పులుల సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం విఫలం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Javid Pasha |
పులుల సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం విఫలం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పులుల సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విదుదల చేశారు. తెలంగాణలో రెండు టైగర్ రిజర్వ్స్ ఉన్నాయని, ఒకటి కవ్వాల్ అభయారణ్యం కాగా, రెండవది అమ్రాబాద్ అభయారణ్యమన్నారు. ఇవే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో.. నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ విస్తరించి ఉందన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో భాగంగా రూ.30 కోట్లు బదిలీ చేసిందని, ఇవే కాకుండా రాష్ట్రానికి కాంపెన్సేటరీ ఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (కాంపా) కింద రూ. 3,110 కోట్లు విడుదల చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రూ.2.75 లక్షల కోట్లతో తమది భారీ బడ్జెట్‌ అని గొప్పలు చెప్పుకుంటోందన్నారు.

కానీ రాష్ట్రంలో పులుల సంరక్షణ, పోషణకు రాష్ట్ర వాటా లో భాగంగా అవసరమైన రూ.2.2 కోట్లు నిధులు కేటాయించకపోవడంతో.. రాష్ట్ర బడ్జెట్ ఒక డాంబికంగా స్పష్టమవుతోందని విమర్శించారు. రాష్ట్రంలో పులుల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయలు కూడా విడుదల చేయకపోవడం విచారకరమన్నారు. దాని ఫలితంగా, కవ్వాల్, అమ్రాబాద్‌ రిజర్వ్‌ లో అగ్నిమాపక కార్యకలాపాలు, ఇతర అవసరమైన కార్యక్రమాలకు సరైన ఆర్థిక సహాయం అందడం లేదని ఆరోపించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసి.. దేశంలో పులుల సంఖ్యను పెంచేందుకు కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతుగా నిలవాలని కోరారు. ప్రపంచ అడవి పులుల జనాభాలో భారతదేశంలోనే 70 శాతం పైగా పులులు ఉన్నాయని, దేశంలో అడ్వెంచర్ టూరిజానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed