Warangal: కొత్త స‌ర్కిళ్లేవి..?! జీవో జారీ చేసి వ‌దిలేసిన మునిసిప‌ల్ శాఖ‌

by Ramesh Goud |
Warangal: కొత్త స‌ర్కిళ్లేవి..?! జీవో జారీ చేసి వ‌దిలేసిన మునిసిప‌ల్ శాఖ‌
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌ర పాల‌క సంస్థ పాల‌న కొత్త స‌ర్కిళ్ల ఏర్పాటు అంశం మూల‌న‌ప‌డింది. కొత్త‌గా నాలుగు స‌ర్కిళ్ల‌ను ఏర్పాటు చేస్తూ మొత్తం ఆరు స‌ర్కిళ్ల‌ను అందుబాటులోకి తీసుకురావాల‌ని మునిసిప‌ల్ అండ్ అడ్మినిస్ట్రేష‌న్ ఉన్న‌తాధికారులు గ‌తంలో ప్ర‌తిపాదించారు. పౌర‌ సేవలను మ‌రింత వేగంగా, జ‌వాబుదారిత‌నంతో అందించేందుకు వీలుగా కౌన్సిల్ తీర్మానం మేరకు 2017 అక్టోబర్లో మరో నాలుగు సర్కిళ్లను ఏర్పాటు చేయాలని అప్పటి పుర పాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ జీఓ 267 జారీ చేశారు. 11 డివిజ‌న్ల‌కు ఒక స‌ర్కిల్ కార్యాల‌యంలో చేర్చాల‌ని నిర్ణ‌యించిన రాష్ట్ర అధికారులు, కార్యాల‌యాల లోకేష‌న్ల‌ను కూడా గుర్తించారు. అయితే ఆ త‌ర్వాత కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం స‌మీక్ష‌లో ఈ విష‌యం తెర‌పైకి వ‌చ్చినా మ‌ళ్లీ మూల‌కు ప‌డుతూ వ‌స్తోంది.

స‌ర్కిళ్ల ఏర్పాటుకు భారీగానే క‌స‌ర‌త్తు..!

వాస్త‌వానికి మునిసిప‌ల్ ఉన్న‌తాధికారులు కొత్త స‌ర్కిళ్ల ఏర్పాటుకు భారీగానే క‌స‌ర‌త్తు చేశారు. స‌ర్కిళ్ల ప‌రిధిని పున‌ర్విభ‌జ‌న చేస్తూ 6 స‌ర్కిళ్ల ప‌రిధిలోకి ఆయా డివిజ‌న్ల‌లోని ఏరియాల‌ను చేర్చే ప్ర‌తిపాదిత ప్ర‌క్రియ‌ను చేప‌ట్టారు. ఈక్ర‌మంలోనే అందుబాటులో ఉన్న ఆయా ఏరియాల్లోని ప్ర‌భుత్వ భ‌వ‌నాల్లోనే స‌ర్కిల్ కార్యాల‌యాలను ప్రారంభించేందుకు నిర్ణ‌యించారు. కాశిబుగ్గ కార్యాలయాన్ని స‌ర్కిల్ -01గా ప్ర‌తిపాదించారు. ఈ స‌ర్కిల్ కార్యాల‌యం ప‌రిధిలోకి గిర్మా జీపేట, మట్టివాడ, కొత్తవాడ, పోచమ్మమైదాన్, పిన్నావారివీధి, రామన్నపేట ఏరియాల‌ను తీసుకురావాల‌ని నిర్ణ‌యించారు. అలాగే 2వ స‌ర్కిల్ ప‌రిధిలోకి ఎల్బీ నగర్, లేబర్ కాలనీ, అబ్బనికుంట, కాశిబుగ్గ, చింత ల్, శివనగర్, పెరుకవాడతో పాటు మ‌రికొన్ని విలీన గ్రామాల‌ను ఇందులో చేర్చారు. సర్కిల్-3 రంగశాయిపేట, వాటర్ ట్యాంక్ లేదా ఉర్సులో సీఆర్సీ భవనం నిర్మిం చాలని నిర్ణయించారు. సర్కిల్-4ను హనుమకొండలోని న‌క్క‌ల గుట్ట ఏరియాలో ఏర్పాటు చేసి హ‌న్మ‌కొండ‌ చౌరస్తా, కుమార్‌ప‌ల్లి, కిష‌న్‌పుర‌, అడ్వ‌కేట్స్ కాల‌నీ త‌దిత‌ర ప్రాంతాల‌ను స‌ర్కిల్ ప‌రిధిలోకి తీసుకురావాల‌ని ప్ర‌తిపాదించారు. సర్కిల్ -5ను ప్రస్తుతం ఉన్న కాజీపేట సర్కిల్లోనే కొన‌సాగించాల‌ని భావించారు. సర్కిల్ 6ను న‌యీంన‌గ‌ర్‌లో ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఫాతిమానగర్‌తో పాటు కాజీపేట, విలీన గ్రామాల ప్రజలకు అందు బాటులో ఉండే విధంగా ప్రణాళిక రూపొందిం చారు.

