- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
మేనిఫెస్టోపై T- కాంగ్రెస్ ఫోకస్.. బీఆర్ఎస్‌ను భారీ దెబ్బకొట్టేలా హస్తం మాస్టర్ ప్లాన్..!
దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల మేనిఫెస్టో తయారీపై కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నది. ప్రజలకు ఏం హామీలిస్తే, పార్టీకి అండగా నిలుస్తారనే అంశంపై దృష్టి సారించింది. రెండు సార్లు అధికారానికి దూరంగా ఉన్న పార్టీని, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పవర్‌లోకి తీసుకువచ్చేలా మేనిఫెస్టో ఉండాలనేది కాంగ్రెస్ లక్ష్యం. దీంతో ఏయే అంశాలను పొందుపరచాలనే దానిపై కసరత్తును మొదలు పెట్టింది. ప్రజల అవసరాలు, దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారంతో పాటు భవిష్యత్‌లో మెజార్టీ ప్రజలకు ఉపయోగపడేలా కార్యక్రమాలను రూపొందించాలని పార్టీ భావిస్తున్నది.
దీంతో ఈ సారి కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రజలను ఆకట్టుకునేలా తయారు చేయాలని లీడర్లు ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా సూచించినట్లు కాంగ్రెస్ నేతలు వివరిస్తున్నారు. దీంతో మేనిఫెస్టోకి అవసరమైన అంశాలను నివేదిక రూపంలో ఇవ్వాలని ఢిల్లీ అధిష్టానం, ముఖ్య లీడర్లు, సీనియర్లు, టీపీసీసీ కమిటీలు, ఎన్ఎస్యూఐ, మహిళా, కిసాన్ కాంగ్రెస్ నేతలను కోరినట్లు సమాచారం. ఏఐసీసీ, టీపీసీసీ నేతలు సమన్వయంతో రిపోర్టు ఇవ్వాలని సూచించింది. పూర్తి స్థాయి పరిశీలన తర్వాత మేనిఫెస్టో అంశాలు ఫైనల్ అవుతాయని ఏఐసీసీకి చెందిన ఓ కీలక నేత దిశకు తెలిపారు.
బీఆర్ఎస్ హ్యాండ్ ఇచ్చిన హామీలపై కూడా..
2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హామీలు ఇచ్చి, ఇప్పటి వరకు అమలు చేయని హామీలపై కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యయనం చేస్తున్నది. సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేసి ప్రజలకు స్పష్టంగా వివరించాలని లక్ష్యం పెట్టుకున్నది. అంతేగాక సాధ్యమైనవన్నింటినీ మార్పులు చేస్తూ కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పొందుపరిచేందుకు సిద్ధమైంది. ఈ మేరకు టీపీసీసీ త్వరలో ప్రత్యేక కమిటీని కూడా వేయనున్నది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన అనంతరం ప్రాసెస్ మొదలవుతుందని ఓ లీడర్ తెలిపారు.
ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రూ.2 లక్షల రుణమాఫీ, అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ, ఉద్యోగాలు లేని నిరుద్యోగులకు నెలకు రూ.4 వేలు నిరుద్యోగ భృతి, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటించడం, రేషన్ షాపులో సంచితో పాటు 9 రకాల సరుకులు ఇవ్వడం, పెరిగిన గ్యాస్ ధరను తగ్గించి రూ.500 లకు ఇవ్వడం, పావలా వడ్డీకి, వడ్డీలేని రుణాలు మళ్లీ ఇస్తామని పలు సభలు, సమావేశాల్లో ప్రకటిస్తూనే ఉన్నది. దీంతో పాటు కల్లాల్లోనే ఐకేపీ కేంద్రాల ద్వారా మద్దతు ధరకు పంటను కొనుగోలు చేసేలా ప్రత్యేక వ్యవస్థను తీసుకువస్తామని ఇటీవల కిసాన్ కాంగ్రెస్ నాయకులు కూడా గాంధీభవన్‌లో ప్రకటించారు.
అంతేగాక ఇంట్లో ఉన్న ముసలవ్వలకు, తాతకు ఇద్దరికీ పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నది. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంట్లో ఒకరికి మాత్రమే పింఛన్ అందుతున్నది. దీంతోపాటు ఎక్కువ మంది పేదలకు మేలు జరిగే సొంతింటి కల కూడా నెరవేరేలా ప్రత్యేక స్కీమ్‌ను తేనున్నట్లు కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నది. రెండు గదుల ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేందుకు ఏకంగా రూ.5 లక్షలు ఇవ్వడమే కాకుండా, ఇంటి స్థలాలు కొనుగోలు చేసి ప్లాట్లు కూడా ఇచ్చే విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని మొదలు పెట్టింది.
మేధావులు, విద్యార్థి, ప్రజాసంఘాల నుంచి..
ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తయారు చేసే మేనిఫెస్టో కొరకు మేధావులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నుంచి కూడా పార్టీ ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నది. కొన్ని క్యాంపుల ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరుగుతుందని నేతలు వివరిస్తున్నారు. దీంతో పాటు ఎన్ఆర్ఐల నుంచి అభిప్రాయ సేకరణ జరుగుతుందని టీపీసీసీకి చెందిన ఓ నేత తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి అవసరమైన అంశాలన్నీ తమ మేనిఫెస్టోలో ఉంటాయని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.