ఎస్సీ వర్గీకరణ ప్రతి గడపకూ వర్గీకరణ ఫలాలు చేరాలి : మంత్రి దామోదర రాజ నర్సింహ

by M.Rajitha |
ఎస్సీ వర్గీకరణ ప్రతి గడపకూ వర్గీకరణ ఫలాలు చేరాలి : మంత్రి దామోదర రాజ నర్సింహ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్సీ వర్గీకరణ ఫలాలు ప్రతిగడపకూ చేరాలని, అణచి వేయబడిన కులాల్లో అసమానతలను రూపుమాపేందుకు వర్గీకరణ అని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. బుధవారం మినిస్టర్ క్వార్టర్స్‌లో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, లక్ష్మికాంతరావు, అడ్లూరి లక్ష్మణ్, మందుల సామెల్, వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు తదితరులు మంత్రి దామోదర రాజనర్సింహాతో భేటీ అయ్యారు. దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ ఆకాంక్షను నెరవేరుస్తున్న సందర్భంగా మంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు. వర్గీకరణను ముందుకు తీసుకెళ్లే అంశంపై మంత్రితో వారు చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... పలు అంశాలపై మంత్రి వారికి దిశానిర్దేశం చేశారు. వర్గీకరణలో అవలంభించిన శాస్త్రీయ పద్ధతులను ప్రజలకు వివరించాలని, ఇతరులు సృష్టించే అపోహలను, అనుమాలను నమ్మి ప్రజలు ఆందోళనకు గురికాకుండా చూసే బాధ్యత ఎమ్మెల్యేలది, మాదిగ సామాజిక వర్గ నాయకులదేనని స్పష్టం చేశారు.

వర్గీకరణకు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అండ...

వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మద్దతుగా నిలిచిందని మంత్రి గుర్తు చేశారు. 2005లో అసెంబ్లీలో వర్గీకరణకు అనుకూలంగా వైఎస్‌ఆర్ తీర్మానం చేశారు. ఈ తీర్మానం ఆధారంగా 2006లో నాటి యూపీఏ ప్రభుత్వం జస్టీస్ ఉషా మెహ్ర కమిషన్ ను నియమించిందన్నారు. 2006లో దవిందర్ సింగ్ వేసిన కేసులో, వర్గీకరణకు అనుకూలంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన వాదనను వినిపించిందన్నారు. 2018లో రాహుల్ గాంధీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నామని, హైదరాబాద్‌లో జరిగిన ఎడిటర్ మీట్‌లో చెప్పారని తెలిపారు. . 2023లో చేవెళ్లలో జరిగిన ఎస్సీ డిక్లరేషన్‌ సభలో, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేగారే స్వయంగా వర్గీకరణకు అనుకూలంగా ప్రకటన చేశారని తెలిపారు. 2023 డిసెంబర్‌‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే, సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా వాదించేందుకు సీనియర్ అడ్వకేట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి నియమించారన్నారు. 2006 నుంచి పెండింగ్‌లో ఉన్న కేసులో, 2024 ఆగస్ట్‌ ఒకటిన తీర్పు వచ్చిందని, తీర్పు వచ్చిన గంట లోపలే వర్గీకరణకు అనుకూలంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేశారని మంత్రి దామోదర రాజనర్సింహా గుర్తు చేశారు.

వెంటనే కేబినెట్ సబ్ కమిటీని నియమించారని, ఆ తర్వాత వన్ మ్యాన్ జ్యుడీషియల్ కమిషన్‌ను నియమించారన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా, జనాభా, విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక, సామాజిక స్థితిగతులను కమిషన్ అధ్యయనం చేసిందన్నారు. ఉమ్మడి పది జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల నుంచి, ఆయా సామాజిక వర్గాల సంఘాల నుంచి రిప్రజంటేషన్లను తీసుకుని, ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో సుమారు 8 వేలకుపైగా వినతులను స్వీకరించి వాటిని క్రోడీకరించిందన్నారు. అన్నిరకాల విశ్లేషణ, అధ్యయనం తర్వాత శాస్త్రీయంగా రూపొందించిన రిపోర్ట్‌ను అందించిందని వెల్లడించారు. కమిషన్ రిపోర్ట్‌ ఇచ్చిన మరునాడే అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేశారని మంత్రి గుర్తు చేశారు. కోర్టు తీర్పు వచ్చిన 6 నెలల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. ఇది కాంగ్రెస్ కమిట్‌మెంట్‌ అని, సీఎం రేవంత్‌రెడ్డి గారికి మాదిగల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి అన్నారు.

అన్ని కులాలకు న్యాయం జరుగుతుంది

ప్రతి కులానికి న్యాయం చేసేలా వర్గీకరణ ఉందని మంత్రి తెలిపారు. అత్యంత వెనుకబడిన 15 కులాలను గ్రూప్‌ 1లో, మద్యస్తంగా ఉన్న 18 కులాలను గ్రూప్‌ 2లో, కొంత మెరుగ్గా ఉన్న కులాలను గ్రూప్‌ 3లో చేర్చాలని కమిషన్ సూచించిందని తెలిపారు. కమిషన్ సూచించినట్టుగా అన్ని వర్గాలకు సమన్యాయం చేసేలా వర్గీకరణ జరుగుతుందని దీనిపై ఎవ్వరూ లేని అపోహలను సృష్టించొద్దన్నారు. మాదిగ,సామాజిక వర్గాల దశాబ్దాల ఆకాంక్ష నెరవేరుతున్న ఈ తరుణాన్ని పండుగలా ఉత్సవాలను నిర్వహించుకోవాలన్నారు. వర్గీకరణ విజయోత్సవాల్లో అందరూ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలకు మంత్రి సూచించారు. సమావేశంలో ప్రొఫెసర్ మల్లేశం, టీపీసీసీ నాయకుడు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed