నిరుద్యోగులు TSPSC పట్ల నమ్మకం కోల్పోయారు: విద్యార్థి సంఘాలు

by Satheesh |
నిరుద్యోగులు TSPSC పట్ల నమ్మకం కోల్పోయారు: విద్యార్థి సంఘాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై నిరసనలు కొనసాగుతున్నాయి. టీఎస్పీఎస్సీపై విద్యార్థులు, నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. దీంతో బుధవారం పోలీసుల బలగాలతో టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. పేపర్ లీకేజీ వ్యవహారంపై నిరసిస్తూ.. ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ సంఘాలు, నిరుద్యోగులు టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టిడి యత్నించారు. దీంతో పోలీసులకు, నాయకులకు మధ్య తీవ్ర తోపులాట ఏర్పడింది.

పొలీసులు వారిని అదుపులోకి తీసుకోని పలు స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలని, పేపర్ లీకేజీపై సీబీసీఐడీతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాన్ఫిడెన్షియల్ విభాగంలోకి ఇతర సెక్షన్లలో డ్యూటీ చేసే వ్యక్తులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎలా ప్రవేశించారో, యూజర్ ఐడీ, పాస్ వర్డ్‌లు వారి చేతికి ఎలా వచ్చాయో పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో వేలాది నిరుద్యోగులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పట్ల నమ్మకం కోల్పోయారని తెలిపారు. వేల రూపాయలు కోచింగ్ సెంటర్లలో వెచ్చించి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువత తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు. అసిస్టెంట్ ఇంజినీర్, వెటర్నరీ సర్జన్ పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని, ఇటీవల నిర్వహించిన అన్ని పోటీపరీక్షలు గురుకుల ప్రిన్సిపాల్, గ్రూప్-1 తదితర ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యారనే సందేహం అభ్యర్థులలో నెలకొందని దీనంతటిపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని కోరారు.

సిట్ వేసి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. కమిషన్ సభ్యులందరి పైన విచారణ చేపట్టాలని తెలంగాణ నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని, అవసరమైతే కొత్త కమిషన్ వేయాలని, ప్రస్తుత కమీషన్ రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు, కె.అశోక్ రెడ్డి రెడ్డి, ఉపాధ్యాక్షులు సంతోష్ రాథోడ్, ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు లెనిన్ గువేరా, నాయకులు కిరణ్, నాగేంద్ర, డీవైఎఫ్ఐ నగర నాయకులు హష్మీ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఓయూలో రోడ్డుపై బైఠాయింపు..

ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని ఎన్టీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు బైరు నాగరాజు గౌడ్ డిమాండ్ చేశారు. చైర్మన్‌ను తొలగించి టీఎస్పీఎస్సీని మొత్తం ప్రక్షాళన చేయాలన్నారు. మొత్తం ఎన్ని పరీక్షల పేపర్లు లీకేజీ చేశారో ఆయా పరీక్షలను మొత్తం రద్దు చేసి మళ్లీ పరీక్షలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రశ్న పత్రాలు లీకేజీ చేసి అమ్ముకుంటున్న వారిని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు.

రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి ఓయూ పీఎస్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు ఎల్ఎస్‌ఓ రాష్ట్ర కార్యదర్శి విజేందర్ పవర్, ఏంఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు ప్రవీణ్ కుమార్, బోనాల నగేష్, నరేందర్, విజయ్ నాయక్ నిరుద్యోగ జేఏసీ నాయకులు గణేష్, కంపటి వెంకట్, శాంతి కుమార్, భీమ్ సేన్, ఫయాజ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed