మద్యం సిండికేట్‌లో నయా ట్రెండ్.. సీసాలకు షాపుల స్కిక్టర్లు

by Sathputhe Rajesh |
మద్యం సిండికేట్‌లో నయా ట్రెండ్.. సీసాలకు షాపుల స్కిక్టర్లు
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్: ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో మ‌ద్యంపై సిండికేట్ జోరు కొన‌సాగుతోంది. వైన్‌ షాపుల నుంచే వ్యాపారులు సిండికేట్ బ్రాండింగ్‌తో బాజాప్త దందా సాగిస్తుండ‌టం గ‌మ‌నార్హం. అడ్డూ అదుపు లేనేలేదు.. దాగుడు మూత‌లు అస‌లే లేవు అన్న చందంగా రెచ్చిపోతున్నారు. జ‌న‌గామ‌, భూపాల‌ప‌ల్లి, ములుగు, ఏటూరునాగారం, మ‌హ‌బూబాబాద్‌, న‌ర్సంపేట‌, ప‌ర‌కాల‌, క‌మాలాపూర్‌, హ‌స‌న్‌ప‌ర్తి, డోర్న‌క‌ల్‌, కేస‌ముద్రం, మరిపెడ‌, తొర్రూరు, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌, కొత్త‌గూడ‌, వ‌ర్ధ‌న్న‌పేట‌, ప‌ర్వ‌త‌గిరి, రాయ‌ప‌ర్తి, గీసుగొండ‌, సంగెం ప్రాంతాల్లో సిండికేట్ దందా జోరుగా సాగుతున్న‌ట్లు స‌మాచారం. వ్యాపారుల మ‌ధ్య కుదిరిన అవ‌గాహ‌న ఒప్పందానికి చిహ్నంగా ఆయా మండ‌లాలు, ప్రాంతాల్లో వ్యాపారులు త‌మ‌ షాపుల పేర్ల‌లోని అక్ష‌రాల‌ను క‌లుపుతూ సిండికేట్ కోడ్ స్టిక్క‌ర్ ను సీసాల‌పై అంటించేస్తుండటం గ‌మ‌నార్హం. కొన్ని ఏరియాల్లోని మ‌ద్యంపై సిండికేట్ దందాకు సంబంధించిన సాక్ష్య‌ధారాలు దిశ చేతికి చిక్కాయి. రాయ‌ప‌ర్తి మండ‌ల కేంద్రానికి కేటాయించిన మూడు వైన్‌షాపులు ప‌క్క‌ప‌క్క‌నే ఏర్పాటు చేశారు. ఈ మూడు షాపుల య‌జ‌మానులు సిండికేట్‌గా మారిపోయారు. వీఏకేఆర్ అనే స్టిక్క‌ర్‌ను మ‌ద్యం బాటిళ్ల‌పై అంటించేసి బెల్ట్‌షాపు నిర్వాహాకులకు విక్ర‌యిస్తున్నారన్న ఆరోప‌ణ‌లున్నాయి. V ఫ‌ర్‌ వెంకటేశ్వర వైన్స్, A ఫ‌ర్ అక్షయ, KR ఫ‌ర్ కార్తిక వైన్స్ అని మూడు షాపుల పేర్ల అర్థం వ‌చ్చేలా వీఏకేఆర్ స్టిక్క‌ర్‌ను త‌యారు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

స్టిక్క‌ర్లు ఉన్న‌వే అమ్మేలా తీర్మానం..!

సిండికేట్‌లో వ్యాపారులు తీర్మానించుకున్న‌ట్లు విశ్వ‌స‌నీయంగా తెలిసిన వివ‌రాల ప్ర‌కారం.. సిండికేట్ స్టిక్క‌ర్లు అంటించి ఉన్న‌వి మాత్ర‌మే సంబంధిత మండ‌లం, ఏరియా బెల్ట్‌షాపుల్లో విక్ర‌యించాల్సి ఉంటుంది. అలా కాద‌ని బెల్ట్‌షాపుల నిర్వాహాకులు ఇత‌ర ప్రాంతాల నుంచి మ‌ద్యంను తీసుకువ‌చ్చి విక్ర‌యిస్తే వారిపై సిండికేట్ చ‌ర్య‌లు తీసుకుంటుంది. నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించినందుకు బెల్ట్‌షాపు నిర్వాహాకుల‌కు మ‌రే వైన్‌షాపు య‌జ‌మాని కూడా మ‌ద్యంను స‌ర‌ఫ‌రా చేయ‌దు. ఇలా మ‌ద్యం వ్యాపారుల మ‌ధ్య తేడాలు రాకుండా ఉండేందుకే బెల్ట్‌షాపుల నిర్వాహాకుల‌కు స్టిక్క‌ర్ వేసిన మ‌ద్యం బాటిళ్ల‌ను అద‌న‌పు ధ‌ర‌ల‌కు అమ్ముతున్నారు. ఒక్కో క్వార్ట‌ర్ సీసా, బీరు బాటిల్‌పై రూ.20 అద‌నంగా తీసుకుంటూ అమ్మ‌కాలు జ‌రుపుతున్నారు.

విజిలెన్స్‌కు క‌న‌బ‌డ‌టం లేదా..?

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా వ్యాప్తంగా మ‌ద్యంపై సిండికేట్ జోరుగా సాగుతున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ విజిలెన్స్ అధికారుల‌కు మాత్రం కాన‌రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. లిక్కర్ అక్రమ దందాను అరిక‌ట్టాల్సిన విజిలెన్స్ అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న విష‌యం స్ప‌ష్టమ‌వుతోంది. వ‌రంగ‌ల్‌ జిల్లా స్థాయి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆక‌స్మిక దాడుల‌కు దిగ‌క‌పోవ‌డం అనుమానాల‌కు తావిస్తోంది. ఊరూరా బెల్ట్‌షాపులు కొన‌సాగుతున్నా ప‌ట్టించుకోవ‌డం లేదు. గుడుంబా త‌యారీదారుల‌ను నియంత్రించేందుకంటూ కాలం పొద్దుపుచ్చే విధులు, విధానాలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో విభాగంలో కొన‌సాగుతున్న‌ట్లు ఆరోప‌ణ‌లున్నాయి.

ఇప్పుడే వ‌చ్చా... చ‌ర్య‌లు తీసుకుంటాం : అంజ‌న్‌రావు, వ‌రంగ‌ల్ ఎక్సైజ్ డిప్యూటీ క‌మిష‌న‌ర్

ఉమ్మ‌డి వరంగ‌ల్ జిల్లాలో జ‌రుగుతున్న మ‌ద్యంపై సిండికేట్ వ్య‌వ‌హారాన్ని దిశ ప్ర‌తినిధి వ‌రంగ‌ల్ ఎక్సైజ్ డీసీ అంజ‌న్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయ‌న స్పందిస్తూ తాను బాధ్య‌త‌లు తీసుకుని వారం రోజుల కూడా గ‌డ‌వ లేదు. మ‌ద్యం అక్ర‌మ ర‌వాణా, విక్ర‌యాల‌పై ఖ‌చ్చితంగా దృష్టి పెడుతాను. మ‌ద్యం సిండికేటును ఎట్టి ప‌రిస్థితుల్లో ప్రొత్స‌హించ‌ను. వారిపై చ‌ర్య‌లు తీసుకుంటానని పేర్కొన్నారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ నాగేంద్ర వివ‌ర‌ణ తీసుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా ఫోన్లో స్పందించ‌లేదు.

Advertisement

Next Story

Most Viewed