కస్తూర్బా బాలికల వసతి గృహం ఎప్పుడు పూర్తవుతుందో..?

by Disha Web Desk 23 |
కస్తూర్బా బాలికల వసతి గృహం ఎప్పుడు పూర్తవుతుందో..?
X

దిశ,మరిపెడ : పేద,మధ్యతరగతి కుటుంబాలకు చెందిన బాలికలకు భద్రత,వసతితోపాటు నాణ్యమైన విద్యను అందించాలని లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్ర వ్యాప్తంగా కస్తూర్బా బాలికల వసతి గృహలను నెలకొల్పడం జరిగింది.అందులో భాగంగా మహబూబాబాద్ జిల్లాలోని చిన్న గూడూరు మండల కేంద్రంలో నూతన కస్తూర్బా బాలికల వసతి గృహానికి మూడేళ్ల క్రితం శంకుస్థాపన చేసిన కోర్టు కేసు వల్ల పని పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు. భవన నిర్మాణాలకు అనుకూలమైన వేసవి కాలం ముగియడానికి రెండు నెలలే ఉండగా విద్య సంవత్సరం ముగియడానికి కొన్ని రోజులే ఉంది.ప్రస్తుతం వున్న వసతి గృహం లో సమస్యల తో విద్యార్థునులు ఇబ్బందులకు గురవుతున్నారు.దీంతో విద్యార్థినులు వారి తల్లిదండ్రులు ఈ సారి అయిన భవనం పూర్తి అవుతుందా అని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. కోర్టు కేసు వల్ల నిర్మాణ జాప్యం జరుగుతుండడంతో వర్క్ క్యాన్సిల్ చేస్తారా? లేదా రీటెండర్ పిలుస్తారా? అనే డైలమా నెలకొంది.అధికారులు మాత్రం సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామంటూ చెప్పుకొస్తున్నారు.

అసంపూర్తిగా భవన నిర్మాణం.!

చిన్నగూడూరు మండల కేంద్రంలో నూతన కస్తూర్బా బాలికల వసతి గృహ నిర్మాణం కోసం మూడు కోట్ల యాభై లక్షల రూపాయల నిధులతో 08-02-2021 న అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ శంకుస్థాపన చేయడం జరిగింది. ల్యాండ్ పూలింగ్ నుండి మొదలుకొని విభిన్న పరిస్థితులు కోర్టు కేసు వల్ల ముచ్చటగా మూడు సంవత్సరాలు గడిచింది. మొత్తం పనిలో 75% పూర్తికాగా ఇంకా 25% పని పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది.దీంతో ఈ భవనం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుంది. తాగి పడేసిన బీరు సీసాలతో మొదలుకొని గొర్లు, బర్లు అందులోనే ఉంచుతూ పశువుల పాకగా మార్చేస్తున్నారు.కోర్టు తీర్పు ప్రభుత్వానికి సానుకూలంగా వస్తే భవన నిర్మాణం పూర్తవడంతో పాటు విద్యార్థునుల సంఖ్య పెరుగుతుంది.అలాగే తరగతి గదులు పెంచే అవకాశం ఉంటుంది.సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.విద్యార్థునుల భవిష్యత్తు బాగుంటుంది.

ఆ భూమి తనదే అంటూ హైకోర్టును ఆశ్రయించిన సదరు వ్యక్తి.!

బాలికల వసతి గృహం నిర్మాణం కోసం గుర్తించిన భూమి వివాదాస్పదంగా మారింది.ఏళ్లకు ఏళ్ళు గా సాగు చేసుకుంటున్న నా భూమిలో ఈ భవన నిర్మాణం చేపడుతున్నారంటూ కంచనపల్లి వెంకన్న అనే రైతు హైకోర్టును ఆశ్రయించాడు.97/2 సర్వే నెంబర్లో రెండెకరాల అసైన్డ్ భూమిని సాగు చేసుకుంటూ ఉంటున్నానని అధికారం అడ్డుపెట్టుకుని రాజకీయ కక్షలతో చోటా,బడా నాయకులు కలిసి నా భూమిలో అక్రమంగా ఈ బాలికల వసతి గృహాన్ని నిర్మించే సాగారాని, నేను నా భూమి అని ఎంత చెప్పిన వినకుండా ఉండడం తో హై కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందంటూ చెప్పుకొచ్చాడు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వాధికారులు చొరవ చూపి ఎవరు నష్టపోకుండా సమస్యని పరిష్కరించాలని, ఈ విద్యా సంవత్సరం కొత్త భవనంలోనే ప్రారంభమయ్యే విధంగా చూడాలని గ్రామస్తులు, విద్యార్థునుల తల్లిదండ్రులు విన్నవించుకుంటున్నాను.

