కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను పట్టించుకోవట్లేదు.. టీపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వై.అశోక్ కుమార్

by Javid Pasha |
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను పట్టించుకోవట్లేదు.. టీపీటీఎఫ్‌ రాష్ట్ర  అధ్యక్షుడు వై.అశోక్ కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్టం ఏర్పడ్డ అనంతరం విద్యను పొందాల్సిన పేదల పిల్లలు, విద్యారంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా సమస్యలలో ఉన్నారని , ఏళ్ల తరబడి అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని టీపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వై.అశోక్ కుమార్ ఆవేదన వ్యక్తం చేసారు. శనివారం టీపీటీఎఫ్‌ రాష్ట్ర మహాసభల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. ఉపాధ్యాయుల కామన్ సర్వీస్ రూల్స్, పండితుల, పీఈటీల అప్ గ్రెడేషన్ కోర్టుల్లో నానుతున్నాయని తెలిపారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు పాలకుల దయా దాక్షిణ్యాల పరిధిలోకి వెళ్ళిందని , గత పి.ఆర్సీ అనుబంధ జి. ఓ లు నేటికీ పూర్తిగా జారీ కాలేదన్నారు. పీఆర్సీ గడువు 2023 జూన్ 30తో ముగిసినప్పటికీ ఐఆర్ ఊసు లేదని, నూతన పీఆర్సీ వేయలేదన్నారు. వేలాది మంది ఉపాధ్యాయులు 317 జీవో బాధితులుగా మారారని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడుగు, బలహీన వర్గాల, మహిళల అభివృద్ధికి విద్య తోడ్పడాలనే లక్ష్యంతో టీపీటీఎఫ్‌ పనిచేస్తుందని అన్నారు. కేజీబీవీ టీచర్స్ వెట్టిచాకిరితో మగ్గుతున్నారని , మోడల్ స్కూల్, రెసిడెన్షియల్, ఆశ్రమ పాఠశాలలు, ఐటిడీఎ పాఠశాలల ఉపాధ్యాయులు అనేక సమస్యలతో అనునిత్యం ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. విద్యారంగానికి నిధుల కేటాయింపులు తగ్గిస్తూ పదోన్నతులు, నియామకాలు చేపట్టక పోవడం వల్ల పర్యవేక్షణ అధికారులు, ఉపాధ్యాయులు లేక పాఠశాలలు కునారిల్లుతున్నాయని తెలిపారు. విద్యను ఉమ్మడి జాబితాలో నుండి తొలగించేందుకు కుట్ర జరుగుతుందని అయన ఆవేదన వ్యక్తం చేసారు.

‘‘కుల వృత్తుల స్థిరీకరణ, మెరిట్ పేరుతో రిజర్వేషన్ల రద్దుకు పూనుకున్నది. సిలబస్ హేతుబద్ధీకరణ పేరుతో విద్యలో అశాస్త్రీయ అంశాలను చొప్పించడం జరుగుతోంది. ఈ పరిస్థితుల మార్పుకోసం టిపిటిఎఫ్ నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలోనే రెండవ విద్యా మహాసభలను 2023 అక్టోబర్ మూడవవారం ఖమ్మం పట్టణంలో నిర్వహిస్తున్నాం’’ అని చెప్పారు . ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ ప్రధాన అంశంగా ఉచిత నిర్భంద విద్య, కామన్ స్కూల్ విద్య, శాస్త్రీయ విద్య ,విద్యారంగ సమస్యలపై, సమాజం ఎదుర్కొంటున్న సవాళ్ళపై వేలాది మంది ఉపాధ్యాయుల, విద్యాభిమానులతో ఈ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు.

Advertisement

Next Story