Miss World: నగరంలో మిస్ వరల్డ్ పోటీలు ‘కల్చరల్ జిహాద్’.. విశ్వహిందూ పరిషత్ వార్నింగ్

by Ramesh N |
Miss World: నగరంలో మిస్ వరల్డ్ పోటీలు ‘కల్చరల్ జిహాద్’.. విశ్వహిందూ పరిషత్ వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు (Miss World 2025) జరగనున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ప్రముఖ ప్రాంతాలు, దేవాలయాల వద్ద ఈ ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించేందుకు పరిశీలిస్తున్నారు. దీనిని (Vishva Hindu Parishad) విశ్వహిందూ పరిషత్ పరిషత్ వ్యతిరేకించింది. ఈ క్రమంలోనే తాజాగా వీహెచ్‌పీ నేత, ఆర్. శశిధర్ (R Shashidhar) మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట, రామప్ప, అనంతగిరి వంటి పవిత్ర స్థలాల్లో అశ్లీల మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించాలని అనుకోవడం సిగ్గుచేటు అని, ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అశ్లీల మిస్ వరల్డ్ పోటీలు భారతీయ సంస్కృతికి దెబ్బతీసే కుట్ర అని ఆరోపించారు.

ఈ ప్రభుత్వ నిర్వహకం వల్ల నేడు డ్రగ్స్ మాఫియా సెంటర్‌గా హైదరాబాద్ మారిందని ఆరోపించారు. అందాల పోటీలు హైదరాబాద్‌లో నిర్వహించి తెలంగాణ యువత భవిష్యత్ ఎటువైపు నెట్టివేయాలని అనుకుంటున్నారు? అని ప్రశ్నించారు. ‘కల్చరల్ జిహాద్’లో భాగంగా తెలంగాణకు మచ్చ ఏర్పడే విధంగా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. 1996 బెంగళూరులో అందాల పోటీల సమయంలో సమాజం వ్యతిరేకించిందని, తర్వాత ముంబాయిలో ఏర్పాటు చేసినప్పుడు కూడా సమాజం అడ్డుకుందని, నేడు హైదరాబాద్‌లో కూడా అదే జరగబోతుందని హెచ్చరించారు.

కాగా, మే నెలలో 7వ తేదీ నుంచి 31 వరకు మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. నగరంలో ప్రారంభ, ముగింపు వేడుకలు ఉంటాయి. ఈ అందాల పోటీల్లో 120 దేశాల నుంచి యువతులు పాల్గొననున్నారు. ఈ పోటీలకు సంబంధించిన అధికారిక ప్రకటనను మిస్ వరల్డ్ లిమిటెడ్ ఛైర్మన్, సీఈవో జూలియా మోర్లీ, తెలంగాణ ప్రభుత్వం, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ కలిసి ఇటీవల ప్రకటించారు. మిస్ వరల్డ్ పోటీలు 2024లో ముంబైలో జరిగాయి. దాదాపు 28 ఏళ్ల తర్వాత 71వ మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఇక ఈ పోటీలో చెక్ రిపబ్లిక్‌కి చెందిన క్రిస్టినా పీజ్కోవా మిస్ వరల్డ్‌గా కిరీటం కైవసం చేసుకుంది.

Next Story

Most Viewed