రేవంత్ చెడ్డీలు విప్పుతాడు.. పేగులు మెడలో వేసుకుంటాడు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Disha Web Desk 12 |
రేవంత్ చెడ్డీలు విప్పుతాడు.. పేగులు మెడలో వేసుకుంటాడు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెడ్డీలు విప్పుతాడని, పేగులు మెడలో వేసుకుంటాడని, కండ్లను తీసి బాల్ ఆడుకుంటాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ కు ముఖ్యమంత్రి అయ్యాననే భావన లేదని, ఆయన ఏదైనా మాట్లాడగలడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఎక్కడ జోడో యాత్ర చేస్తే.. అక్కడ కాంగ్రెస్ కు ఎంతో మంది నాయకులు రాజీనామా చేసి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కు మోడీని విమర్శించేందుకు ఏ రకమైన అంశాలు దొరకడం లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో కాంగ్రెస్ పాలన, బీజేపీ పాలనతో పోలిస్తే నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడాఉందన్నారు. కాంగ్రెస్.. బీజేపీపై అనేక రకాలుగా తప్పుడు ఆరోపణలు చేసినా ప్రజలు వారిని నమ్మలేదని కిషన్ రెడ్డి తెలిపారు.

బీజేపీ పాలనపై అవినీతి ఆరోపణ చేయలేదంటే పాలన ఎలా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ఏ రంగంలో అయినా మోడీ పాలనను తప్పు పట్టే అవకాశం లేకుండా అభివృద్ధి చేశారన్నారు. దుర్మార్గపు, అబద్ధపు, విష ప్రచారాలను కాంగ్రెస్ చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని, దీనిపై రేవంత్ కు కల వచ్చిందో.. రాహుల్ కు కల వచ్చిందోనని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారానికి సంబంధించి ఒక్క సాక్షాన్ని అయినా చూపించాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను నీరుగార్చిందే కాంగ్రెస్ అని కిషన్ రెడ్డి ఫైరయ్యారు. మతపరమైన రిజర్వేషన్లను అమలు చేస్తూ బీసీలకు విద్య, వైద్యాన్ని అందకుండా చేస్తోంది కాంగ్రెస్సేనని ధ్వజమెత్తారు.

సిద్దిపేటలో అమిత్ షా చేసిన ఉపన్యాసాన్ని కాంగ్రెస్ మార్ఫింగ్ చేసిందని కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. ఆ పార్టీ పరిస్థితి ఎంత దిగజారిందో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చన్నారు. అన్ని కులాలకు రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్ ఎజెండా అని సీఎం అంటున్నాడని, కానీ రాష్ట్రంలో బీసీలకు మాత్రం అన్యాయం జరుగుతోందన్నారు. వారి రిజర్వేషన్లు వారికే దక్కాలంటే అది బీజేపీ వల్లే సాధ్యమని కిషన్ రెడ్డి తెలిపారు. రేవంత్ కు ప్రచారంలో ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కూడా చెప్పలేని స్థితిలో ఆయన ఉన్నారని, తమ ప్రధాని అభ్యర్థి ఎవరో కూడా చెప్పలేడన్నారు. రాహుల్ సమర్థ నాయకుడని కూడా చెప్పలేడని చురకలంటించారు. సోనియాగాంధీ పుట్టింది ఇటలీలో కాదు.. భారత్ లో అని కూడా ఆయన చెప్పలేడన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెప్పి కూడా ఓట్లడగలేని పరిస్థితిలో రేవంత్ ఉన్నారని విరుచుకుపడ్డారు. దేవుళ్లపై రేవంత్.. చేసే ప్రమాణాలతో ప్రజలకు న్యాయం జరగదని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల ప్రచారానికి ఎక్కడ స్పందన లేదని, ఆ పార్టీపై అందరూ నిరాశ, నిస్పృహలో ఉన్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తొందరపడి ఓటు వేశామా? అని ప్రజలు ఆలోచన చేస్తున్నారని పేర్కొన్నారు. అమిత్ షా వ్యాఖ్యలను మార్ఫింగ్ చేయడంపై కేసు పెట్టామని, ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశామని కేంద్ర మంత్రి తెలిపారు. రేవంత్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేదంటే తప్పయిపోయిందని లెంపలేసుకుని గద్దె దిగిపోవాలని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఇకపై బీజేపీపై ఇలాంటి అబద్ధాలు చెబితే తాను చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఉద్దేశ్యం కాంగ్రెస్ కే ఉందన్నారు. కాంగ్రెస్ ఏం చేసుకున్నా.. తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాల్లో బీజేపీ గెలవడం ఖాయమని కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ఎజెండాలో తాము పడదలుచుకోలేదని ఆయన తెలిపారు. ఇకపోతే రిజర్వేషన్ల అంశంపై మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందించారు. రిజర్వేషన్లు సమర్థవంతంగా అమలు జరగాలని, అన్ని వర్గాలకు న్యాయం జరగాలని, దీన్ని పటిష్టంగా అమలుచేయాలనే ఆయన కోరారని, ఇందులో మరో ఉద్దేశ్యమేమీ లేదని కిషన్ రెడ్డి స్పష్టంచేశారు.



Next Story

Most Viewed