పనిలేదా.. పనికిరావా..? నిరుపయోగంగా స్వీపింగ్‌ వాహనాలు

by Anjali |
పనిలేదా.. పనికిరావా..? నిరుపయోగంగా స్వీపింగ్‌ వాహనాలు
X

దిశ, వరంగల్‌ టౌన్‌: ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నదనే ఆరోపణలు ఒకపక్క వెల్లువెత్తుతుండగానే, మరోపక్క బల్దియా కొనుగోలు చేసిన వాహనాలను నిరుపయోగంగా మూలనపడేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. లక్షో, రెండు లక్షలో కాదు ఏకంగా రూ.2.50కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనాలను ఉపయోగంలోకి తీసుకురాకుండా చోద్యం చూస్తోంది. 2020లో వరంగల్‌ మహానగర పాలక సంస్థ పరిధిలో రోడ్లను శుభ్రపరిచేందుకు ఛాలెంజర్‌ కంపెనీకి చెందిన రెండు వాహనాలను కొనుగోలు చేసింది. కొనుగోలు ఒప్పందం ప్రకారం రెండు సంవత్సరాల పాటు కంపెనీయే మెయింటనెన్స్‌ చేసి కాలపరిమితి ముగియగానే బల్దియాకు అప్పగించింది. ఆ తర్వాత వాటి మెయింటనెన్స్‌ కోసం బల్దియా టెండర్లు పిలిచింది. ఈ మేరకు సదరు టెండర్‌ దాదాపు రూ.కోటిన్నర రూపాయలకు ఒకరు దక్కించుకున్నారు.

టెండర్‌ పూర్తయి నాలుగు నెలలు దాటినా ఇప్పటివరకు ఆ వాహనాలను టెండర్‌దారుడికి అప్పగించడంలో పాలకులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఫలితంగా వాహనాలు రోడ్లపైకి రాకుండా బల్దియా ఎదుట ఎగ్జిబిషన్‌లా మారిపోయాయి. అంత పెద్దమొత్తంలో డబ్బులుపోసి కొనుగోలు చేసిన వాహనాలను వాడకపోవడంతో ఎండకు ఎండి వానకు తడిసి తుక్కుగా మారిపోయే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. అయినా బల్దియా అధికారులు, పాలకవర్గం స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

అప్పటివరకు తీయరట!

వాస్తవానికి టెండర్‌ ఖరారు కాగానే ఆ వాహనాలను టెండర్‌దారుడికి అప్పగించాలి. కానీ, వరంగల్‌ బల్దియా అధికారులు వాటిని టెండర్‌ దక్కించుకున్న వారికి అప్పగించకపోవడం వెనుక అసలు కథ వేరే ఉందనే వాదనలు ఉన్నాయి. టెండర్‌ సొమ్ములో కమీషన్‌ కావాలనే డిమాండ్‌ బల్దియా పెట్టినట్లు సమాచారం. ఆ కమీషన్‌ లెక్కలు తేలకపోవడంతోనే వాహనాలను టెండర్‌దారుడికి అప్పగించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా డ్రైవర్లు లేరనే సాకుతో చెత్త సేకరించే మినీ వాహనాలను కొనుగోలు చేసి నెలల తరబడి షెడ్డులోనే దాచిపెట్టారు. చివరకు ఆ విషయాన్ని ‘దిశ’ దినపత్రిక వెలుగులోకి తీసుకురాగా ఎట్టకేలకు ఆ బండ్లను రోడ్డెక్కించారు.

ఇలా కుంటిసాకులతో కమీషన్లకు కక్కుర్తిపడి కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనాలను సక్రమంగా వినియోగించడంలో బల్దియా నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, బల్దియా ఎదుట అట్టబొమ్మల్లా దర్శనమిస్తున్న స్వీపింగ్‌ వాహనాల వ్యవహారంపై మేయర్‌ గుండు సుధారాణిని ఫోన్‌లో సంప్రదించేందుకు ‘దిశ’ ప్రతినిధి ప్రయత్నం చేయగా ఆమె ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. రెండు రోజులుగా ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ‘మీరు కాల్‌ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. మళ్లీ ప్రయత్నం చేయండి’ అనే కంపెనీ వాయీస్‌ మాత్రమే వినిపించడం గమనార్హం.

Advertisement

Next Story