మున్సిపాలిటీ విలీనానికి సాంకేతిక అడ్డంకులు..

by Sumithra |   ( Updated:2025-02-01 06:52:42.0  )
మున్సిపాలిటీ విలీనానికి సాంకేతిక అడ్డంకులు..
X

దిశ, నర్సంపేట : నర్సంపేట మున్సిపాలిటీలో 9 గ్రామాలను విలీనం చేస్తూ ఏ నెల 4వ తేదీన గెజిట్ విడుదలైన సంగతి తెలిసిందే. తొమ్మిది గ్రామాలు విలీనం అవుతాయని మొదట భావించినా సీడీఎంఏ ఉత్తర్వులు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉత్తర్వులు భిన్నంగా ఉండటంతో గందరగోళం నెలకొంది. ఈ నెల 27న కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మిస్ట్రేషన్ టీకే. శ్రీదేవి 7 గ్రామాలు మాత్రమే విలీనమైనట్లు ఉత్తర్వులు జారీ చేయగా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జారీ చేసిన నోటిఫికేషన్లో మాత్రం 8 గ్రామాలు విలీనమైనట్లు పేర్కొన్నారు. ఈ రెండు వేర్వేరు ఉత్తర్వులతో గ్రామస్తులనే కాదు అధికారులను కూడా అయోమయంలో నెట్టేసినట్లైంది. అధికారులను వివరణ కోరినా స్పందించేందుకు సుముఖంగా లేకపోవడం వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా నర్సంపేట మున్సిపాలిటీ ప్రస్తుత 24 వార్డుల నుంచి 30 వార్డులకు విస్తరణకు సీడీఎంఏ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఫిబ్రవరి 6 నాటికి విలీన గ్రామాల రికార్డులను స్వాధీనం చేయాలని ఆదేశాలు సైతం జారీ చేశారు.

ఏజెన్సీలోనే రాజుపేట...

నర్సంపేట పట్టణానికి కూత వేటు దూరంలో గల రాజుపేట గ్రామం ఏజెన్సీ పరిధిలోకి వస్తుంది. 1/70 పీసా చట్ట పరిధిలోని రాజుపేట గ్రామం విలీనానికి సాంకేతిక అడ్డుంకులు ఎదురైనట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 86 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం చివరి గెజిట్ పబ్లికేషన్కు ఆమోదం తెలిపింది. ఈ నెల 4న గెజిట్ పబ్లికేషన్ సైతం విడుదల చేసింది. ఇందులో రాజుపేట ఏజెన్సీ గ్రామాన్ని నర్సంపేట మున్సిపాలిటీలో విలీనం చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. దీనిని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ గ్రామానికి చెందిన గిరిజనులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. తమ అభిష్టానుసారానికి భిన్నంగా 1/70 చట్టానికి విరుద్ధంగా ఏజన్సీ గ్రామాన్ని విలీనం చేయడం అన్యాయమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రభుత్వం చట్టం ప్రకారం ఏజన్సీ గ్రామాల విలీనం సాధ్యసాధ్యాలను పరిశీలించి సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కాకుండా నిలిపివేసినట్లు సమాచారం.

ముగ్ధుంపురంపై తొలగని అస్పష్టత..!

మహేశ్వరం, రాములు నాయక్ తండా, రాజపల్లె, ముగ్దుంపురం, మాధన్నపేట, నాగుర్లపల్లె, పర్మనాయక్ తండా, మత్తోజిపేట గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం అయినట్లు ఖరారు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్లో పేర్కొంది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు పాత ముగ్దుంపురం రెవెన్యూ పరిధిలోనే ముగ్గుంపురం గ్రామం కొనసాగుతోంది. పాత ముగ్గుంపురం రెవిన్యూ నుంచి ముగ్గుంపురం గ్రామాన్ని విభజన చేసినప్పటికీ ఆచరణలో మాత్రం అమలు కాలేదు. ఈ కారణాలతో ముగ్గుంపురం గ్రామం మున్సిపాలిటీలో విలీనానికి సాంకేతికంగా అడ్డంకుగా మారిందని చర్చ జరుగుతోంది. రెండు శాఖల అధికారులు కూడా విలీనంపై స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. మరోవైపు పంచాయతీ రాజ్ కమిషనర్ ఆదేశాలతో ఎంపీటీసీ ఎన్నికల కోసం డీ లిమిటేషన్ డ్రాఫ్ట్ అధికారులు సిద్ధం చేస్తున్నారు.

ర్సంపేట మండలంలో మొత్తం 11 స్థానాలున్నాయి. ముత్తోజిపేట, మాదన్నపేట, మహేశ్వరంతో సహా ముగ్గుంపురం కూడా కలిస్తే స్థానాలు 7కి తగ్గనున్నాయి. ఇటుకాలపల్లి, బాంజిపేట, రాజుపేట, కమ్మపల్లి, చంద్రయ్యపల్లి, లక్నేపల్లి, గురిజాల స్థానాలు మాత్రమే మిగలనున్నాయి.

నిబంధనలు పాటించారా..?

నర్సంపేట మున్సిపాలిటీలో పలు గ్రామాల విలీన ప్రక్రియ ప్రారంభం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్టానికి విరుద్ధంగా నిబంధనలను తుంగలో తొక్కి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గ్రామ సభల ఆమోదం, భౌగోళిక స్వరూపం పరిగణంలోకి తీసుకోకుండానే విలీన ప్రక్రియ చేయడం వల్లనే భిన్నమైన ఉత్తర్వులు జారీ అవుతున్నాయని చర్చ జరుగుతోంది. రాజుపేట తర్వాత ఉన్న ముత్తోజిపేట గ్రామాన్ని, ముగ్గుంపురం గ్రామాన్ని (ఒకవేళ పాత ముగ్గుంపురం రెవెన్యూ పరిధి కారణంగా మినహాయిస్తే) తర్వాత గల రాజపల్లె గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయడం భౌగోళికంగా కాస్త కుదిరే పని కాదన్న చర్చ ప్రస్తుతం జరుగుతోంది. ఈ గ్రామాల తర్వాత మొదలయ్యే గ్రామాల్లో ఎలా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిని నిర్ణయిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.


Next Story