మీడియాపై కేసీఆర్‌కు ఆగ్రహమెందుకు.. ప్రశ్నిస్తే సౌకర్యాలను కట్ చేస్తారా..? TUWJ

by Satheesh |   ( Updated:2023-08-22 10:16:26.0  )
మీడియాపై కేసీఆర్‌కు ఆగ్రహమెందుకు.. ప్రశ్నిస్తే సౌకర్యాలను కట్ చేస్తారా..? TUWJ
X

దిశ, తెలంగాణ బ్యూరో: జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న (సోమవారం) చేసిన కామెంట్లు ఏ రూపంలో చూసినా సమర్ధనీయం కాదని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ వ్యాఖ్యానించింది. ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలను ప్రచురిస్తున్న, ప్రసారం చేస్తున్న మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను ఇచ్చేది లేదంటూ స్వయంగా సీఎం చెప్పడాన్ని సంఘం తప్పుపట్టింది.

మీడియాలో వచ్చే కథనాలు వాస్తవం కానట్లయితే ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవచ్చని, ఆ హక్కు ఎప్పుడూ ఉంటుందని, చట్టపరమైన చర్యలూ తీసుకోవచ్చని, కానీ దానికి బదులుగా ఇండ్ల స్థలాలను ఇచ్చేది లేదని ప్రకటించడం అసంబద్ధమైన కామెంట్ అని సంఘం స్పష్టం చేసింది.

ఇండ్ల స్థలాలను ఇస్తామని చెప్పిన కామెంట్‌ను తమ సంఘం స్వాగతిస్తున్నదని, కానీ ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలను ఇచ్చే మీడియా సంస్థల్లోని జర్నలిస్టులకు మాత్రం ఇవ్వడం కుదరదని చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్ ఆలీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మీడియా సంస్థలు అవి రూపొందించుకున్న ఎడిటోరియల్ పాలసీకి అనుగుణంగానే అందులో పనిచేసే జర్నలిస్టులు వార్తలు రాస్తారని, ఆ కథనాలకు పాత్రికేయుల్ని జవాబుదారీ చేయడం అసంబద్ధమన్నారు. శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్షాల సభ్యులు ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతున్నారని, అందుకు వారి జీతభత్యాలను, సౌకర్యాలను, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల అభివృద్ధికి విడుదల చేసే నిధులను నిలిపివేస్తున్నారా అని ప్రశ్నించారు.

ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే మీడియా సంస్థల పట్ల ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కేసీఆర్ భిన్నమైన వైఖరితో ఉండడం సమంజసం కాదని జర్నలిస్టు సంఘం స్పష్టం చేసింది. అందరి పట్లా సమదృష్టితో వ్యవహరించినప్పుడే ముఖ్యమంత్రికి హుందాతనం, గౌరవం ఉంటుందన్నారు.

Advertisement

Next Story