- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కౌన్ బనేగా పరకాల కాంగ్రెస్ క్యాండిడేట్.. టికెట్ ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ..!
దిశ, వరంగల్ బ్యూరో: పరకాల కాంగ్రెస్ టికెట్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. అంచనాలను తారుమారు చేస్తూ అనుహ్యంగా కొత్తవారి పేర్లు తెరపైకి రావడం, రేవూరి ప్రకాశ్ రెడ్డిలాంటి సీనియర్ నేత పార్టీలో చేరుతుండటం వంటి పరిణామాలు ఈ నియోజకవర్గ ప్రజల్లో ఆసక్తిని రేపుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని ఎదుర్కొవడానికి ధీటైన అభ్యర్థి ఎంపిక ముఖ్యమని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం.. అందులో భాగంగానే అభ్యర్థిని నిలపడంపై అనేక శోధనలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.
ఈ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తూ పనిచేస్తున్న పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఇనుగాల వెంకట్రాంరెడ్డికే టికెట్ కేటాయించాలని ఆయన వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో ఈ నియోజకవర్గంపై గట్టి పట్టున్న కొండా మురళీధర్‌రావుకు కేటాయించాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. ఇద్దరి నేతల అభిమానులు, అనుచరులు, పోటాపోటీగా ప్రెస్‌మీట్లు పెట్టి మరి తమనేతకే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేయడం గమనార్హం.
అనుహ్యంగా తెరపైకి ముగ్గురు
పరకాల నియోజకవర్గ టికెట్‌ను బీసీలకే కేటాయించాలనే డిమాండ్ రావడంతో మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్ పేరు తెరపైకి వచ్చింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డిని కలవడం, ఒక నిర్ధిష్ఠమైన హామీతోనే ఆయన పార్టీ కండువా కప్పుకోవడం జరిగిపోయినట్లుగా తెలుస్తోంది. ఆయనకు పరకాల గానీ మరేదైనా నియోజకవర్గం నుంచి అవకాశం కల్పిస్తారన్న చర్చ జరుగుతోంది. పరకాల నుంచి పోటీకి స్వతహాగా ఆయన ఆసక్తి చూపుతున్నారు. డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్ సైతం సైలెంట్‌గా తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నట్లు సమాచారం. గాజర్ల అశోక్, ఇనుగాల, కొండా మురళీధర్‌రావు పార్టీ అధినాయకత్వం సీరియస్‌గా పరిశీలిస్తున్న సమయంలోనే కాంగ్రెస్‌లోకి రేవూరి వచ్చేందుకు సిద్ధపడటం పరకాల రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.
కండువా కప్పుకోని రేవూరి..!
సీనియర్ రాజకీయవేత్త, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించినప్పటికీ, ఇంకా కండువా కప్పుకోలేదు. భూపాలపల్లిలో రాహుల్‌గాంధీకి రేవూరిని రేవంత్ రెడ్డి పరిచయం చేశారు. ఆ సమయంలోనే చేరికకు సిద్ధపడినా.. చేరికలకు మరో కార్యక్రమం ఏర్పాటు చేస్తే బాగుంటుందని రాహుల్ సూచించడంతో రేవూరి చేరిక వాయిదా పడినట్లు ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. దసరా పండుగకు ముందే ఈనెల 21లేదా 22న కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించిన రెండో జాబితాను విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈనేపథ్యంలో పరకాల స్థానంపై అభ్యర్థి ప్రకటన ఉంటుందా..? ఉండదా అన్నద సందిగ్ధంగా మారింది.
రేవూరికే పార్టీ టికెట్ కన్ఫార్మ్ అయ్యిందన్న ప్రచారం జరుగుతుండగా, పార్టీలోనే చేరని నేతకు ముందస్తుగా టికెట్ కేటాయింపు అసాధ్యమమైన పరిణామమనే చెప్పాలి. ఈలోపు ఏదైనా కార్యక్రమం నిర్వహించుకుని ఆయన పేరును జాబితాలోకి తీసుకొస్తే నియోజకవర్గంలో ఆయనకు, కాంగ్రెస్ పార్టీకి సానుకూల రాజకీయ పరిణామాలు సాధ్యమేనా..? కాంగ్రెస్‌లో అసమ్మతికి చెక్ పెట్టగలరా..? సమైక్యరాగాన్ని తీసుకురాగలరా..? అన్న ప్రశ్నలు, అనుమానాలు బలంగానే క్షేత్రస్థాయి నేతల నుంచి వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో బీసీలకే కేటాయిస్తారన్న ఆశాభావంతో మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్, మొదట్నుంచి పార్టీని నమ్ముకుని కాంగ్రెస్‌లో పనిచేస్తున్న తనకే అవకాశం వస్తుందని ఇనుగాల, నియోజకవర్గ పార్టీపై పట్టున్న తనకే అవకాశం వస్తుందన్న ధీమాలో కొండా మురళీధర్‌రావు ఉన్నట్లు వారి సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.
క్షేత్రస్థాయిలో బీఆర్ ఎస్, బీజేపీ జోరుగా ప్రచారం..!
బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మళ్లీ ఆ పార్టీ బీ ఫాం అందుకోవడంతో ఆయన ఇప్పటికే ప్రచారం షూరు చేశారు. అదే సమయంలో బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న డాక్టర్ కాళీ ప్రసాద్‌రావు, ఆయనకు మద్దతుగా పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి సైతం నిత్యం జనంలో ఉంటున్నారు. రాష్ట్ర స్థాయి పరిస్థితుల్లో బీజేపీ వెనుకబడినా.. పరకాలలో మాత్రం మొదట్నుంచి కూడా బీజేపీ నాయకత్వం దూకుడు ప్రదర్శిస్తుండటం గమనార్హం.
కాళీ ప్రసాద్‌రావు చేరిక తర్వాత వరుసగా ఆయన పార్టీ ప్రచార కార్యక్రమాలు చేపడుతూ నిత్యం జనంలో ఉంటున్నారు. ఈ పరిణామం ఆ పార్టీ పుంజుకోవడానికి దోహదం చేస్తోందనే చెప్పాలి. ఇలాంటి పరిణామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై సందిగ్ధం కొనసాగుతుండటంతో నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాలు కొనసాగకపోవడం మైనస్‌గా శ్రేణులు భావిస్తున్నాయి. మలి జాబితాలో పరకాల కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఖరారు అవుతుందా..? వాయిదా పడుతుందో వేచి చూడాలి.