాయనే టాక్ వినిపిస్తోంది.

‘తీన్మార్’ దూకుడు...

గతంలో రెండుసార్లు ఇదే స్థానం నుంచి ఎమ్మెల్సీగా పోటీకి దిగిన తీన్మాన్ మల్లన్నపై కాంగ్రెస్ అధిష్టానం విశ్వాసం ఉంచింది. అధిష్టానం తనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నాటి నుంచే మల్లన్న ఈ సెగ్మెంట్‌లో తనదైన రీతిలో ప్రచారం కొనసాగిస్తున్నారు. తన ఆస్తులను ప్రభుత్వానికే ధారాదత్తం చేస్తున్నట్లు చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన మల్లన్న 1.49 లక్షల ఓట్లు సాధించి స్వల్ప ఓట్ల తేడాతో రెండో స్థానంలో నిలిచారు. అయితే గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడం, ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత పక్షాన నిలవడం, తన మాటతీరు వల్ల మల్లన్న గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింతగా చేరువ కాగలిగారు.

రేసులో అతడే ముందంజ..?

ఈసారి కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉండటం, నిరుద్యోగులు, యువత తనకు అండగా నిలుస్తారనే ధీమాతో గెలుపై మల్లన్న విశ్వాసంతో ఉన్నారు. గతంలో ఎలాగైతే నిరుద్యోగుల తరఫున పోరాటం చేశానో తాను గెలిచాక కూడా నిరుద్యోగుల గొంతుకగా ఉంటానని చెబుతూ యువతను మరింతగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈ మూడు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే అధికంగా ఉండటంతో ఈసారి మల్లన్న గెలుపు రేస్‌లో ముందు వరుసలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.

కారు, కమలం, మధ్యలో ఉద్యమకారుడు...

సిట్టింగ్ స్థానం కావడంతో ఎలాగైనా గెలిచి తమ పట్టు నిలుపుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా ఈ స్థానం నుంచి గెలిచి బోణీ కొట్టాలని బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. మరోవైపు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతున్న ఉద్యమకారుడు, ‘అశోక అకాడమీ’ చైర్మన్ అశోక్ సర్ సైతం బరిలో ఉండటంతో పోటీ రసవత్తరంగా మారనుంది. అశోక్ సర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలతోపాటు రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జీవో 46, టెట్‌, మెగా డీఎస్సీ, గురుకులాలలో అన్ని పోస్టుల భర్తీ, నోటిఫికేషన్ల విషయంలో నిరాహార దీక్ష చేసి చర్చగా మారారు. ఈ క్రమంలో తన శిష్యులు, మిత్రుల ద్వారా అశోక్ సర్ సైతం క్యాంపెయినింగ్ ప్రారంభించి ఓటర్ల వద్దకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో టగ్ ఆఫ్ వార్‌గా మారుతున్న వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికలో గ్రాడ్యుయేట్ ఓటర్ల తీర్పుపై ఉత్కంఠ నెలకొన్నది.



Next Story