Seethakka: అందుకోసమే బీఆర్ఎస్ డ్రామాలు.. సీతక్క ఫైర్

by Prasad Jukanti |
Seethakka: అందుకోసమే బీఆర్ఎస్ డ్రామాలు.. సీతక్క ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ప్రధాని, అదానీ ఇద్దరూ వేర్వేరు కాదని ఈ ఇద్దరు కలిసి దేశాన్ని దోచుకుంటున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. రాజకీయ కక్ష్యల కోసం ఈడీని వాడుకుంటున్న కేంద్ర ప్రభుత్వం.. అదానీ అక్రమాలపై మాత్రం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అదానీ వ్యవహారంపై జేపీసీకి డిమాండ్ చేస్తూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ హైదరాబాద్ గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని మాట్లాడుతూ.. అదానీ అక్రమాలపై కాంగ్రెస్ ధర్నాలు చేస్తుంటే బీఆర్ఎస్ మాత్రం బీజేపీ మెప్పుకోసం పాకులాడుతున్నదని ఆరోపించారు. అదానీ అక్రమాలపై తమ వైఖరి ఎమిటో బీఆర్ఎస్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

పెట్టుబడులకు, దోపిడీకి ఎంతో తేడా ఉందని అదానీ సక్రమ వ్యాపారాలు చేస్తే అభ్యంతరం లేదని ఈ వాస్తవాన్ని బీఆర్ఎస్ గుర్తించాలన్నారు. అదానీ అక్రమాలపై విచారణ చేయాల్సిన సెబీ పెద్దలే ఆయన కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లు హిండెన్ బర్గ్ సంస్థ ఆధారాలతో సహా బయటపెడితే చర్యలు తీసుకోకపోవడం ఏంటని నిలదీశారు. అదాని అక్రమాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే రైతు రుణమాఫీ పేరుతో బీఆర్ఎస్ డ్రామాలు చేస్తున్నదన్నారు. పదేళ్లలో గులాబీ పార్టీ చేయనిది మేము 100 రోజుల్లోనే చేసి చూపించామన్నారు. సాంకేతిక కారణాల వల్ల ఎవరికైనా రుణమాఫీ కాకుంటే వారికి సైతం రుణమాఫీ చేసితీరుతామన్నారు.

Advertisement

Next Story

Most Viewed