Kishan Reddy : ఢిల్లీలో దీక్షలంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడబలుక్కున్నాయి.. : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Rajesh |
Kishan Reddy : ఢిల్లీలో దీక్షలంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడబలుక్కున్నాయి.. : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రాన్ని తిట్టడానికే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్చ పెట్టినట్లుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ తన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ రాజధాని అభివృద్ధికి నిధులు కేటాయించడం సంతోషం అని కేంద్ర బడ్జెట్‌పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. రేవంత్ కారణంగానో, కేసీఆర్ దయ వల్లో బీజేపీ గెలవలేదన్నారు. హామీలు అమలు చేయాలని అడిగితే కుంటిసాకులు చెబుతున్నారని సీరియస్ అయ్యారు. ఢిల్లీలో దీక్షలంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడబలుక్కున్నాయని ఫైర్ అయ్యారు.

తెలంగాణలో బీజేపీకి 35శాతం ఓట్ షేర్ వచ్చిందని.. నీతి ఆయోగ్‌ను బహిష్కరిస్తామనడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు. రూ.లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని బీఆర్ఎస్ నాయకులు దివాళా తీశారన్నారు. పదేళ్లుగా కేసీఆర్ వ్యవహరించిన శైలిలోనే సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారన్నారు. రెండు పార్టీల నేతలు పోటీపడి మోడీని విమర్శిస్తున్నారని.. అవినీతి, అసమర్థతతో పాలన చేతకాక కేంద్రాన్ని విమర్శిస్తున్నారన్నారు. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు.

గ్రామ పంచాయతీల నిధులను దారి మళ్లించారన్నారు. ఓట్ల కోసమే తప్ప ప్రజలకు నిదులు ఖర్చు చేయట్లేదని కాంగ్రెస్ సర్కారుపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల కోసం కేంద్రం రూ.6లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు. రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. పునర్విభజన చట్టం కింద అనేక హామీలు అమలు చేశామన్నారు. రామగుండంలో విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ప్రధాని శంకుస్థాపన చేశారన్నారు. గిరిజన వర్సిటీ కోసం కేంద్రం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. జీఎస్టీ పరిహారం కింద రూ.7 వేల కోట్లను రాష్ట్రానికి అందజేశామన్నారు.



Next Story