బిగ్ బ్రేకింగ్: ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌ వాయిదా.. కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు

by Satheesh |
బిగ్ బ్రేకింగ్: ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌ వాయిదా.. కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ సందర్భంగా ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ వాదిస్తూ.. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 160 మనీ లాండరింగ్ చట్టానికి వర్తించదని స్పష్టం చేశారు. సీఆర్‌పీసీలోని సెక్షన్ 160 ప్రకారం మహిళలను, సీనియర్ సిటిజెన్‌లను, మైనర్లను వారి ఇండ్ల దగ్గరే విచారించాలన్న నిబంధన ఉన్నదని, కానీ మనీ లాండరింగ్ చట్టం ప్రకారం అలాంటి నిబంధనలేవీ లేవని, అందువల్లనే కవితను ఈడీ ఆఫీసుకే పిలిచి విచారిస్తున్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు జోక్యం చేసుకుని.. గతంలో విజయ్ మదన్‌లాల్ కేసులో సీఆర్‌పీసీలోని సెక్షన్ 160ని ఈడీ విచారణకు వర్తించదనే అంశం స్పష్టమైందని ధర్మాసనానికి స్పష్టం చేశారు.

కవిత తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ.. గతంలో శారదా చిట్‌ఫండ్ స్కామ్ కేసులో నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీ పిటిషన్ల సందర్భంగా న్యాయస్థానం నోటీసులు జారీచేసిందని గుర్తుచేశారు. ఢిల్లీలోనైనా లేక వారు నివాసం ఉంటున్న నగరంలోని ఇండ్లలోనైనా విచారించడానికి మహిళలు ఆ పిటిషన్ల సందర్భంగా ప్రస్తావించారని ఉదహరించారు.

కేవలం ఈ అంశానికి సంబంధించి మాత్రమే కాక ఇంకా లోతుగా అనేక విషయాలను విచారణ సందర్భంగా ప్రస్తావించాల్సి ఉంటుందని జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన ధర్మాసనం ముందు స్పష్టం చేశారు. కోర్టు పర్యవేక్షణలోనే దర్యాప్తు జరగాలని విన్నవించారు. లిక్కర్ కుంభకోణం కేసులో ఏకకాలంలో సీబీఐ, ఈడీ దర్యాప్తు జరుపుతూ ఉన్నందున ఇకపైన ప్రత్యేకంగా ఒక సిట్‌ను ఏర్పాటు చేయాలని సిబల్ ప్రస్తావించారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితను ఈడీ అధికారులే నిందితురాలు కాదని, కేవలం అనుమానితురాలు అంటూ స్పెషల్ కోర్టులో చెప్పిన తర్వాత ఆమెను విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీచేసిన సమయంలో ఇన్వెస్టిగేషన్ అనే పదాన్ని వాడారని, ఇది చెల్లుబాటు కాదని సిబల్ ప్రస్తావించారు. నిందితులను మాత్రమే ఇన్వెస్టిగేషన్‌కు రావాలని నోటీసుల్లో పేర్కొంటారని, కానీ కవిత విషయంలో ఆ పదాన్ని వాడడంపై ఉన్న అభ్యంతరాన్ని బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు.

ఈడీ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుని దర్యాప్తు క్రమంలో భాగంగా ఎవరికైనా నోటీసులు ఇచ్చే అధికారం మనీ లాండరింగ్ చట్టం ప్రకారం ఈడీకి ఉంటుందన్నారు. చివరకు సమన్లు జారీ చేయడానికి సీఆర్‌పీసీలోని చాప్టర్ 12 కూడా వర్తిందన్నారు. ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ముందు మధ్యాహ్నం 12.42 గంటలకు మొదలైన విచారణ ఒంటిగంట తర్వాత కూడా కొనసాగి చివరకు మూడు వారాల తర్వాతకు వాయిదా పడింది. ఈ క్రమంలో కవితకు, ఈడీకి లిఖితపూర్వక వాదనలు ఇవ్వాలని సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed