- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mining:మైనింగ్ ‘ఘనులు’.. గ్రీన్‌ఫీల్డ్ కాంట్రాక్టు సంస్థ అక్రమాలకు అధికారుల వెన్నుదన్ను
దిశ,వరంగల్ బ్యూరో/ మరిపెడ : ఖమ్మం నుంచి వరంగల్ వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు చేపడుతున్న శ్రీ ఇన్ఫ్రా టెక్ కాంట్రాక్టు సంస్థ మైనింగ్ తవ్వకాల్లో అడుగడుగునా నిబంధనలను ఉల్లంఘిస్తోంది. విజయవాడ టు నాగపూర్ వరకు నిర్మిస్తున్న ఎకనామికల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి జిల్లాల మీదుగా వెళ్తోంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తాళ్లసంకిస నుంచి వరంగల్ జిల్లా నెక్కొండ వరకు ఇప్పుడు పనులు వివిధ స్థాయిలో కొనసాగుతున్నాయి.
ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్, కురవి, మహబూబాబాద్, చిన్నగూడూరు, మరిపెడ, నెల్లికుదురు, ఇనుగుర్తి, కేసముద్రం మండలాల్లో పనులు చురుకుగా సాగుతున్నాయి. ఆయా గ్రామాల్లో రోడ్డు నిర్మాణ పనులు కొనసాగిస్తోంది. రోడ్డు నిర్మాణానికి గాను సమీప ప్రాంతాల్లో ఎంపిక చేసుకున్న చెరువులు, ప్రభుత్వ భూముల్లోంచి మట్టి తవ్వకాలకు ఆయా మండలాల తహసీల్దార్లు, జిల్లా మైనింగ్, డివిజన్ ఇరిగేషన్ అధికారులు పర్మిషన్లు జారీ చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. తాత్కాలిక పర్మిషన్ల మాటున కాంట్రాక్టు సంస్థ అనుమతికి మించిన తవ్వకాలు, తోలకాలు జరుపుతోంది. ఇదే విషయంపై గత కొద్దిరోజులుగా దిశ దిన పత్రిక వరుస కథనాలు ప్రచురిస్తూ వస్తోంది.
అక్రమాలపై విచారణ ఏది..? తనిఖీలేవీ..?
కాంట్రాక్టు సంస్థ మైనింగ్ అక్రమాలపై దిశ స్పష్టమైన ఆధారాలను అధికారుల కళ్ల ముందుంచుతూ కథనాలు ప్రచురించింది. ప్రజల నుంచి ఆరోపణలు, స్వయంగా కార్యాలయాలకు వెళ్లి ప్రజా సంఘాల నేతలు, గ్రామస్తులు ఫిర్యాదులు చేసినా స్పందించకపోవడం మూడు శాఖల అధికారుల పనితీరుపై అనుమానాలు కలగకమానడం లేదు. కాంట్రాక్టు సంస్థ నుంచి భారీగానే ముడుపులు తీసుకుని అందుకే విచారణ చేయడం లేదు.. తనిఖీలకు రావడం లేదు... కనీసం ఫిర్యాదులపై వివరణ కూడా ఇవ్వడం లేదంటూ ఇరిగేషన్, మైనింగ్, రెవెన్యూ అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. నిర్ధిష్టమైన ఆరోపణలు వచ్చిన్నప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి తనిఖీలు, కొలతలు నిర్వహించి నివేదిక తయారు చేయాల్సిన ఇరిగేషన్, మైనింగ్ అధికారులు ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కొలతలు నిర్వహించాం.. ఏం అక్రమాలు జరగలేదని తేలిందంటూ.. అసలు చెరువునే సందర్శించకుండానే ఓ డివిజన్ డీఈ సమాధానం చెప్పడం చూస్తుంటే కాంట్రాక్టు సంస్థతో సదరు డివిజన్ ఇరిగేషన్ అధికారులు కుమ్మక్కయ్యారనే ఆరోపణలకు బలం చూకూరుతోంది.
నిబంధనలకు పాతర..!
