- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యుత్ రంగం తర్వాత CM రేవంత్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..!
దిశ, తెలంగాణ బ్యూరో: గత ప్రభుత్వ హయాంలో వేల ఎకరాల భూమి పరాధీనమైందన్న ఆరోపణలు ఉన్నాయి. ధరణిని అడ్డం పెట్టుకొని కొంతమంది అక్రమార్కులు ఈ వ్యవహారం సాగించినట్లు విమర్శలు వచ్చాయి. వీరికి కొందరు ఐఏఎస్ అధికారులు సైతం వత్తాసు పలికినట్లు ప్రచారం జరిగింది. దీంతో విద్యుత్ రంగం తర్వాత ధరణి పోర్టల్‌పైనే సీఎం రేవంత్ రెడ్డి సమీక్షకు సిద్ధమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. ధరణిని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ నేతలు, కొందరు మంత్రులు సాగించిన భూ కబ్జాల బాగోతాలను వెలికి తీసేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. ఎవరెంత స్వాహా చేశారో లెక్కలు తీసే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టనున్నట్లు సమాచారం. దీంతో అక్రమార్కులకు సహకరించిన అధికారుల బాగోతం కూడా బయటపడనున్నది.
సమగ్ర అధ్యయనం
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానాంశాల్లో భూ కబ్జాలు, ధరణి పోర్టల్ కూడా ఉన్నాయి. ధరణి స్థానంలో మెరుగైన భూ పరిపాలనకు భూమాతను ప్రవేశ పెడతామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాతీర్పును చూస్తే వివాదాల్లేని వ్యవస్థ రూపకల్పన వైపే ప్రజలు మొగ్గు చూపినట్లు తెలుస్తున్నది. అయితే ధరణి పోర్టల్ స్థానంలో మెరుగైన వ్యవస్థ రూపకల్పనకు శాస్త్రీయ అధ్యయనం తప్పనిసరి అని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ప్రక్షాళన దిశగానే అడుగులు ఉండొచ్చని కొంత కాలంగా రెవెన్యూ అంశాల్లో ఆయనకు సలహాలు, సూచనలు ఇస్తున్న ఓ అధికారి ‘దిశ’కు వివరించారు.
అయితే ధరణి పోర్టల్ పుట్టుక వెనుకున్న ఆంతర్యమేమిటి? ఎందుకోసం దీన్ని రూపకల్పన చేశారు? అనే కోణంలో ప్రభుత్వం సమగ్ర అధ్యయనం చేయనున్నట్లు తెలిసింది. ఎలాంటి తప్పులు లేవంటూనే సవరణలకు 33 మాడ్యూళ్లను తీసుకురావాల్సిన అవసరమేర్పడింది? దీని వల్ల ఎవరికి లాభం జరిగింది? నష్టపోయిన సామాన్యులెవరు? ఇలాంటి అనేక ప్రశ్నల పరంపర నుంచే ప్రక్షాళన స్టార్ట్ కానున్నదని సమాచారం. కక్ష సాధింపు ధోరణిలా కాకుండా ప్రజలకు ఎలా మేలు చేయాలన్న కోణంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు సమాచారం.
అంటకాగిన ఐఏఎస్‌లు
ధరణి పోర్టల్ రూపకల్పన, అమలులో అప్పటి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్‌దే కీలక పాత్ర. ఎవరెన్ని చెప్పినా, ఏం సూచనలు చేసినా పట్టించుకోకుండా పాలకులను పక్కదారి పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆగమేఘాల మీద పనులు నిర్వర్తించి ఆదాయ మార్గాలను వెతకడంలో ఆయన బిజీగా గడిపారు. లక్షలాదిగా వస్తున్న ఫిర్యాదులను పక్కన పెట్టి ధరణి పోర్టల్ ప్రపంచంలోనే అద్భుతమైనదంటూ కీర్తించారు. మాజీ సీఎం కేసీఆర్‌ని ఆకాశాన్ని ఎత్తినంత పని చేశారు. ఇక కొందరు జిల్లా కలెక్టర్లయితే పెద్దోళ్లు ఎప్పుడు ఫోన్ చేస్తారా? ఎప్పుడు సంతకం పెట్టాలా? అని ఎదురుచూశారు.