నామమాత్రపు భవనంలో వసతులు లేమితో విద్యార్థినుల ఇబ్బందులు.!

నూతన భవన నిర్మాణం వ్యవహారం అలా ఉంటే ప్రస్తుతం ఉంటున్న నామమాత్రపు భవనంలో విద్యార్థునులు ఇబ్బందులకు గురవుతున్నారు. మొత్తం ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకునే విద్యార్థునులు 190 మంది ఉంటే సరైన టాయిలెట్స్ సౌకర్యం లేదు. టాయిలెట్స్ డోర్ లు విరిగి తుప్పుపట్టి ఉన్నాయి.అలాగే బెంచీల సౌకర్యం లేక కింద కూర్చొని విద్యనభ్యసిస్తున్నారు. పడుకోవడానికి బెడ్ సౌకర్యాలు కూడా లేక కిందనే నిద్రిస్తున్నారు.కొన్ని రూములల్లో ఫ్యాన్స్ లేక ఉక్కపోతతో అల్లాడుతున్నారు. వారి విద్య సామాగ్రితో పాటు,దుస్తులను భద్ర పరచుకోవడానికి పెట్టెలు లేవు. కోతుల బెడద వల్ల వారంలో ఇద్దరు ముగ్గురు విద్యార్థునులు గాయాలపాలవుతున్నారు. విద్యార్థినుల పరిస్థితులను చూసి దాతలు ఎవరైనా సహాకరించాలి అని వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. అలాగే పర్మినెంట్ బయో సైన్స్ సబ్జెక్ట్ టీచర్,కంప్యూటర్ ఆపరేటర్ లేకపోవడం,స్వీపర్ పోస్టు ఖాళీగా వుంది.ఈ విద్యా సంవత్సరానికి ఈ పోస్టులను భర్తీ చేయాలని విద్యార్థి సంఘం నాయకులు కోరుతున్నారు.

లావుణి భూమిలోనే నిర్మాణం చేపట్టాo : స్థానిక తహసిల్దార్ మహబూబ్ అలీ

లావుని భూమిలోనే కస్తూర్బా భవన నిర్మాణం చేపట్టామని అతనికి ఉండవలసిన రెండు ఎకరాల భూమిని అతను సాగు చేసుకుంటున్నాడని ఇంకా భూమి వస్తుంది అనే వాదన సరైంది కాదని అవసరమైతే మరల ఓసారి సర్వే చేసి అతని భూమి అతనికి చూపిస్తామని ఏదైనా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని స్థానిక తహసీల్దార్ చెప్పుకొచ్చారు.

నేను కోల్పోయిన భూమి నాకు ఇస్తే సరి : కంచనపల్లి వెంకన్న, రైతు

నేను భూమి కోల్పోయానని హైకోర్టుని ఆశ్రయించాను దీంతో హైకోర్టు నిర్మాణం జరపవద్దని స్టే ఇచ్చింది.విద్యార్థునుల భవిష్యత్తు కు సంబంధించిన విషయమే నా దృష్టిలో ఉంది. భూమి కోల్పోయి బాధలో ఉన్నాను. అందుకే అదే భూమి కావాలి అని పట్టు పట్టడం లేదు.ఆ పక్కనే ఉన్న భూమిని ఎంత కోల్పోయానో అంత ఇస్తే కేసు విత్ డ్రా అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని 'దిశ 'కు తెలిపారు.

75% పని పూర్తి : కాంట్రాక్టర్ అమర్ రెడ్డి.

ఇప్పటివరకు సుమారుగా 75% పని పూర్తయిందని ఈ.ఓ. టి,అగ్రిమెంట్ పీరియడ్ అయిపోయిందని డిపాజిట్లు చెల్లించాలని పూర్తిస్థాయిలో బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నానని కోర్టు కేసు కొలిక్కి వస్తే రి-టెండర్ పిలిచిన బాగుంటుందని సదర్ కాంట్రాక్టర్ తెలిపాడు.

Next Story

Most Viewed