ఆర్టీసీ బస్సులు స్టేజ్ వద్ద ఆపట్లేదు.. మహిళల ఆవేదన

by Ramesh N |
ఆర్టీసీ బస్సులు స్టేజ్ వద్ద ఆపట్లేదు.. మహిళల ఆవేదన
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకంలో భాగంగా టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బస్సుల్లో మహిళ ప్రయాణికుల రద్దీ పెరిగింది. అయితే మహిళల ప్రయాణాలు వివాదస్పదంగా మారుతున్నాయి. ఫ్రీ బస్ స్కీం వచ్చినప్పటి నుంచి మహిళలను ఆర్టీసీ సిబ్బంది చులకనగా చూస్తున్నారని, మహిళలు ఉంటే బస్సులు ఆపడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా కండక్టర్, డ్రైవర్‌తో వారంలో ఏదో ఒక లొల్లీ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తాజాగా పెద్దపల్లి ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితమని చెప్పినప్పటికీ తమ గ్రామ స్టేజి వద్ద బస్సును ఆపకుండా అవమానించారని ధర్మారం మండలం కటికనపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఒక పనిపై మంచిర్యాల వెళ్లాల్సి ఉండగా బస్సు ఆపలేదని ఆ గ్రామం నుంచి మరో బస్సులో వచ్చి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వచ్చి నిరసన వ్యక్తం చేసింది. అక్కడే బస్టాప్‌లో ఉన్న ఇతర మహిళలు సైతం మాట్లాడుతూ.. బస్సులు కావాలనే ఆపడం లేదని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్‌గా మారడంతో టీఎస్ ఆర్టీసీ ట్విట్టర్ వేదికగా స్పందించింది. ఘటనపై విచారణ చేపడతామని తెలిపింది.

Advertisement

Next Story