Godavari River : గోదావరి నదికి పెరుగుతున్న వరద ప్రవాహం

by Aamani |   ( Updated:2024-07-18 14:38:35.0  )
Godavari River : గోదావరి నదికి పెరుగుతున్న వరద ప్రవాహం
X

దిశ,కాటారం : నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి వరద ప్రవాహం రోజురోజుకు పెరుగుతోంది. తెలంగాణతోపాటు , సరిహద్దు రాష్ట్రం మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నది వరద నీటితో ఉప్పొంగుతోంది. కాళేశ్వరం లో గోదావరి ప్రాణహిత నదుల కలయిక వద్ద త్రివేణి సంగమ తీరంలో గురువారం 5.860 మీటర్ల ఎత్తులో వరద ప్రవాహం కొనసాగుతోంది. రాత్రంతా వర్షం కురిస్తే మెట్ల వద్దకు గోదావరి వరద నీరు చేరుకునే అవకాశం ఉంది. అన్నారం వద్ద సరస్వతి బ్యారేజీకి గోదావరి నదిలో 10 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. గురువారం భూపాలపల్లి జిల్లాలో అంతట భారీ వర్షం కురిసింది. మరో మూడు నాలుగు రోజులు ఈ వర్ష ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద గురువారం సాయంత్రానికి సుమారు 60 వేల క్యూసెక్కుల వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది.

అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్

వాతావరణ శాఖ సూచన మేరకు జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, తహసిల్దార్లు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. అత్యవసర సేవలకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ యంత్రాంగం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వాతావరణ శాఖ సూచనలు మేరకు రానున్న ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ సమయంలో వర్షం వస్తుందో తెలియదు కాబట్టి ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొంగి పొర్లే నది నాలాలు దాటకుండా గ్రామాల్లో టాం టాం ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.పొంగిపొర్లే వాగులు, రహదారుల్లో ప్రజలు రవాణా చేయకుండా భారీ కేడింగ్ ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. ప్రజలు అత్యవసర సేవలకు తహసీల్దార్, ఎంపీడీఓ, గ్రామ కార్యదర్శులను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు.

Advertisement

Next Story

Most Viewed