టీఆర్ఎస్‌కు సొంత ఫ్లైట్.. ఆ పండుగ రోజే ఆర్డర్

by GSrikanth |   ( Updated:2022-09-30 15:04:42.0  )
టీఆర్ఎస్‌కు సొంత ఫ్లైట్.. ఆ పండుగ రోజే ఆర్డర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అధికార పార్టీ టీఆర్ఎస్ సొంతంగా ఒక విమానాన్ని సమకూర్చుకుంటున్నది. దసరా పండుగ రోజే పర్చేస్ ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నది. పన్నెండు సీట్ల సామర్థ్యంతో కూడిన ఈ విమానాన్ని కొనడానికి సుమారు రూ. 80 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా. జాతీయ పార్టీని పెట్టి బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న కేసీఆర్ దేశ పర్యటన కోసం దీన్ని వినియోగించనున్నారు. విమానం కొనడానికి అవసరమయ్యే నిధులు పార్టీ దగ్గర ఉన్నప్పటికీ విరాళాల ద్వారా సమకూర్చుకోవాలనుకుంటున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సైతం భారీ స్థాయిలో విరాళం ఇవ్వడానికి పోటీ పడుతున్నారు. టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశాన్ని దసరా పండుగ రోజు ఏర్పాటుచేసి ఈ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు వెయ్యి కోట్ల ఆస్తులు ఉన్నాయని, ఇందులో సుమారు రూ. 860 కోట్లు బ్యాంకు డిపాజిట్ల రూపంలో ఉన్నాయంటూ ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్లీనరీ సందర్భంగా పార్టీ శ్రేణులకు వివరించారు. ఆ ప్రకటన తర్వాత పార్టీకి మరిన్ని విరాళాలు కూడా సమకూరాయి. సుమారు రూ. 870 కోట్లకు పైగానే ఆస్తులున్నట్లు పార్టీ వర్గాలు అన్ ఆడిటెడ్ వివరాలను సూచనప్రాయంగా తెలిపాయి. ఇంత ఆస్తులున్నా విమానం కొనడానికి మాత్రం స్వంత డబ్బుకు బదులుగా కొత్తగా విరాళాల రూపంలోనే సేకరించాలనుకుంటున్నది. జాతీయ పార్టీ అవసరాల కోసం మంత్రులు కూడా వీలైనంత ఎక్కువగా ఇవ్వడానికి పోటీ పడుతున్నారు.

గతంలో కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీపడి మరీ ఆంబులెన్సులు సమకూర్చారు. ఇప్పుడు పార్టీ అధినేత పిలుపిస్తే విమానానికి అయ్యే ఖర్చుకు అనేక రెట్లు విరాళంగా ఇవ్వడానికి, ప్రత్యేక గుర్తింపు పొందడానికి, ఆయన దృష్టిలో పడడానికి సిద్ధమవుతున్నారు. శాసనసభా పక్ష సమావేశంలో కేసీఆర్ ప్రకటన చేసిన వెంటనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అక్కడికక్కడే వారి వంతు విరాళాన్ని ప్రకటించనున్నారు. గంటల వ్యవధిలోనే అందుకు సంబంధించిన చెక్కులను కూడా పార్టీ అధినేతకు అందించడానికి సిద్ధమవుతున్నారు.

ఒక ప్రాంతీయ పార్టీగా సొంత విమానాన్ని సిద్ధం చేసుకున్న తొలి దక్షిణాది పార్టీగా టీఆర్ఎస్ గుర్తింపు పొందనున్నది. జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటు సన్నాహకాల్లో భాగంగా చెన్నై, బెంగుళూరు, ముంబై, కోల్‌కతా, రాంచీ, భువనేశ్వర్, ఢిల్లీ లాంటి రాష్ట్రాలకు ప్రత్యేక విమానాన్ని వాడుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళినందున ప్రజా ధనాన్నే వాడుకున్నట్లు విపక్ష నేతలు సైతం దుమ్మెత్తిపోశాయి. ఇప్పుడు ఆ విమర్శలకు తావులేకుండా పార్టీ నేతల నుంచి సేకరించిన విరాళాలతో సొంత విమానాన్ని సమకూర్చుకుని దేశమంతా పర్యటించడానికి శ్రీకారం చుడుతుండడం విశేషం.

జాతీయ పార్టీ ప్రకటన కోసం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం దసరా రోజునే జరగనున్నది. ఆ సమావేశంలోనే జాతీయ పార్టీ గురించిన ప్రకటనతో పాటు దేశవ్యాప్తంగా పర్యటించడానికి విమానాన్ని కొనుగోలు చేయాలన్న నిర్ణయాన్ని కూడా స్వయంగా కేసీఆర్ వెల్లడించనున్నట్లు సమాచారం. పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ ఇప్పటికే ఈ విషయాన్ని చర్చించి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. కొత్త పార్టీ పేరును కూడా దసరా రోజు ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నా పార్టీ వర్గాలు మాత్రం ఇప్పటివరకూ దాన్ని ధృవీకరించలేదు.

ఇవి కూడా చదవండి : ముహూర్తం ఫిక్స్.. పార్టీ శ్రేణులకు కేసీఆర్ కీలక ఆదేశాలు

ఇవి కూడా చ‌ద‌వండి :

'ఎవనిపాలయ్యిందిరో తెలంగాణ'

Advertisement

Next Story