మైనింగ్ ​పై మౌనమేలా ?

by Sumithra |
మైనింగ్ ​పై మౌనమేలా ?
X

దిశ, తొర్రూరు : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామంలో పెద్ద చెరువును ఆక్రమించుకుని కేజీఎన్ క్వారీ నిర్వాహకులు శిఖం భూమిలో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు. ఎఫ్టీఎల్ మైనింగ్ చేసుకోవడానికి ఇరిగేషన్ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు జరుపుతున్నారు. కేజీఎన్ నిర్వాహకులు మాత్రం రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు పొందామని చెబుతున్నారు. కానీ రెవెన్యూ అధికారులు కేజీఎన్ క్వారీ నిర్వాహకులకు నోటీసులు ఇవ్వడం విశేషం. కంఠాయపాలెం పెద్దచెరువులో ఎలాంటి సర్వేలు చేయకుండానే క్వారీ నిర్వాహకులకు నోటీసులు పంపడం గమనార్హం. ఎఫ్టీఎల్ తవ్వకాలకు ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల అనుమతులు తీసుకోవాలి. కానీ ఎటువంటి అనుమతులు పొందకుండానే కేజీఎన్ క్వారీ నిర్వాహకులు చెరువు శిఖంలో రెండున్నర ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు అక్రమంగా గ్రానైట్ తవ్వకాలు జరుపుతున్నారని అధికారులే స్పష్టంగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా తాము రెవెన్యూ శాఖ నుంచి రోడ్డు నిర్మాణానికి పర్మిషన్ పొందినట్లుగా క్వారీ యాజమాన్యం వింత వాదనను తెరపైకి తీసుకురావడం గమనార్హం. ఇరిగేషన్ పరిధిలోని చెరువుల్లో రెవెన్యూ శాఖ అధికారులు ఎలా పర్మిషన్లు ఇస్తారు..? మైనింగ్ అధికారులు ఏ విధంగా మౌనం పాటిస్తారు అన్న దానికి అటు రెవెన్యూ అధికారులు నుంచి ఇరిగేషన్ అధికారులకు సరైన సమాధానం లేకపోవడం గమనార్హం.

పలుసార్లు పత్రికలో ప్రచురించినా చర్యలు శూన్యం..

తొర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామ శివారులోని పెద్ద చెరువును ఆనుకుని కేజీఎన్ క్వారీ నిర్వాహకులు చెరువులో అక్రమంగా మైనింగ్​ చేస్తున్నారని పలుసార్లు పత్రికలో ప్రచురించారు. అయినా క్వారీ నిర్వాహకుల పై సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కేజీఎన్ క్వారీ నిర్వాహకుల పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

నోటీసులు జారీ చేశాం.. తహశీల్దార్

కంఠాయపాలెం గ్రామ శివారులోని పెద్ద చెరువును ఆనుకొని ఉన్న కేజీఎన్ క్వారీ నిర్వాహకులు అక్రమంగా శిఖం భూమిలో మైనింగ్ చేస్తున్నారనే ఆరోపణలు తమ దృష్టికి వచ్చిందని తొర్రూరు తహశీల్దార్ జీ శ్రీనివాస్ అన్నారు. కేజీఎన్ క్వారీ నిర్వాహకులకు నోటీసులు పంపాం. నిర్వాహకులకు 15 రోజుల గడువు ఉందన్నారు. ఆలోపు సరైన అనుమతి పత్రాలు చూపించకుంటే వారి పై చర్యలు తీసుకుంటామన్నారు.

ఎంజాయ్​మెంట్ సర్వే చేయిస్తాం..

కంఠాయపాలెం గ్రామ శివారులోని పెద్ద చెరువులో కేజీఎన్ క్వారీ నిర్వాహకులు ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతులు లేకుండా మైనింగ్ చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని తొర్రూర్ డీఈ, ఇరిగేషన్, సునీల్ కుమార్ అన్నారు. ఇరిగేషన్ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. రెవెన్యూ అధికారులు అనుమతులు ఇచ్చారని కేజీఎన్ నిర్వాహకులు చెబుతున్నారు. రెవెన్యూ అధికారులతో ఎంజాయ్​మెంట్ సర్వే చేయించి అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. మా నివేదిక ప్రకారం కేజీఎన్ క్వారీ హద్దులు చెరువు శిఖంలోనే ఉన్నాయని తమ ప్రాథమిక సర్వేలో తెలిసిందన్నారు. సర్వే చేయించి ప్రభుత్వ భూమిని కాపాడుతామన్నారు.

Advertisement

Next Story

Most Viewed