మట్టిని తరలించే ప్రాంతాల నుంచి గ్రామస్తుల అభ్యంతరాలు స్వీకరించకుండానే ఎమ్మార్వోలు ఎన్ఓసీలు జారీ చేయడం, ఆ వెంటనే మైనింగ్ అధికారులు పచ్చ జెండా ఊపడం చకచకా జరిగిపోతున్నాయి. ఆయా గ్రామాల్లో కొంతమంది చోటా మోటా లీడర్లు ప్రశ్నిస్తే వారికి కాసింత డబ్బుల ఆశజూపిస్తున్న కాంట్రాక్టు సంస్థ అడ్డురాకుండా చూసుకుంటూ విధ్వంసం సృష్టిస్తోంది. ఇదిలా ఉండగా కల్వల గ్రామంలోని సప్పిడిగుట్ట సహా ఇతరప్రాంతాల్లోనూ సదరు కాంట్రాక్టు సంస్థ అనుమతులు పొందడానికి ముందు నుంచే తవ్వకాలు మొదలు పెట్టినట్లుగా గ్రామస్తులు తెలియజేస్తున్నారు. నిబంధనల ప్రకారం రాత్రివేళల్లో తవ్వకాలు, రవాణా నిషేధం. పరిమితికి మించి కూడా రవాణా చేయకూడదు. కానీ ఇవేం పట్టించుకోకుండా అధికార యంత్రాంగం సదరు సంస్థకు పూర్తి అండదండలు ప్రదర్శిస్తుండటం గమనార్హం.
ఈ ప్రాంతాల్లో అనుమతులు..!
మహబూబాబాద్ మండలం మాధవపురం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 306/B/ 1/ 3లలో 1.180హెక్టార్ల విస్తీర్ణంలో 14వేల మెట్రిక్ టన్నుల మొరం తవ్వకాలకు శ్రీ ఇన్ఫ్రా టెక్ కాంట్రాక్ట్ సంస్థకు మైనింగ్ శాఖ ఏడీ అనుమతి ఇచ్చింది. అలాగే ఇదే గ్రామంలో 307/A/1/4, 303/A/3/5, 306/P సర్వే నెంబర్ల నుంచి 9.950 హెక్టార్లలో 15600 మెట్రిక్ టన్నుల మొరం తవ్వకాలకు అనుమతి ఇచ్చారు. కురవి మండలం అయ్యగారిపల్లి గ్రామ సర్వే నెంబర్ 231/Pలో 0.400హెక్టార్ల విస్తీర్ణంలో 12000 మెట్రిక్ టన్నులు, ఇదే మండలంలోని నేరడ గ్రామ సర్వే నెంబర్ 546 /p, 548/pలో 2.000 హెక్టార్ల విస్తీర్ణంలో 10వేల మెట్రిక్ టన్నుల తవ్వకాలకు అనుమతిచ్చారు.
నెల్లికుదురు మండలం వావిలాల గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 283/Pలో 0.390 హెక్టార్ల విస్తీర్ణంలో 23400మెట్రిక్ టన్నులు, ఇదే మండలంలోని నర్సింహులగూడెం గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్172/1/Pలో 1.450 హెక్టార్లలో20వేల మెట్రిక్ టన్నుల తవ్వకాలకు అనుమతిచ్చారు. కేసముద్రం మండలం కల్వల గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 610/1/pలో 2.830 హెక్టార్ల విస్తీర్ణంలో 9వేల మెట్రిక్ టన్నులు, ఇదే మండలంలోని కోమటిపల్లి గ్రామ సర్వే నెంబర్ 311/pలో 2.830 హెక్టార్లలో 22500 మెట్రిక్ టన్నుల మొరం తవ్వకాలకు మహబూబాబాద్ మైనింగ్ ఏడీ వెంకట రమణ అనుమతులు జారీ చేశారు. అనుమతులకు పదిరెట్లు మించిన తోలకాలు జరుగుతున్నా పర్యవేక్షించాల్సిన మైనింగ్, రెవెన్యూ అధికారులు పట్టనట్లుగా ఉంటున్నారు.
ఫీల్డ్ విజిట్‌కు ఇంకా వెళ్లలేదు..: వెంకట రమణ, మైనింగ్ ఏడీ, మహబూబాబాద్
అక్రమ తవ్వకాలు, అనుమతులకు మించి తవ్వకాలు జరిగినట్లుగా వస్తున్న ఆరోపణలపై విచారణ చేస్తాం. అయితే వర్క్ బిజీలో ఉండి వెళ్లలేకపోయాను. మాధవపురం, అయ్యగారిపల్లి, నేరడ, వావిలాల, నర్సింహులగూడెం, కల్వల, కోమటిపల్లిలో నిర్వహించిన తవ్వకాలకు సంబంధించిన పూర్తి విచారణ చేపడుతాం. సర్వే చేసి నిజనిర్ధారణ చేస్తాం. ఎక్కువ మట్టి తరలించినట్లుగా రుజువైతే తప్పకుండా పెనాల్టీ వేసి యాక్షన్ తీసుకుంటాం.