- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Waqf Amendment Bill : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లు

దిశ, వెబ్ డెస్క్ : పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో(Budget Session)నే వక్ఫ్ సవరణ బిల్లు(Waqf Amendment Bill)ను ప్రవేశపెట్టేందుకు కేంద్రం(Central Government) సిద్ధమైంది. ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు కానున్నాయి. తొలి రోజు పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. శుక్రవారం(జనవరి 31) ఆర్థిక సర్వే, శనివారం(ఫిబ్రవరి 1) కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. సోమవారం(ఫిబ్రవరి 3) రాష్ట్రపతి ప్రసంగంపై ఉభయసభలు చర్చిస్తాయి.
ఈ బడ్జెట్ సమావేశాల్లోనే కొత్త బిల్లులు, సవరణ బిల్లులు సహా మొత్తం 17 బిల్లులను ప్రవేశపెట్టెందుకు కేంద్రం సిద్ధమైంది. ఇప్పటికే సమావేశాల జాబితాలో వక్ఫ్ బిల్లు సహా ఆయా బిల్లులను కేంద్ర చేర్చింది. జాబితాలో వక్ఫ్ సవరణ బిల్లుతో పాటు బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు, రైల్వే చట్టం సవరణ బిల్లు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సవరణ బిల్లు సహా మరికొన్ని బిల్లులను కేంద్రం చేర్చింది. కేంద్రం తెచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును పరిశీలించి.. పలు మార్పులు, సవరణలు ప్రతిపాదిస్తూ రూపొందించిన నివేదికకు సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) బుధవారం రోజునే ఆమోదముద్ర వేసింది.
15-11 మెజారిటీతో కమిటీ ఆమోదం తెలిపిందని బీజేపీ ఎంపీ, జేపీసీ చైర్మన్ జగదంబికాపాల్ వెల్లడించారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని.. బిల్లు చట్టరూపం దాలిస్తే వక్ఫ్ బోర్డు తన విధులను మరింత సమర్థంగా, పారదర్శకంగా నిర్వర్తించేందుకు తోడ్పడుతుందని చెప్పారు. వక్ఫ్ ఆస్తుల ప్రయోజనాలు పొందేవారి జాబితాలో తొలిసారి పస్మాందా ముస్లింలు, పేదలు, మహిళలు, అనాథలను చేర్చామన్నారు. 655 పేజీలతో కూడిన తమ నివేదికను గురువారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పిస్తామని చెప్పారు. కాగా వక్ఫ్ బిల్లును రాజ్యాంగ విరుద్ధమని విపక్షాలు మండిపడ్డాయి. జేపీసీ కమిటీ పనితీరుపైన, అది ఆమోదించిన బిల్లుపైన కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఆప్, ఎంఐఎం సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
‘వక్ఫ్ బై యూజర్ (దీర్ఘకాలం వక్ఫ్ బోర్డు వినియోగంలో ఉండే ఆస్తి దానికే శాశ్వతంగా సంక్రమిస్తుంది. కోర్టుల్లో సవాల్ చేయడానికి వీల్లేదు)’ అనే నిబంధనను తొలగించడాన్ని ఒవైసీ వ్యతిరేకించారు. ముస్లింలకు రాజ్యాంగపరంగా ఉన్న హక్కులపై దాడికే ఈ బిల్లును తెచ్చారని, వక్సబోర్డుల పనితీరులో జోక్యం చేసుకోవడమే ప్రభుత్వ అసలు ఉద్దేశమని విపక్ష సభ్యులు ఆరోపించారు. మత వ్యవహారాలను ఆచరించడంలో రాజ్యాంగంలోని 26వ అధికరణం కింద పౌరులకు లభించిన స్వేచ్ఛకు ఇది విరుద్ధమని అవి మండిపడుతున్నాయి. హిందువుల దేవాదాయ-ధర్మాదాయ పరిషత్తులు, సిక్కుల బోర్డులు, క్రైస్తవుల బోర్డుల్లో ఆయా మతాలవారు తప్పిస్తే వేరే మతాలవారు లేనప్పుడు ముస్లింల విషయంలోనే అలా చేయాలనుకోవడం ఏమిటని కాంగ్రెస్ సభ్యుడు ఇమ్రాన్ మసూద్ ప్రశ్నించారు.