ప్ర‌జ‌ల‌కు త‌ప్ప‌ని వ్య‌య ప్ర‌యాస‌లు..

జీడ‌బ్ల్యూఎంసీ ప‌రిధిలో కొత్త‌గా నాలుగు సర్కిళ్ల ఏర్పాటు అట‌కెక్క‌డంతో ప్ర‌జ‌ల‌కు వ్య‌య ప్ర‌యాస‌లు త‌ప్ప‌డం లేదు. ఏదైనా స‌మ‌స్య‌ను విన్న‌వించుకుందామ‌నుకునే న‌గ‌ర పౌరుల‌కు దూర‌భారం, ఆర్థిక భారాలు త‌ప్ప‌డం లేదు. ప్ర‌తి సోమ‌వారం గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ కార్యాల‌యంలో నిర్వ‌హించే గ్రీవెన్స్‌కు పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు ఫిర్యాదు చేసేందుకు వ‌స్తుండ‌టమే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని చెప్పాలి. ఆయా స‌ర్కిళ్ల‌పై విప‌రీత‌మైన ప‌నిభారం ప‌డుతుండ‌టంతో పౌర సేవ‌ల్లోనూ తీవ్ర‌మైన జాప్యం కొన‌సాగుతోంది. ఆరు స‌ర్కిళ్ల‌ను అందుబాటులోకి తీసుకురావ‌డం ద్వారా కొత్త‌గా అద‌నంగా మ‌రో న‌లుగురు డిప్యూటీ క‌మిష‌న‌ర్లు అందుబాటులోకి రానున్నారు. కోట్లాది రూపాయాల అభివృద్ధి ప‌నుల‌పై డిప్యూటీ క‌మిష‌న‌ర్ల ప్ర‌త్య‌క్ష ప‌రిశీల‌న‌, ఉద్యోగుల ప‌నితీరుపై ప‌ర్య‌వేక్ష‌ణ ఉండే అవ‌కాశం ఉంది. జ‌వాబుదారీత‌నం పెంపొందే అవ‌కాశం ఉంది. 11 డివిజ‌న్ల‌కు ఒక స‌ర్కిల్ ఏర్పాటయ్యే అవ‌కాశం ఉన్నందున అధికారుల‌కు ప‌ని ఒత్తిడి త‌గ్గ‌డంతో పాటు డివిజ‌న్లలో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌పై ప‌ర్య‌వేక్ష‌ణ పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ అధికార వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

రాష్ట్ర ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌పై ఆశ‌లు..!

వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌ర పాల‌క సంస్థ ప‌రిధిలోని పెండింగ్ ప‌నులు, ప‌రిపాల‌న‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం దృష్టి పెట్టిన విష‌యం తెలిసిందే. రాష్ట్రానికి రెండో రాజ‌ధాని స్థాయిలో వ‌రంగ‌ల్‌ను అభివృద్ధి చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి, మంత్రులు ప్ర‌క‌టిస్తున్న నేప‌థ్యంలో న‌గ‌ర అభివృద్ధిపై ఆశ‌లు పెరుగుతున్నాయి. అదే స‌మ‌యంలో త్రిన‌గ‌రి అభివృద్ధికి కేంద్ర బిందువైన జీడ‌బ్ల్యూఎంసీ ప‌రిపాల‌న అంశాల‌కు ప్రాధాన్యం ఏర్ప‌డుతోంది. కొత్త స‌ర్కిళ్ల ఏర్పాటు ఆవ‌శ్య‌క‌త‌ను న‌గ‌ర‌వాసులు నొక్కి చెబుతున్నారు. కొత్త స‌ర్కిళ్ల ఏర్పాటుతో న‌గ‌ర‌వాసుల‌కు మెరుగైన పౌర సేవ‌లు అందుతాయ‌ని గుర్తు చేస్తున్నారు. ఈ విష‌యంపై రాష్ట్ర ప్ర‌భుత్వం ఫోక‌స్ చేస్తుందో లేదో వేచి చూడాలి.

Advertisement

Next Story