కొత్త రెవెన్యూ చ‌ట్టంతోనే భూ స‌మ‌స్యల‌కు ప‌రిష్కారం

by Bhoopathi Nagaiah |
కొత్త రెవెన్యూ చ‌ట్టంతోనే భూ స‌మ‌స్యల‌కు ప‌రిష్కారం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఆర్వోఆర్ యాక్ట్‌ని మ‌న‌స్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్లుగా డిప్యూటీ క‌లెక్టర్స్ అసోసియేష‌న్ అధ్యక్ష కార్యద‌ర్శులు వి.ల‌చ్చిరెడ్డి, కె.రామ‌కృష్ణలు అన్నారు. భూ భార‌తి పేరుతో వ‌చ్చిన చ‌ట్టంతో రైతుల‌కు ప్రయోజ‌నం చేకూరుతుంద‌న్నారు. అసెంబ్లీలో కొత్త ఆర్వోఆర్ చ‌ట్టాన్ని ప్రవేశ పెట్టడం ప‌ట్ల హ‌ర్షం వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా డిప్యూటీ క‌లెక్టర్స్ అసోసియేష‌న్ అధ్యక్ష కార్యద‌ర్శులు వి.ల‌చ్చిరెడ్డి, కె.రామ‌కృష్ణ, తెలంగాణ త‌హ‌శీల్దార్స్ అసోసియేష‌న్ రాష్ట్ర అధ్యక్ష కార్యద‌ర్శులు ఎస్‌.రాములు, ర‌మేష్ పాక, తెలంగాణ రెవెన్యూ స‌ర్వీసెస్ అసోసియేష‌న్ రాష్ట్ర అధ్యక్ష కార్యద‌ర్శులు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం బుధ‌వారం సీఎం రేవంత్‌రెడ్డికి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డికి ధ‌న్యవాదాలు తెలిపారు.

చ‌ట్ట రూప‌క‌ల్పన‌కు విశేష కృషి చేసిన సీసీఎల్ఏ న‌వీన్ మిట్టల్‌, భూ చ‌ట్టాల నిపుణులు భూమి సునీల్‌కుమార్‌కు ప్రత్యేక ధ‌న్యవాదాలు తెలిపారు. గ‌త చ‌ట్టంతో రైతుల‌కు సేవ చేసే అధికారం కింది స్థాయి అధికారుల‌కు లేకుండా పోయింద‌న్నారు. ఏ చిన్న భూ స‌మ‌స్య వ‌చ్చినా హైద‌రాబాద్‌లోని సీసీఎల్ఏ కార్యాల‌యం వ‌ర‌కు రావాల్సిన ప‌రిస్థతి ఉండేద‌న్నారు. కానీ ఇప్పుడు భూమి ఉన్న ప్రతి రైతుకు ఈ చ‌ట్టంతో పాస్ పుస్తకాలు వ‌స్తాయ‌న్నారు. ఇప్పుడున్న ధ‌ర‌ణి రికార్డును పూర్తిగా ప్రక్షాళ‌న చేసిన త‌ర్వాత‌నే కొత్త చ‌ట్టం కింద న‌మోదు చేస్తార‌న్నారు. మ్యుటేష‌న్‌లో త‌ప్పు జ‌రిగితే అప్పీల్ చేసుకునే అవ‌కాశం ఈ చ‌ట్టం క‌ల్పిస్తోంద‌న్నారు. రిజిస్ట్రేష‌న్ చేసుకున్న త‌ర్వాత వెనువెంట‌నే మ్యుటేష‌న్‌, పాస్ పుస్తకం జారీ అవుతుంద‌న్నారు. వార‌స‌త్వ భూముల‌కు నిర్ణిత గ‌డువులోపు విచార‌ణ చేసిన త‌ర్వాత‌నే పాస్ పుస్తకాల జారీ చేస్తార‌న్నారు. 13బీ, 38ఈ, ఓఆర్‌సీ, లావోని భూముల‌కు ఆర్డీఓల‌కు పాస్ పుస్తకాలు జారీ చేసే అధికారం ఈ చ‌ట్టంలో క‌ల్పించార‌న్నారు.

సాదాబైనామా ద‌ర‌ఖాస్తుల‌కు క్రమ‌బ‌ద్ధీక‌ర‌ణ‌కు ఈ చ‌ట్టం ప‌రిష్కారం అవుతాయ‌న్నారు. గ్రామ కంఠం, ఆబాదీల‌కు కూడా భూమి హ‌క్కుల రికార్డు రాబోతుందన్నారు. మ‌నిషికి ఆధార్ వ‌లె భూ య‌జ‌మానుల‌కు భూధార్ ఇవ్వనున్నట్టుగా తెలిపారు. భూ స‌మ‌స్యల ప‌రిష్కారానికి జిల్లా స్థాయిలోనే రెండు అంచెల అప్పీల్ వ్యవ‌స్థ, ప్రత్యేకంగా ట్రిబ్యున‌ళ్ల ఏర్పాటు చేయ‌నున్నట్టు చెప్పారు. కొత్త రెవెన్యూ చ‌ట్టంతో గ్రామానికో రెవెన్యూ అధికారితో అందుబాటులోకి రెవెన్యూ సేవ‌లు సైతం అందుబాటులోకి వ‌స్తాయ‌న్నారు. స‌రిహ‌ద్దు, డ‌బుల్ రిజిస్ట్రేష‌న్‌ వివాదాలు రాకుండా ఉండేందుకు మ్యుటేష‌న్‌తో పాటు మ్యాప్ కూడా వ‌స్తుంద‌న్నారు. అనుభవదారుడి కాలామ్ కూడా రికార్డ్ లో ఉండే విధంగా తీసుకొస్తున్నారన్నారు. దీంతో భూ అనుభవదారుల హక్కుల పరిరక్షణ కూడా కల్పించడం జరుగుతుందని తెలిపారు. గత చట్టంలో ఈ అవకాశం లేదని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఫూల్‌సింగ్ చౌహాన్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story