ఆ పని చేయొచ్చా? చేయకూడదా? చట్టానికి లోబడే చేస్తున్నామా? ఇలాంటివేం చూసుకోలేదు. ఆఖరికి కోర్టుల్లో కేసులు నడుస్తుండగానే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, ఎన్వోసీలు జారీ చేస్తూ ప్రశంసలు పొందారు. 10 మందికి పైగా ఐఏఎస్ అధికారులు ఈ భూ కుంభకోణాల్లో ఇరుక్కునే అవకాశం ఉందని అంచనా. మంత్రులు ఒక్క పని చెప్తే.. దాని చాటున నాలుగు ఫైళ్లు వెనుకేసుకున్న ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు. ఒకటి ఫ్రీ.. మరో నాలుగు లాభం అన్నట్లుగా ధరణి పోర్టల్ దందా సాగిందనే ఆరోపణలున్నాయి. ఇప్పుడీ ఐఏఎస్ అధికారులు కీలక స్థానాల్లోనే ఉన్నారు. అయితే రేవంత్ సర్కార్ వీరిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నదో వేచి చూడాలి.
ఎన్నికల సమయంలోనూ..
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అత్యంత ఖరీదైన భూములు చేతులు మారాయి. ప్రధానంగా హైదరాబాద్ నగర శివార్లలో లెక్కలేనన్ని పేర్లు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో క్లాసిఫికేషన్ చేంజ్‌కి సంబంధించిన ఫైళ్లు కదిలాయని తెలిసింది. ఇందులో దాదాపు కొన్ని వందల ఎకరాల వక్ఫ్ భూమిని పట్టాగా మార్చారని సమాచారం. ఎన్నికలకు రెండు రోజుల ముందు కూడా సీసీఎల్ఏలోనూ పెద్ద చర్చ నడిచింది.
స్ధానిక తహసీల్దార్లు, ఆర్డీవోలు, కలెక్టర్లకు తెలియకుండానే ఉన్నత స్థాయిలోనే డిజిటల్ సంతకాలు జరిగినట్లు వార్తలొచ్చాయి. కనీసం కింది స్థాయి నుంచి ఎలాంటి రిపోర్టులు కూడా లేకుండానే చేశారు. తమకు తెలియకుండానే ఫైళ్లు క్లియర్ అవుతున్నాయంటూ తహసీల్దార్ వర్గాల్లో చర్చ జరిగినట్లు తెలిసింది. దీన్ని బట్టి ఎవరో ఉన్నత స్థాయి వ్యక్తులు క్లియరెన్స్‌కి మౌఖిక ఆదేశాలు ఇవ్వడం ద్వారానే జరిగి ఉంటుందనే చర్చ జరుగుతున్నది. ఇలాంటి అనేక కీలక అంశాలపై కొత్త ప్రభుత్వం సీరియస్ గానే తీసుకోనున్నది.
కొత్త రూట్
ధరణి పోర్టల్ స్థానంలో భూ మాతను రూపకల్పన చేయడానికి ముందు కసరత్తు తీవ్రంగానే ఉంటుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. దీనికి గాను అధికారిక కమిటీ వేస్తారా? నిపుణులతో ప్రత్యేక కమిటీని నియమిస్తారా? అన్నది తేలాల్సి ఉన్నది. సమగ్ర అధ్యయనానికి కొత్త రూట్ వేయనున్నారు. అయితే ధరణి పోర్టల్‌ని అడ్డం పెట్టుకొని రూ.వేల కోట్లు సంపాదించిన పెద్ద మనుషులకు మాత్రం కొత్త నిర్ణయాలు సహించేలా కనిపించడం లేదు. అందుకే కొందరు అక్రమార్కులు ఎన్నికల సమయంలో ఆపసోపాలు పడ్డారన్న ప్రచారం కూడా ఉన్నది. ఎన్నికల ఖర్చు భరించేందుకు కూడా రహస్య సమావేశాలు నిర్వహించారన్న వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే త్వరలోనే ధరణి పోర్టల్ ఆధారిత అక్రమాలు నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటున్నది.